న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 722 కోట్లను దాటింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 304 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా విమానాశ్రయాలు, రహదారుల బిజినెస్‌లు లాభాల్లో వృద్ధికి దోహదం చేశాయి.
మొత్తం ఆదాయం సైతం రూ. 25,142 కోట్ల నుంచి రూ. 31,716 కోట్లకు జంప్ చేసింది. 7 ఎయిర్‌పోర్టులలో ప్రయాణికుల సంఖ్య 74 శాతం ఎగసి 21.4 మిలియన్లను తాకగా.. కార్గో 14 శాతం బలపడింది. ఈ బాటలో రహదారులు, మైనింగ్ బిజినెస్‌లు లాభదాయకతకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. దేశీయంగానేకాకుండా, ప్రపంచ స్థాయిలో విజయవంతమైన వ్యాపారాభివృద్ధికి కంపెనీ ప్రతీకగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. నిర్వహణ, ఆర్థిక పటిష్టతకు గతేడాది ఫలితాలు కొలమానమని విశ్లేషించారు.
పాలన, నిబంధనల అమలు, పనితీరు, నగదు ఆర్జనలపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం 218 శాతం దూసుకెళ్లి రూ. 2,473 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 96 శాతం జంప్‌చేసి రూ. 1,38,175 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రెట్టింపునకుపైగా వృద్ధితో రూ. 10,025 కోట్లయ్యింది. ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికుల సంఖ్య 74.8 మిలియన్లకు చేరింది. 2023 మార్చికల్లా కంపెనీ స్థూల రుణభారం రూ. 41,024 కోట్ల నుంచి తగ్గి రూ. 38,320 కోట్లకు పరిమితమైంది.
ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 4.7 శాతం జంప్‌చేసి రూ. 1,925 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment