నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు! | Don't by with advertisments | Sakshi
Sakshi News home page

నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!

Published Fri, Jun 5 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!

నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!

‘పైన పటారం..లోన లోటారం’ అనే నానుడి భాగ్యనగరంలోని చాలా ప్రాజెక్ట్‌లకు వర్తిస్తుంది. బ్రోచర్‌ను అందంగా డిజైన్ చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే బిల్డర్లు చాలా మందే ఉన్నారు. నచ్చిన ఫ్లాటు కనబడితే చాలు.. డెవలపర్ పూర్వాపరాలను చూడకుండానే నిర్ధారిత సొమ్మును కట్టి బోలెడుమంది ఫ్లాట్లను కొంటుంటారు. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేవనో.. అమ్మకాలు కావటం లేదనో.. నిర్మాణ పనులు నిలిచిపోతే నష్టపోయేది కొనుగోలుదారుడే. అందుకే నమూనా చూసి ఫ్లాట్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
 
తొందరపడితే బోల్తా పడినట్టే
కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం

 
సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు కానీ అమ్మకాల సమయంలోకానీ కొనుగోలుదారులతో బిల్డర్లు, మార్కెటింగ్ సిబ్బంది ఆత్మీయంగా మాట్లాడతారు. నిర్ధారిత సొమ్మును చెల్లిస్తే రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిస్తామని నమ్మబలుకుతారు. గడువులోగా ఫ్లాట్ తాళాలు అందించకపోతే బ్యాంక్ వడ్డీ కొనుగోలుదారుల మీదే పడుతుంది. ఒకపక్క బ్యాంక్ వడ్డీ, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. సరిగ్గా ఈ సమయంలో ఫ్లాట్లను అమ్మిన వ్యక్తితో మాట్లాడదామంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకడు.

సంస్థలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నించినా ఫలితముండదు. ప్రాజెక్టు ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని కొందరు బిల్డర్లు ఒప్పందాల్లో పేర్కొంటారు. కాకపోతే ఈ పరిహారం కొనుగోలుదారులకు ఏమాత్రం చాలదు. ఉదాహరణకు ఫ్లాట్ ఆలస్యమైతే చ.అ.కు రూ.5 చొప్పున పరిహారం ఇస్తామంటారు. అయితే కొనుగోలుదారులు కట్టే నెలసరి వాయిదాలతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు.

సమయానికి అందించినా..
గడువు లోగా ఫ్లాట్లను పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు. ఈ జాబితాలో చిన్న బిల్డర్లే కాదు పెద్ద సంస్థలూ ఉన్నాయి. ఏలియెన్స్, హిల్‌కౌంటీ, ప్రజయ్ వంటివే ఇందుకు ఉదాహరణలు. ఏదైనా సంస్థ నిర్ణీత గడువులోపే ఇళ్లను అందించినా..  నిర్మాణ లోపాలు స్వాగతం పలుకుతుంటాయి. శ్లాబులు, బాత్‌రూముల నుంచి నీరు కారడాలు, తలుపులు సరిగ్గా పట్టకపోవడం, ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా వేయడం, బయటి ప్రాంతాలు, గోడలకు రంగులు సరిగ్గా వేయకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

నిర్మాణ లోపాలు లేకుండా బిల్డర్లు ఫ్లాట్లు అందించగానే అంతా సవ ్యంగా ఉందని భావించరాదు. నిజానికి గృహప్రవేశం చేశాకే అసలైన సమస్యలు పుట్టుకొస్తాయి. అధిక శాతం మంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. 2006లో జీవో నెం. 86 అమల్లోకి వచ్చాక నిర్మాణం కట్టే ప్రతి బిల్డరూ ఈ పత్రం తప్పక తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్మాణం అక్రమ కట్టడంగా పరిగణిస్తారు.

పత్రాలు పక్కాగా..
లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందువల్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి.

వసతులూ ప్లాన్‌లో..
కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్‌లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగ సుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ ఆ ఇల్లును ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు సొమ్ము చెల్లించక తప్పదు.

నాణ్యత లేకుంటే చిక్కులే..
నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది.
 
ఇంటికి వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. సున్నితమైన మనస్సు ఉన్న వారు లేత రంగులు, ప్రేమ పిపాసులు గులాబీ రంగు, సంపద కోరుకునే వారు బంగారు వర్ణం, ఆహ్లాదం కోరుకునే వారు లావెండర్ వంటి రంగులు ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. గొప్పదనాన్ని చెప్పాలనుకునే వారు ముదురు రంగులు ఎంచుకుంటారని నిపుణుల మాట.
 
ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడమూ ఓ కళే.  టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. లేకపోతే ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే అందవికారంగా కనిపిస్తుంది. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గత పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి.
 
స్థిరాస్తులకు సంబంధించి
మీ సందేహాలు మాకు రాయండి
realty@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement