- తుడా వదులుకుంటే టీటీడీ ఎక్స్‌అఫిషియో పోతుంది
- ధర్మసంకటంలో ఎమ్మెల్యే
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కొనసాగే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ప్రమాణం చేశారు. ఇదంతా వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది.
ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తిరుపతి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ్యునిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంకటరమణ తుడా చైర్మన్ పదవిలో కొనసాగే విషయమై శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనందున తుడాను వదులుకున్నట్టయితే ఆ పదవి మరో కార్యకర్తకు ఇచ్చే అవకాశం ఉంటుందని కొందరు సూచించినట్టు చెబుతున్నారు.
నైతికంగా కూడా ఇది మంచిదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తుడాను వదులుకుంటే టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యత్వం కూడా పోతుంది. దీంతో తుడాను వదులుకునే విషయంలో ఎమ్మెల్యే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ కీలకం కానుంది. దీంతో వెంకటరమణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలుగుదేశం వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.