అందరూ దొంగలే | Leaders, Officials behind red sandal smugglers | Sakshi
Sakshi News home page

అందరూ దొంగలే

Published Thu, Jan 16 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

అందరూ దొంగలే

అందరూ దొంగలే

* అధికారులు, నేతల కనుసన్నల్లో ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం
* జపాన్, సింగపూర్, మలేసియూలకు అక్రమంగా ఎగుమతి
* ఖాళీ అవుతున్న శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాలు
* అరుదైన సంపద అంతరించిపోతున్నా పట్టించుకోని పోలీసు, అటవీ అధికారులు
* అప్పుడప్పుడు చిన్న స్మగ్లర్లు పట్టుబడినా వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు..
 
ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి: వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే! డబ్బు మూటల సాక్షిగా అధికారులు, రాజకీయనేతల ‘అపవిత్ర బంధం’తో అత్యంత కట్టుదిట్టమైన నెట్‌వర్క్ మధ్య ‘ఎర్రబంగారం’ అనునిత్యం రాయలసీమ జిల్లాల నుంచి దేశం ఎల్లలు దాటిపోతోంది. పోలీసు, అటవీశాఖలకు చెందిన పలువురు అధికారులు ఇంటి దొంగల పాత్ర పోషిస్తుండగా.. కొందరు రాజకీయ నేతలు రాజీలు కుదిర్చే పెద్దన్నల పాత్ర పోషిస్తున్నారు.

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా అందరూ కలిసి ఎర్రచందనాన్ని నిరాటంకంగా సరిహద్దులు దాటిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ఇంటి దొంగలకు తెలియకుండా ఎవరైనా అధికారులు దాడులు చేసి పట్టుకున్నా దొరికేది కూలీలు, డ్రైవర్లే! వారు చెప్పే వివరాల ఆధారంగా చిన్న స్మగ్లర్లను అధికారులు అరెస్టు చేసినా వెంటనే వదిలేయాలంటూ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తాయి. గట్టి అధికారి ఎవరైనా వినకపోతే ఉన్నతాధికారులతో చెప్పించి విడుదల చేయిస్తారు. అంతటితో దాని ‘కథ’ ముగిసిపోతుంది.

శేషాచలం టూ సింగపూర్
కోట్లు కుమ్మరిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఓ మాఫియాలా మారడంతో.. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అత్యంత అరుదైన, విలువైన ఈ వృక్షజాతి ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. ఈ అయిదు జిల్లాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఈ వృక్ష జాతి లేదు. (అంతరించిపోతున్న వృక్షజాతుల్లో చేర్చారు) ఈ కలప ఎగుమతికి ఎవరికీ అనుమతి లేదు. దీంతో రాష్ట్రంలోని, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విస్త­ృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని రాయలసీమలోని శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాల నుంచి వేలాది టన్నులు జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు.

పెలైట్ల సాయంతో చెక్‌పోస్టులు దాటి
ఒక ప్రాంతం నుంచి వాహనంలో సరుకు తరలించే ముందు స్మగ్లర్లు తమకు అనుకూలమైన పోలీసు, అటవీ సిబ్బంది ద్వారా సదరు మార్గంలో ఎవరైనా అధికారులు ఉన్నారా? అని విషయం తెలుసుకుంటారు. లైన్ క్లియర్‌గా ఉందని సమాచారం వచ్చినా ఒక పట్టాన నమ్మరు. ఆ ప్రాంతంలోని నమ్మకస్తులైన కొందరు యువకులను మాట్లాడుకుని మోటార్ సైకిల్ లేదా కారులో ఆ మార్గంలో పెలైట్‌గా పంపుతారు. అటవీ/పోలీసు సిబ్బంది లేరని నిర్ధారించుకున్న తర్వాత ముందు ఒక ఖాళీ వాహనం వెళుతుంది. దాని వెనుక ఎర్రచందనం దుంగలున్న వాహనం వెళుతుంది. మధ్యలో సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా వాహనాన్ని దారి మళ్లించేస్తారు. అటవీ ప్రాంతం, చెక్‌పోస్టులు దాటుకుని నిర్ధారిత ప్రధాన మార్గానికి చేరుకుంటారు. ఇలా పెలైట్‌గా వెళ్లినవారికి 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.10 వేలు చొప్పున ఇస్తారు.

కంటెయినర్లలో ఓడరేవుకు
సాధారణంగా చెన్నై పోర్టు ద్వారానే ఎర్రచందనాన్ని విదేశాలకు పంపిస్తారు. అందువల్ల ఆయూ జిల్లాల నుంచి చెన్నై మార్గంలో వెళ్లే వాహనాలనే అధికారులు తనిఖీ చేస్తారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు తాము కలప నిల్వ చేసిన ప్రాంతం నుంచి తొలుత హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తున్నారు. అంబులెన్సులు మొదలు ఆయిల్ ట్యాంకర్ల వరకూ దేనిలో వీలైతే దానిలో తరలిస్తున్నారు. ఆయా నగరాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెళ్లే భారీ కంటెయినర్ల డ్రైవర్లకు దారిమధ్యలో భారీగా డబ్బు ఎరవేసి అందులో ఎర్రచందనం దుంగల్నీ నింపి చెన్నై, కృష్ణపట్నం, ముంబై, కాండ్లా తదితర ఓడరేవులకు చేరవేస్తున్నారు.

ఇలా వేరే సరుకుల పేరుతో కంటెయినర్లు విదేశాలకు చేరతాయన్న మాట. కస్టమ్స్ అధికారులు పెద్ద పెద్ద కంపెనీలకు సెల్ఫ్ సీలింగ్ సదుపాయం కల్పించడమూ ఇందుకు అనువుగా మారింది. ‘‘మా పోర్టు నుంచి ప్రతిరోజూ 1500 కంటెయినర్లు వెళుతుంటాయి. అన్నింటినీ తనిఖీ చేయాలంటే రవాణా వ్యవస్థ స్తంభించి షిప్పులన్నీ ఆగిపోతాయి. అందువల్ల ర్యాండమ్ పద్ధతిలో కొన్ని కంటెయినర్లే తనిఖీ చేస్తాం. అలా చేసినప్పుడు గతంలో కొన్నింటిలో ఎర్రచందనం దొరికింది. దానిని సీజ్ చేశాం’’ అని చెన్నైకి చెందిన డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు.

తమిళ కూలీలకు కాసులే కాసులు
అటవీ ప్రాంతంలో చెట్లు నరికి ఎర్రచందనం దుంగలు తరలించే కూలీలకు వేలకు వేల కూలీ లభిస్తోంది. అందువల్లే తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ పనికి 18-25 ఏళ్ల మధ్య వయసుగల కూలీలు అధిక సంఖ్యలో శేషాచలం అడవులకు వస్తున్నారు. అడవిలో చెట్టుకొట్టి తయారు చేసిన దుంగను వీరు 25-30 కిలోమీటర్లు మోసి వాహనాలు వెళ్లే మార్గం దగ్గరకు చేరవేస్తారు. ఇందుకు వారికి కిలోకు రూ.500 నుంచి రూ. 700 వరకూ ఇస్తున్నారు. ఒక్కో కూలీ మూడు రోజుల్లో 30 కిలోల బరువున్న దుంగను ఇలా చేర్చుతారు.

వీరికి కిలోకు రూ.500 చొప్పున మూడు రోజుల కూలి కింద రూ.15 వేలు వస్తుంది. అంటే రోజు కూలి అక్షరాలా రూ.5 వేలు. అందువల్లే తమిళనాడులోని జమునా మత్తూర్, మామత్తూర్, ఆంబూర్, కన్నమంగళం, మలయార్ మక్కల్ ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. గత నెలలో శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని హత్య చేసింది ఈ ప్రాంతాలకు చెందిన కూలీలే. రాష్ట్రానికి చెందిన కూలీలకు రోజుకు రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. 2011-12లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 1430 మెట్రిక్ టన్నులుండగా.. దీనికి 10 నుంచి 12 రెట్లు విదేశాలకు తరలి ఉంటుందని అంచనా.

పట్టుబడుతున్నదీ కూలీలే
ఇటీవల రాయలసీమలో ప్రత్యేకించి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేవారిలో 90 శాతం మంది తమిళ కూలీలే. కేసుల భయంవల్ల మన రాష్ట్రంలోని అటవీ పరిసర గ్రామాలవారు ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఇష్టపడట్లేదు. స్మగ్లింగ్ నిరోధం పేరిట పోలీసు, అటవీ సిబ్బంది పట్టుకుంటున్నది కేవలం ఈ కూలీలు, వారిని పంపించే చిరుచేపల్నే. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న తిమింగలాల్లాంటి అసలు నేరగాళ్లు దొరల్లా దర్జాగా తిరుగుతున్నారు.

టాస్క్‌ఫోర్సు పట్టించిన చిన్న స్మగ్లర్లపై కేసు పెట్టకుండా వదిలేయడం వల్లే సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన సీఐ పార్థసారథితోపాటు ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం, మరికొందరి పాత్రపై దర్యాప్తు జరుగుతుండ టం స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల పాత్రను స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన లాయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని అరెస్టరుున కూలీలకు బెయిల్ ఇప్పిస్తున్న స్థానిక న్యాయవాదులూ భారీగా ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. ‘‘అరెస్టయినట్లు తెలియగానే ఇక్కడి అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒకరికి బెయిలిప్పిస్తే రూ.10 వేలు తీసుకుంటున్నారు.’’ అని కడపకు చెందిన ఓ లాయర్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement