
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది.
బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు.
ఎన్‌పీఏలు డౌన్
క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి.
ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment