అడవిదొంగల అంతుచూస్తాం
=‘ఎర్ర’ కూలీల అదుపునకు సరికొత్త వ్యూహాలు
=ఆయుధాలతోనే అడవుల్లోకి
ఎర్రచందనం కోసం ఎంతకైనా తెగించే అడవిదొంగల అంతు చూడాలని అటవీశాఖ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే అనంతపురం నుంచి మంగళవారం రాత్రి ఆయుధాలు వచ్చాయి. తమ ఉద్యోగులపై జరిగిన దాడిని అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ఎర్రకూలీలను అడవిలోకే రానీయకుండా కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు.
సాక్షి, తిరుపతి: ఎర్రచందనం కూలీలను, స్మగ్లర్లను అదుపు చేయడంలో భాగంగా అటవీ శాఖ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. అవసరమైతే కొత్త చట్టాల కోసం పోరాటం చేయాలని కూడా నిర్ణ యం తీసుకుంది. ఎర్రచందనం కోసం శేషాచల అడవుల్లోకి వచ్చే కూలీలను, స్మగ్లర్లను అడ్డుకునేందుకు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా అనంతపురం నుంచి 10 తుపాకులు కూడా మంగళ వారం రాత్రి వచ్చాయి. ఇప్పటి వరకూ ఇది కేవలం అట వీశాఖ సమస్య కావడంతో పోలీసు వ్యవస్థ దీనిపై పెద్ద గా దృష్టి కేంద్రీకరించలేదు. రెండురోజుల క్రితం ఇద్దరు అటవీ అధికారులు హత్యకు గురికావడంతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమయింది. రెండు శాఖలు కలసి నిర్ణయాలు తీసుకుని, ప్రస్తుతం శేషాచలం అడవుల్లో దాగి ఉన్న ఎర్రచందనం కూలీలను అక్కడి నుంచి తరి మికొట్టే యత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలో శేషాచలం అడవుల నుంచి దాదాపు 300 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 103 మందిని మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టారు. వీరికి కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. మిగిలిన కూలీలను విచారిస్తున్నారు. కొండల్లో దాక్కుని ఉన్న వారినికూడా పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాల యంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది.
తిరుపతి అర్బన్ ఎస్పీ విభాగం నుంచి 20 మంది సాయుధ పోలీసులతో పాటు మరికొంత మంది టాస్క్‌ఫోర్సు సిబ్బందిని కలిపి ఇకపై అడవులకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఆయుధాలు లేకుండా అడవుల్లోకి వెళ్లరాదనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన ఆవశ్యకత లేదని, సమాచారం అందినా ఇకపై ఆయుధాలు లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు కూడా సూచనలు ఇచ్చారు.
సాయుధ పోలీసుల సహాయంతోనే అడవుల్లోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. సాయుధ పోలీసులను కూడా రేంజర్ అదుపులో ఉంచాలని సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి షూట్ అట్ సైట్ ఆదేశాలు తీసుకుని రావాలని ఉన్నత స్థాయి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితిని స్వయంగా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చూడడంతో దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
కూలీలపై 302 సెక్షన్ కింద కేసు నమోదు?
కూలీలపై పోలీసు శాఖ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసే విషయంపై ఆలోచిస్తోంది. 302 కేసు నమోదుచేస్తే ఇది దేశంలోనే అతి పెద్దదవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సాధారణ కోర్టులో విచారణ చేయడానికి, సంవత్సరాలు పట్టే అవకాశం ఉండడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.