న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 288 శాతం దూసుకెళ్లి రూ. 1,321 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 340 కోట్లు మాత్రమే ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 3,360 కోట్ల నుంచి రూ. 4,072 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 3,099 కోట్ల నుంచి రూ. 2,527 కోట్లకు క్షీణించాయి. 2020–21ను ట్రాన్స్‌ఫార్మేషన్ ఏడాదిగా అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు.
కంపెనీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు రానున్న దశాబ్దానికి పునాదిగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. కస్టమర్లకు అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్ వాటాను 4 శాతంమేర పెంచుకున్నట్లు తెలియజేశారు. ముంద్రా పోర్ట్ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కంటెయినర్ పోర్టుగా మరోసారి ఆవిర్భవించినట్లు వెల్లడించారు. తద్వారా జేఎన్‌పీటీని వెనక్కినెట్టినట్లు పేర్కొన్నారు. సమీకృత రవాణా, లాజిస్టిక్స్ యుటిలిటీగా అదానీ పోర్ట్స్.. 2025కల్లా 500 ఎంటీ కార్గోను హ్యాండిల్ చేసేలక్ష్యంలో సాగుతున్నట్లు వివరించారు.
పూర్తి ఏడాదికి..: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ పోర్ట్స్ టర్నోవర్ 6 శాతం పుంజుకుని రూ. 12,550 కోట్లయ్యింది. పోర్ట్ ఆదాయం 12 శాతం ఎగసి రూ. 10,739 కోట్లను తాకింది. ఇందుకు కార్గో 11 శాతం వృద్ధి చూపడం సహకరించింది. ఇబిటా 15 శాతం బలపడి రూ. 7560 కోట్లకు చేరింది. కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకి ఈ ఏప్రిల్‌లో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని కంపెనీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. జూన్‌కల్లా ఈ లావాదేవీ పూర్తికాగలదని తెలియజేసింది.
కాగా.. గంగవరం పోర్టులో 100 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియలు పూర్తయ్యాక ఈ రెండు పోర్టులూ పూర్తి అనుబంధ సంస్థలుగా ఆవిర్భవించనున్నట్లు అదానీ పోర్ట్స్ పేర్కొంది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులతోపాటు.. డిఘీ పోర్ట్, సర్గూజా రైల్ లైన్ ద్వారా మొత్తం 13 పోర్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
కొలంబోలో కంటెయినర్ టెర్మినల్ పోర్ట్ ద్వారా అంతర్జాతీయ కార్యకలాపాలలో మరో మైలురాయిని అందుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2021–22) 310–320 ఎంఎంటీ కార్గో పరిమాణాన్ని సాధించగలమని అంచనా వేసింది. ఇందుకు క్యూ4(జనవరి–మార్చి)లో గంగవరం పోర్టు నుంచి 10 ఎంఎంటీ కార్గో దోహద పడనున్నట్లు అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1% బలపడి రూ. 768 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment