న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల దిగుమతులు (షిప్‌మెంట్) ప్రస్తుత ఏడాది మొత్తం మీద 7 శాతం వరకు తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల కాలంలో స్మార్ట్ టీవీల షిప్‌మెంట్ 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. పండుగల సీజన్ ఉన్నందున ద్వితీయ ఆరు నెలల కాలంలో దిగుమతులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేసింది.
ఓఈఎంలు కొత్త పెట్టుబడుల రూపంలో అదనపు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందున దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీ పెరుగుతున్నట్టు వివరించింది. భారత మార్కెట్లో కొత్త ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు)లు కూడా ప్రవేశిస్తున్నాయని, ప్రముఖ బ్రాండ్లతో టైఅప్ అయ్యి టీవీల తయారీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది.
పెద్ద టీవీలకు డిమాండ్
స్మార్ట్ టీవీల షిప్‌మెంట్ తగ్గినప్పటికీ, పెద్ద తెరల టీవీలకు డిమాండ్ బలంగానే ఉందని, బ్రాండెడ్ టీవీలకు ప్రాధాన్యత (ప్రీమియమైజేషన్) పెరుగుతున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద స్మార్ట్ టీవీల షిప్‌మెంట్ మొదటి ఆరు నెలల్లో 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. భారత్‌లో అమ్ముడయ్యే అధిక శాతం స్మార్ట్ టీవీల్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఆడియో సపోర్ట్ ఉంటున్నట్టు తెలిపింది. జనవరి–జూన్ కాలంలో మొత్తం టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 91 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది.
ద్రవ్యోల్బణం ప్రతికూలం..
ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రజలు కనీస కొనుగోళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని.. టీవీ దిగుమతులు తగ్గడానికి దీన్ని కారణంగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మధ్య శ్రేణి విభాగంలో (రూ.30–50వేల మధ్య) క్యూఎల్‌ఈడీ టీవీలు మరింత ఆదరణకు నోచుకుంటున్నట్టు తెలిపింది. ‘‘మొదటి ఆరు నెలల్లో క్యూఎల్‌ఈడీ టీవీల షిప్‌మెంట్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం పెరిగింది.
మొత్తం టీవీల మార్కెట్లో వీటి వాటా ఇక ముందు కూడా పెరుగుతుంది’’అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్ టీవీల షిప్‌మెంట్‌లో షావోమీ 10 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. శామ్‌సంగ్ రెండో స్థానంలో ఉండగా, వన్‌ప్లస్, ఎల్‌జీ, టీసీఎల్, ఏసర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏసర్, శాన్‌సుయ్ వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లుగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇవి విడుదల చేసే కొత్త బ్రాండ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment