సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలోని ప్రజల రవాణా కష్టాలు కడతేరనున్నాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం(జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్) పథకం కింద 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను కేంద్రం విడుదల చేసింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించేందుకు 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను విడుదల చేసింది.
ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డీ.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుడా పరిధిలోని తిరుపతి నగరం, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతూ వస్తోంది. పట్టణీకరణ అధికమవుతున్న మేరకు రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు.
తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు అప్పలాయగుంటకు భక్తుల తాకిడి అధికమవుతుండడం.. స్థానిక జనాభా పెరిగిపోతుండడం.. రవాణా సదుపాయాలు మెరుగుపడకపోవడంతో తుడా పరిధిలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. తుడా పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి 2011-12లో రూ.225 కోట్లతో తుడా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కనీసం లక్ష జనాభాకు 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని తుడా అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేంద్రం ఆమోదముద్ర వేసింది.
తుడా పరిధిలో 450 బస్సుల కొనుగోలుకు రూ.225 కోట్లను విడుదల చేస్తామని అప్పట్లో కేంద్రం అంగీకరించింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలుకు రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లోనే కేంద్రం స్పష్టీకరించింది. ఆ మేరకు 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లను మంజూరు చేసింది.
2013-14లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను 4 నెలల క్రితం విడుదల చేసింది. 2014-15 బడ్జెట్లో 120 బస్సుల కొనుగోలుకు రూ.27.38 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లో 65 బస్సుల కొనుగోలుకు నిధులను విడుదల చేస్తే.. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తవుతుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్‌లో 30 బస్సుల కొనుగోలుకు రూ.9.15 కోట్లను మంజూరు చేశారు. తుడా ప్రాజెక్టు తొలి దశ అమలు పూర్తై రవాణా కష్టాలు తీరడం ఖాయం. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయడం సంస్థకు జీవం పోసినట్లయిందని ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తుడాకు కేంద్రం ఊతం!
Published Sat, Nov 1 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement