బోటు ప్రమాదం: గోదావరికి భారీగా వరద ఉధృతి | Godavari Boat Capsize Live Updates in Telugu | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదం: లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Sep 16 2019 9:30 AM | Last Updated on Mon, Sep 16 2019 8:59 PM

Godavari Boat Capsize Live Updates in Telugu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : బోటు ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో సహాయ బృందాలకు తీవ్ర ఆటంకం ఏర్పడి, బోటు వెలికితీతకు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే 8 మృతదేహాలను వెలికి తీసి ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే ఇంకా 38 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా 315 అడుగుల లోతులో మునిగిపోయిన బోటును ఎన్డీఆర్‌ఎఫ్‌ గుర్తించింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టగా, వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కొనసాగించనున్నారు.  ఈ ఘటననపై కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లైంతైన వారిలో అధికశాతం లాంచీలోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆదేశం: కన్నబాబు
గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దీనికి తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటులో పోలీస్‌, ఇరిగేషన్‌, టూరిజం విభాగాలు భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించినట్లు  పేర్కొన్నారు. కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి కురసాల కన్నబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..  ఈ దుర్ఘటనపై చలించిపోయిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.

బోటు నిర్వహణపై జీవో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం.. బాధ్యులను గుర్తించలేదని కన్నబాబు మండిపడ్డారు. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్‌ అధికారులు గుర్తించాలని, ప్రతి నెల ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పర్యాటక బోట్ల స్థితిగుతలపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ ఘటన అనంతరం ఆదివారం నుంచి రాష్ట్రంలో లాంచీల అనుమతులు రద్దు చేస్తున్నట్లు, ఫిట్‌నెస్‌ అనుమతులు తీసుకున్నాకే వాటిని అనుమతించనున్నట్లు మంత్రి  కన్నబాబు స్పష్టం చేశారు. బోటు నిర్వాహకుడు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

గత ప్రభుత్వ తప్పిదమే కారణం
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు దుర్ఘటనపై తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవేటు బోట్లపై ప్రభుత్వానికి ఆజమాయిషీ లేకుండా టీడీపీ ప్రభుత్వం జీవో ఎలా జారీ చేసిందని ప్రశ్నించారు. ప్రమాదానికి నూరు శాతం గత ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం తప్పుడు జీవో ఇవ్వడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని, ఈ పాపమంతా గత ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని, అన్ని శాఖల అధికారులు బాగా పనిచేశారని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా 33మందిని గుర్తించాల్సి ఉంది: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఇంకా 33 మందిని గుర్తించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన సీఎం జగన్‌..ఇ‍క మీదట ప్రతినెల బోటు ఫిట్‌నెస్‌ చేయాలని ఆదేశించారన్నారు.  భవిష్యత్తులో జరిగే ప్రమాదాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. 2017 నవంబర్‌ 16న టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో లోపభూయిష్టంగా ఉందని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. గత ప్రభుత్వం ఫిట్‌నెస్‌ పోర్ట్‌ట్రస్ట్‌కు ఇచ్చి, బోటు అనుమతులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించలేదని పిల్లి చంద్రబోస్‌ మండిపడ్డారు.

బోటు ప్రమాదంపై సీఎం జగన్‌ సీరియస్‌
బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. లాంచీ ప్రమాదం ఎలా జరిగిందని, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పేర్కొంది. బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారులు నివేదిక అందించారు. ఇప్పటి వరకు 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారని, మిగిలినవారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు. ‘బోటులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలు దొరికాయి. 24 మంది గల్లంతయ్యారు. 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గల్లంతైనవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్‌ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శాటిలైట్‌ ఫోన్‌, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగిస్తున్నాం. రెండు ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్‌ నేవీ నుంచి ఒక డీప్‌ డైవర్స్‌ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్‌జీసీ ఛాపర్‌ను వాడుతున్నాం’ అని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పెర్కొంది.

బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఒక్కొక్క బాధితుడి దగ్గరకు స్వయంగా వెళ్లి  ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్‌  వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, తదితరులు ఉన్నారు.

315 అడుగుల లోతులో లాంచీ
గోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కనుగొంది. లాంచీ 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా గుర్తించారు. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. 

 సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే 
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. 

మరో నాలుగు మృతదేహాలు వెలికితీత
ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కి చేరింది. తాజాగా వెలికి తీసిన మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేస్తోంది. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో విస్రృతంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం జగన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

మృతదేహాల తరలింపుకు అంబులెన్స్‌ల ఏర్పాటు 
మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  దిగ్భ్రాంతి
బోటు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు.

కచ్చులూరుకు సీఎం జగన్‌
అమరావతి:
సోమవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి బయలుదేరారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు.సీఎం జగన్‌ వెంట మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సుచరిత ఉన్నారు.

ధవళేశ్వరం వద్ద కుండపోత వర్షం
ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాద ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ నేత ఉదయ భాస్కర్‌ ఉన్నారు. రెస్క్యూ  ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు.

ముమ్మరంగా సహాయక చర్యలు
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్‌ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

సంబంధిత కథనాలు
నిండు గోదారిలో మృత్యు ఘోష

ముమ్మరంగా సహాయక చర్యలు

30 ఏళ్లలో 100 మందికి  పైగా మృత్యువాత

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement