
బుట్టాయగూడెం: జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 8 వరకూ ఆన్‌లైన్ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్‌లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సి.సెల్వమ్ తెలిపారు.
► పాపికొండల అభయారణ్యంలో సుమారు 130 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ముఖ్యంగా కొలనులు, చెరువులు, వాగుల సమీపాల్లో రకరకాల సీతాకోకచిలుకలు గుంపులుగా ఏర్పడి అలికిడైన సమయంలో ఒక్కసారిగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి.
► ఇక్కడున్న వాటిల్లో తుది జాబితాకు ఎంపికైనవి అరుదైన రకాలని వైల్డ్‌లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ తెలిపారు. దాదాపు 9 నెలలపాటు కష్టపడి ఫోటోలు సేకరించి పోటీల్లో వాటిని పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి సీతాకోకచిలుక జాతీయ స్థాయిలో ఎంపికైతే ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
► ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జాతీయ సీతాకోకచిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment