న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో ఖజానా ఆదాయానికి గండి పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) చెల్లించే డివిడెండ్లపై కేంద్రం ఆశలు పెట్టుకుంది. వీలైనంత అధికంగా, సాధ్యమైనంత త్వరగా డివిడెండ్లు చెల్లించాలంటూ పీఎస్‌యూలకు సూచించింది. త్రైమాసికాలవారీగా చెల్లించేయాలంటూ కాస్త పటిష్టంగా ఉన్న సంస్థలను ఆదేశించింది. కనీస పరిమాణం చెల్లించాలన్న నిబంధనలను పట్టుకుని కూర్చోకుండా సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించేందుకు కృషి చేయాలని పేర్కొంది. దీనివల్ల విడతలవారీగా వచ్చే డివిడెండుపై కాస్త అంచనాకు వచ్చేందుకు, తగు ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు అన్ని పీఎస్‌యూల అధిపతులకు లేఖలు పంపింది.
‘‘మిగతావాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ).. త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రతీ త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశాలను పరిశీలించాలి. మిగతా సీపీఎస్‌ఈలు అర్ధ సంవత్సరానికోసారి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించవచ్చు. ఇక డివిడెండ్ చెల్లింపునకు పెద్దగా అవకాశం లేని సంస్థలు .. వార్షికంగా కట్టే అంశం పరిశీలించవచ్చు. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత తమ తమ అంచనాల ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో కట్టవచ్చు’’ అని పేర్కొంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అంచనాల్లో కనీసం 90 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా విడతలవారీగా మధ్యంతర డివిడెండ్ కింద కట్టడంపై దృష్టి పెట్టాలని దీపం సూచించింది.
ప్రస్తుతం ఆఖర్లో చెల్లింపులు ..
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ లాభాల్లో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం మేర కనీస డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. చాలా మటుకు కంపెనీలు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంటాయి. అయితే, ఇలా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో చెల్లించేటప్పుడు ... ఇతరత్రా సరఫరాదారులకు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి కూడా చేతిలో ఉన్న నిధులనే సర్దుబాటు చేయాల్సి వస్తుండటం .. కంపెనీలకు సమస్యాత్మకంగా మారుతోందని దీపం అభిప్రాయపడింది. చివర్లో కాకుండా ముందు నుంచీ కొంత కొంతగా చెల్లించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఇక స్థిరమైన డివిడెండ్ విధానమంటూ ఉంటే ఇన్వెస్టర్లకు కూడా సీపీఎస్‌ఈ షేర్లపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొంది.
‘‘తరచుగా లేదా మూణ్నెల్లకోసారి డివిడెండ్‌లు చెల్లిస్తున్న పక్షంలో నాణ్యమైన ఇన్వెస్టర్లు.. ఆయా సంస్థల స్టాక్స్‌పై ఆసక్తి చూపవచ్చు. భవిష్యత్ డివిడెండ్లపై ఆశతో వాటిని అట్టే పెట్టుకుని కూడా ఉండవచ్చు’’ అని దీపం తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్లే తాజా ఆదేశాలు తెరపైకి వచ్చి ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణం. పీఎస్‌యూలు ఒకేసారి గాకుండా రెండు లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లిస్తే అవి నగదును మెరుగ్గా నిర్వహించుకోగలవు. అలాగే, ప్రభుత్వం తన రుణ అవసరాలను బేరీజు వేసుకునేందుకు వీలుంటుంది. రుణ సమీకరణ ప్రణాళికలను అర్ధాంతరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బాండ్ మార్కెట్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు.
పీఎస్‌యూలకు ఆర్థికంగా ప్రతికూలం..
మరింత ఎక్కువగా డివిడెండ్ చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి పెంచితే వాటి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధిక డివిడెండ్ చెల్లింపుల కారణంగా అవి తమ పెట్టుబడి వ్యయాల కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ డివిడెండ్ చెల్లించే పరిస్థితిలో కూడా పీఎస్‌యూలు లేవని తెలిపారు. గడిచిన అయిదేళ్లలో ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్‌టీపీసీ, వంటి దిగ్గజాలు తమ లాభదాయకత తగ్గుతూ, రుణభారం పెరుగుతూ ఉన్నప్పటికీ డివిడెండ్లను అదే స్థాయిలోనో లేదా అంతకు మించే చెల్లిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు.
2020 ఆర్థిక సంవత్సరంలో 55 లిస్టెడ్ పీఎస్‌యూలు రూ. 82,750 కోట్ల లాభాలపై రూ. 47,000 కోట్ల మేర డివిడెండ్ చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో నమోదైన 70% పోలిస్తే ఇది కాస్త తగ్గి 57 శాతానికే పరిమితమైనప్పటికీ.. మిగతా కార్పొరేట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే. నిఫ్టీ50 సూచీలోని టాప్ సంస్థలు తమ లాభాల్లో సగటున 45% మాత్రమే చెల్లించాయి. అదే అయిదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ 55 సంస్థలు సుమారు రూ. 3.85 లక్షల కోట్ల లాభాలపై మొత్తం రూ. 2.75 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించాయి. అంటే రికార్డు స్థాయిలో లాభాల్లో ఏకంగా 71.5% చెల్లించాయి. నిఫ్టీ 50 సంస్థలు చెల్లించిన దానికి (32 శాతం) ఇది రెట్టింపు. ఇవి కాకుండా షేర్ల బైబ్యాక్‌ల రూపంలోనూ ప్రభుత్వానికి పీఎస్‌యూలు గణనీయంగా చెల్లించాయి.
Comments
Please login to add a commentAdd a comment