
2024లో రూ.33.53 లక్షల కోట్ల రుణాలు
గృహ రుణాలు 2024 సెప్టెంబర్ నాటికి రూ.33.53 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ప్రకటించింది. ఏడాది కాలంలో 14 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. ఇందులో మధ్యాదాయ వర్గాలు (ఎంఐజీ) తీసుకున్నవే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో హౌసింగ్ రంగంలో ధోరణులు, పురోగతిపై ఎన్‌హెచ్‌బీ ఒక నివేదిక విడుదల చేసింది. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలు ఉన్నట్లు తెలిపింది.
‘2024 సెప్టెంబర్ నాటికి వ్యవస్థ వ్యాప్తంగా బాకీ ఉన్న వ్యక్తిగత గృహ రుణాల విలువలో తక్కువ ఆదాయ విభాగానికి (ఎల్‌ఐజీ) సంబంధించి 39 శాతం ఉంటే, ఎంఐజీ విభాగానికి 44 శాతంగా ఉన్నాయి. మరో 17 శాతం అధిక ఆదాయ వర్గాలు (హెచ్‌ఐజీ) చెల్లించాల్సినవి’ అని ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.9.07 లక్షల కోట్ల వ్యక్తిగత గృహ రుణాలు మంజూరు కాగా, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో రూ.4.10 లక్షల కోట్లు జారీ అయినట్టు పేర్కొంది. బడ్జెట్‌లో పీఎం ఆవాస్ యోజన 2.0పై చేసిన ప్రకటన, పట్టణీకరణ, డిజిటైజేషన్‌తో గృహ రంగానికి భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది.
హెచ్‌ఎఫ్‌సీలు కీలక పాత్ర
గృహ కొనుగోలుదారుల విస్తృతమైన అవసరాలను తీర్చడంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) కీలక పాత్ర పోషించినట్టు ఎన్‌హెచ్‌బీ తెలిపింది. అర్హతల ప్రమాణాల్లో వెసులుబాట్లు, బలమైన కస్టమర్ సేవలు, మెరుగైన డాక్యుమెంటేషన్, తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం వంటివి హెచ్‌ఎఫ్‌సీలను మెరుగైన స్థానంలో నిలబెట్టాయని పేర్కొంది. సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకూ గృహ రుణాలను విస్తరించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయంటూ.. బ్యాంక్‌లు–హెచ్‌ఎఫ్‌సీల కోలెండింగ్ ఈ దిశగా తీసుకున్న చర్యగా ప్రస్తావించింది.
ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్
ప్రాంతీయ అసమానతలు
హౌసింగ్ రంగం బలమైన వృద్ధిని చూపించినప్పటికీ.. రుణాల మంజూరులో ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాలు హెచ్‌ఎఫ్‌సీలకు పెద్ద సవాలుగా ఎన్‌హెచ్‌బీ పేర్కొంది. ‘దక్షిణాది, పశ్చిమాది, ఉత్తరాది రాష్ట్రాల్లోనే అధిక శాతం గృహ రుణాలు మంజూరవుతున్నాయి. అదే సమయంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుణాల జారీ తక్కువగా ఉంటోంది’ అని నివేదిక వివరించింది. ఈశాన్య ప్రాంతంలో హెచ్‌ఎఫ్‌సీల శాఖల విస్తరణ తక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ తారతమ్యాల తగ్గింపునకు చర్యలు కొనసాగుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment