న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్‌మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి.
డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. దీనితో షిప్‌మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
► దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్‌గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్‌మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది.
► యాపిల్ షిప్‌మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్‌లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది.
► మార్చి త్రైమాసికంలో షిప్‌మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది.
► వన్‌ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది.
► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్‌గా నిల్చింది.
► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్‌మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి.
► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్‌ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
► 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి.
► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్‌గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment