ముంబై: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఈ కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ. త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్ మహీంద్రా ఉద్యోగులకు 10 శాతం వేతనాలు పెంచుతున్నాట్టు ప్రకటించారు. ‘‘సరఫరా వైపు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చాం. సగటున ఒక్కో ఉద్యోగికి వేతన పెంపు 10 శాతం మేర ఉంటుంది’’అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.
టెక్ మహీంద్రా లాభం భేష్
ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసికానికి పనితీరు పరంగా అంచనాలకు అందుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.1,506 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం నుంచి) చూసినా నికర లాభం 10 శాతం వృద్ధిని చూపించింది. విశ్లేషకుల అంచనా రూ.1,411 కోట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం వృద్ధితో రూ.12,116 కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)తో పోల్చి చూసినా ఆదాయంలో 5.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి త్రైమాసికంలో ఎస్‌ఈజెడ్ సంబంధిత కేటాయింపులు తిరిగి రావడం కూడా లాభాల్లో వృద్ధికి సాయపడిన అంశాల్లో ఒకటి. 2021–22 ఏడాదికి ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌గా రూ.15 ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘‘ఆవిష్కరణలపై దృష్టి సారించడం, బలమైన కస్టమర్, భాగస్వామ్య ఎకోసిస్టమ్ ఏర్పాటులో మాకున్న సామర్థ్యాలు పటిష్ట వృద్ధికి దోహదపడినట్టు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు.
విభాగాల వారీగా..
- ఎంటర్‌ప్రైజ్ వెర్టికల్ ఆదాయం 5.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కమ్యూనికేషన్ విభాగం స్థిరమైన కరెన్సీ పరంగా 4.8 శాతం వృద్ధి చూపించింది.
- బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం మొత్తం ఆదాయం 15.4 శాతం మేర క్రితం త్రైమాసికంలో ఉంటే, అది మార్చి చివరికి 17.4 శాతానికి విస్తరించింది.
- బ్రెడ్ అండ్ బటర్ కమ్యూనికేషన్స్, తయారీ విభాగాల ఆదాయం సీక్వెన్షియల్‌గా క్షీణతను చూశాయి.
డీల్స్ జోరు...
మార్చి త్రైమాసికంలో బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అతిపెద్ద డీల్‌ను టెక్ మహీంద్రా గెలుచుకుంది. 2021–22 మొత్తం మీద 3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సొంతం చేసుకుంది. యూరోప్‌లో ఒక 5జీ ఆపరేటర్ నుంచి, రిటైల్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి డీల్స్ వచ్చాయి. ‘‘సుస్థిర డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, నూతనతరం టెక్నాలజీపై పెట్టుబడులు కలసి గణనీయమైన వృద్ధికి తోడ్పడడమే కాకుండా.. గత ఏడేళ్లలోనే అతిపెద్ద డీల్ గెలుచుకోవడం సాధ్యపడింది’’అని గుర్నానీ తెలిపారు. కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, మెటావర్స్ విభాగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని చూపిస్తాయన్నారు.
నిర్వహణ మార్జిన్ డౌన్
ఆపరేటింగ్ మార్జిన్ 2021 డిసెంబర్ త్రైమాసికంలో 14.8% ఉంటే, మార్చి త్రైమాసికంలో 13.2 శాతానికి తగ్గిపోయింది. అధిక వేతనాలు, ఉద్యోగులను కాపాడుకునేందుకు చేసిన వ్యయాలు మార్జిన్లపై ప్రభాం చూపించినట్టు కంపెనీ తెలిపింది.
2021–22 సంవత్సరానికి..
ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.44,646 కోట్లకు చేరింది. నికర లాభం కూడా 26 శాతం పుంజుకుని రూ.5,566 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment