Butterflies
-
స్మార్ట్ సీతాకోక చిలుకలు
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! స్మార్ట్ ఉకులెలె.. మ్యూజిక్ మేడీజీ! గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం. స్మార్ట్‌ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! చార్జర్ కమ్ రేడియో ఇది చార్జర్ కమ్ రేడియో. మామూలు చార్జర్లలా దీనికి బయటి విద్యుత్తుతో పనిలేదు. ఇది తనంతట తానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. కావలసినప్పుడు ఆన్ చేసుకుంటే, ఇంచక్కా రేడియోను వినిపిస్తుంది. దీనొకక ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. ఈ చార్జర్ కమ్ రేడియో పనిచేయడానికి కాసింత ఉప్పునీరు చాలు. జపానీస్ కంపెనీ ‘స్టేయర్ హోల్డింగ్’ దీనిని ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. ఇది మాగ్నెటిక్ చార్జర్. దీని సాకెట్లో నాలుగు మెగ్నీషియం రాడ్లు ఉంటాయి. అందులో ఉప్పునీరు వేసి నింపడం వల్ల జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు పుడుతుంది. దీంతో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను చార్జ్ చేసుకోవచ్చు. వినియోగాన్ని బట్టి దీనిలోని మెగ్నీషియం రాడ్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 15,800 యెన్లు (రూ.8,837) మాత్రమే! -
సీతాకోక చిలుకల హరివిల్లు
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): ఎన్నెన్నో అందాలు.. అన్నింటా అందాలు.., సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అని కవులు సీతాకోక చిలుక అందాలను అభివర్ణించారు. సప్తవర్ణ శోభితమైన వాటి సోయగాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటున్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండల అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. అరుదైన రకాల సీతాకోక చిలుకలకు ఆలవాలంగా నిలుస్తోంది. జాతీయస్థాయి విజేత ఓకలీఫ్ పాపికొండల అభయారణ్యంలో జంతువులు, వృక్షాలే కాక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండల నేషనల్ పార్క్‌లో ఉన్న 3 రకాల సీతాకోక చిలుకలు పోటీపడ్డాయి. తుది పోరులో దేశవ్యాప్తంగా 7 రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా వీటిలో పాపికొండల అభయారణ్యంకు చెందిన 3 రకాల ఉన్నాయి. వీటిలో ఆరెంజ్ ఓకలీఫ్ జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఇవి వర్షాకాలం, శీతాకాలం సమయంలో గుంపులుగా తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటాయి. పచ్చని చెట్ల మధ్య సీతాకోక చిలుకలు ఎగురుతుండటం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అరుదైన సీతాకోక చిలుకలు పాపికొండల అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. 1,045 రకాల జంతువులు పాపికొండల అభయారణ్యం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా 2008 నవంబర్ 4న ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్క్‌గా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడి జంతుజాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారు. పెద్ద పులులు, చిరుతలు, అలుగులు, గిరినాగులతో పాటు పలురకాల జంతువులకు నిలయంగా అభయారణ్యం మారింది. అరుదైన జీవజాలం అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండల అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉంది. వీటితోపాటు పలురకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. 2021లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కామన్ జెజెబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఆరెంజ్ ఓకలీఫ్ అనే సీతాకోక చిలుక జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఈ అభయారణ్యంలో 130 రకాల రంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజర్, పోలవరం -
Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట!
సాధారణంగా సీతాకోకచిలుకలు చెట్ల, జంతువులు మీద వాలుతూ గాల్లో ఎగురుతుంటాయి. గార్డెన్, మైదానాల్లో తిరుగుతూ మనుషులకు దగ్గరగా వస్తుంటాయి. మనం వాటిని పట్టుకోవాలని ప్రత్నించగానే రివ్వున గాల్లోకి ఎగిరిపోతాయి. అయితే తాజాగా ఓ సీతాకోకచిలుక చిన్న కుక్కపిల్లతో చేసిన సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను బ్యూటెంజిబిడెన్ పేరుతో ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిన్న కుక్కపిల్ల బంతిని తన నోటితో ఒక చోటు నుంచి మరోచోటుకి తీసుకువస్తుంది. అదే సమయంలో రెండు సీతాకోకచిలుకలు కుక్కపిల్లలో ఆడుకుంటాయి. ఒక సీతాకోకచిలుక కుక్కపిల్ల ముక్కు మీద వాలుతుంది. అది గ్రహించిన కుక్కపిల్ల వెంటనే దాన్ని పట్టుకోవాలని ప్రత్నించగానే గాల్లోకి ఎగిరి ఆటపట్టిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘సూపర్‌గా ఉంది వీడియో!! బుజ్జి కుక్క పిల్ల తీసుకోచ్చిన బంతి కదలకుండా ఉంది. కానీ, సీతాకోకచిలుక మాత్రం గాల్లో ఎగిరింది’.. ‘ ప్రశాంతమైన గార్డెన్లో.. చాలా అద్భుతంగా ఉంది వీడియో’.. ‘కుక్కపిల్లలో సీతాకోకచిలుక చిలపి ఆట బాగుంది’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంద వీక్షించారు. This is what Twitter is meant for.. pic.twitter.com/wY8r1IWyrw — Buitengebieden (@buitengebieden_) September 2, 2021 -
‘సీతాకోక’ నెలవు.. జీవ వైవిధ్య కొలువు
సాక్షి, అమరావతి: ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎలా ఉందనేది అక్కడున్న సీతాకోకచిలుకల గమనం ప్రతిబింబిస్తుంది. వీటి ఉనికి ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతను తేటతెల్లం చేస్తుంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల వాటి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతున్న తరుణంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంత పరిధిలో జీవ వైవిధ్యం మెరుగ్గా ఉన్నట్టు పర్యావరణ వేత్తలు గుర్తించారు. ఈ అటవీ ప్రాంత పరిధిలోని మూలపాడులో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దేశంలోనూ సర్వే.. విదేశాల్లో మాదిరిగా జీవ వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి భారత్‌లోనూ పర్యావరణ వేత్తలు సీతాకోకచిలుకలపై సర్వే ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ బిగ్ బటర్‌ఫ్లై మంత్–2020గా ప్రకటించి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతంలో 15 కి.మీ. పరిధిలో స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో నేషనల్ బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు దాసి రాజేష్ వర్మ, బండి రాజశేఖర్ బృందం సర్వే నిర్వహించి 20 రోజుల్లోనే ఆరు రకాల కొత్త జాతులు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది. వీరు మూలపాడు వద్ద కొత్తగా 6 సీతాకోక చిలుక జాతులను కనుగొన్నారు. అవి 1.ట్రై కలర్ పైడ్ ఫ్లాట్, 2.కంప్లీట్ పెయింట్ బ్రష్ స్విఫ్ట్, 3.బాంబూ ట్రీ బ్రౌన్, 4.డింగీ లైన్ బ్లూ, 5.పాయింటెడ్ సిలియేట్ బ్లూ, 6.గోల్డెన్ ఏంజిల్. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే చెట్లు, వన్యప్రాణులు ఎక్కువగా ఉండటం వల్లే కొత్త జాతులు ఇక్కడకు వస్తున్నట్టు సర్వే బృందం గుర్తించింది. కొత్తగా కనుగొన్న జాతులతో కలిపి ఈ ప్రాంతంలో ఉన్న సీతాకోకచిలుక జాతుల సంఖ్య 62కి చేరింది. ఈ ప్రాంత గొప్పతనం.. విజయవాడకు సమీపంలో ఇంతటి జీవ వైవిధ్యం ఉన్న అటవీ ప్రాంతం ఉండటం విశేషం. కాలుష్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడా సీతాకోకచిలుకల సంఖ్య గతం కంటె తగ్గుతున్నా కొత్త కొత్త జాతులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దాసి రాజేష్ వర్మ, బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యుడు మారుతున్న పరిస్థితుల వల్లనే.. ఇంతకుముందు ఈ జాతులు ఇక్కడ కనపడేవి కాదు. మారిన వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఈ ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించాం. గత సంవత్సర కాలంగా ఈ ప్రాంతంలో పలు కొత్త జాతులను కనుగొన్నారు. ఇక్కడున్న చెట్లు, వన్యప్రాణుల వైవిధ్యం వల్లే ఇవి ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. – బి.లెనిన్ కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి రిజర్వుడ్ ఫారెస్ట్ -
అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు
బుట్టాయగూడెం: జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 8 వరకూ ఆన్లైన్ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్‌లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సి.సెల్వమ్ తెలిపారు. ► పాపికొండల అభయారణ్యంలో సుమారు 130 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ముఖ్యంగా కొలనులు, చెరువులు, వాగుల సమీపాల్లో రకరకాల సీతాకోకచిలుకలు గుంపులుగా ఏర్పడి అలికిడైన సమయంలో ఒక్కసారిగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. ► ఇక్కడున్న వాటిల్లో తుది జాబితాకు ఎంపికైనవి అరుదైన రకాలని వైల్డ్‌లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ తెలిపారు. దాదాపు 9 నెలలపాటు కష్టపడి ఫోటోలు సేకరించి పోటీల్లో వాటిని పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి సీతాకోకచిలుక జాతీయ స్థాయిలో ఎంపికైతే ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ► ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జాతీయ సీతాకోకచిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. -
పూలకు సీతాకోక రెక్కలొచ్చాయ్..
సాక్షి, మహబూబాబాద్ : పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే భూ లోకమే ఆనందానికి ఇల్లు.. లోకంలో కన్నీరింక చెల్లు .. సీతాకోక చిలుకకు చీరలెందుకు అనే పాట భారతీయుడు సినిమాలోనిది.. ఆ పాట వింటుంటే భూలోకమే స్వర్గంగా భావిస్తారు అందరు. గత పది రోజులుగా వర్షాలు కురియడంతో వివిధ రకాల పచ్చని చెట్లకు పూసిన పూలపై సీతాకోకచిలుకలు వాలుతూ భూలోకమే స్వర్గంగా మారిందా అన్నట్లుగా కనువిందు చేశాయి. పూలకు రెక్కలొచ్చినట్లుగా ఎగురుతూ పూలలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచాయి. మహబూబాబాద్ శివారు ప్రాంతంలో ఈ దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి. -
వందల సంఖ్యలో సీతాకోకల సందడి
-
మహిళా తారలతోనే...
హర్షిణి, రోజా, భారతి, మేఘనా రమి, జయ, ప్రవల్లిక ముఖ్య తారలుగా కేఆర్ ఫణిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బటర్ ఫ్లైస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ ఇచ్చారు. నల్లమల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మహిళా ఆర్టిస్టులతోనే సినిమా తీయడం మంచి ప్రయత్నం’’ అన్నారు అంబికా కృష్ణ. ‘‘మహిళా తారలతోనే చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు ఫణిరాజ్. ‘‘మహిళలకు ఎదురయ్యే కష్ణనష్టాలను చూపించబోతున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రత్యోదన్ స్వరకర్త. -
ఎగరనీ... సీతాకోకచిలుకనీ!
ఆత్మబంధువు ‘‘మమ్మీ... మమ్మీ... నా డ్రెస్ ఎక్కడ?’’ అరిచింది రిషిత. ‘‘నీ కప్‌బోర్డ్‌లోనే ఉంది. వెతికితే కనిపిస్తుంది’’ వంటింట్లోంచి రేఖ. ‘‘పాప కనిపించడంలేదంటోంది కదోయ్. కొంచెం వెతికివ్వొచ్చుగా’’ పేపర్ చదువుతూ తాపీగా చెప్పాడు ఆనంద్. ‘‘దాన్నే వెతుక్కోనివ్వండి’’ అంది. ‘‘తను చిన్నపిల్లోయ్...’’ అని ‘‘రా తల్లీ నేను వెతికిస్తా’’ అంటూ కప్‌బోర్డ్‌లో స్కూల్‌డ్రెస్ వెతికిచ్చాడు ఆనంద్. ఇంతలో రేఖ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌బాక్స్ రెడీ చేసింది. రిషితకు బ్రేక్‌ఫాస్ట్ తినిపించి, షూస్ వేసి, వాటర్బాటిల్లో నీళ్లుపట్టిచ్చాడు ఆనంద్. ‘‘మీరెందుకు తినిపిస్తున్నారు? షూస్ మీరు వెయ్యడమేంటీ?’’ అడిగింది రేఖ. ‘‘తను చిన్నపిల్లోయ్..’’ ‘‘పన్నెండేళ్లొచ్చినా చిన్నపిల్లేనా!’’ ‘‘పన్నెండేళ్లే కదోయ్’’ అంటూ రిషితను బస్సెక్కించి వచ్చాడు. ‘‘డాడీ.. డాడీ’’ పిలిచింది రిషిత. ‘‘ఏంటి తల్లీ?’’ ‘‘నాకూ స్కూల్లో ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. కానీ నేనేమో చదువుకోవాలి’’ ‘‘నేను చేసిస్తాలేరా. నువ్వెళ్లి చదువుకో.’’ ‘‘మా మంచి డాడీ’’ అంటూ ఓ ముద్దిచ్చి వెళ్లింది రిషిత. ఆనంద్ ప్రాజెక్టు వర్క్ ముందేసుకుని కూర్చున్నాడు. ఇంతలో రేఖవచ్చి ‘‘ఇదేంటీ... దాని వర్క్ మీరు చేస్తున్నారు?’’ అని అడిగింది. ‘‘నా చిట్టితల్లి చదువుకోవాలటోయ్. అందుకే హెల్ప్ చేస్తున్నా’’ ‘‘చదువుకున్నాక చేసుకోమనండి లేదంటే ప్రాజెక్ట్ పూర్తిచేసి చదువు కోమనండి.’’ ‘‘సర్లే. అయినా నా చిట్టితల్లికి నేను హెల్ప్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్?’’ ‘‘ప్రాబ్లెమ్ కాదు, మీ గారాబంతో దాన్ని చెడగొడుతున్నారనే నా బాధ.’’ ‘‘నేనేం చేశానోయ్. నా కూతురికి నేను హెల్ప్ చేయడంకూడా తప్పేనా?’’ ఇక చెప్పినా లాభంలేదనుకుని రేఖ మౌనంగా ఉండిపోయింది. కానీ తన భర్త గారాబంతో కూతురు బద్ధకస్తురాలిగా, లోకజ్ఞానం లేనిదానిలా తయారవుతుం దనే బాధ. ఏం చేయాలో తెలియట్లేలేదు. కానీ ఏదోకటి చేయాలి ఆయనకు అర్థమయ్యేలా అనుకుంది. ‘‘ఏమండీ’’ పిలిచింది రేఖ. ‘‘ఏంటండీ?’’ నవ్వుతూ అడిగాడు ఆనంద్. ‘‘పార్క్‌కు వెళ్దామా?’’ ‘‘ఏంటో... ఇవ్వాళ మేడమ్ మనసు పార్క్‌కు మళ్లింది.’’ ‘‘ఏదో మళ్లిందిలెండి. వస్తారా?’’ ‘‘నువ్వు రమ్మంటే ఏనాడైనా రానన్నానా?’’ అని పాడుతూ బయలుదేరాడు ఆనంద్. ‘‘ఏమండీ... ఆ సీతాకోకచిలుకలు చాలా అందంగా ఉన్నాయి కదా!’’ అంది రేఖ. ‘‘సీతాకోకచిలుకలు ఎప్పుడూ అందంగానే ఉంటాయ్... నీలా’’ చిలిపిగా అన్నాడు ఆనంద్. ‘‘సరసం చాలు గానీ, అవెలా వస్తాయ్? ఎక్కడ్నుంచొస్తాయ్?’’ ‘‘లార్వా, కేటర్పిల్లర్, ప్యూపా అండ్ బటర్‌ఫ్లై.’’ ‘‘ఈ ప్యూపాలోంచి సీతాకోకచిలుక ఎలా వస్తుంది?’’ అంటూ ఓ మొక్కకు ఉన్న పట్టుగూడును చూపించింది రేఖ. ‘‘ఇదిగో... ఇలా’’ అంటూ ఆ పట్టుగూడును చీల్చాడు ఆనంద్. అందులోంచి కిందపడ్డ సీతాకోకచిలుక ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక అక్కడే పడి పోయింది. చివరకు చనిపోయింది. ‘‘ఆ సీతాకోకచిలుకను మీరెలా చంపేశారో అర్థం చేసుకున్నారా?’’ అడిగింది రేఖ. ‘‘నేను చంపడమేంటి? ఐ హెల్ప్డ్ టూ కమ్ అవుటాఫ్ ది కకూన్.’’ కొంచెం కోపంగా అడిగాడు ఆనంద్. ‘‘కోప్పడకుండా చెప్పేది వినండి. నల్లగా అందవికారంగా ఉండే గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారేందుకు ఈ గూడును కట్టుకుంటుంది. అది సీతాకోక చిలుకగా రూపాంతరం చెందాక బయటకు వచ్చేందుకు బలంగా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో దానికి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలకు శక్తి వస్తుంది. ఆ శక్తిని ప్రయోగించి పట్టు గూడును చీల్చుకుని రివ్వున ఎగురు తుంది... అందంగా ఆనందంగా.’’ ‘‘అవును. ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్?’’ ‘‘కకూన్ లోపలున్న సీతాకోకచిలుక కష్టపడకూడదని మీరు సాయం చేశారు. దాంతో గూడును చీల్చాల్సిన అవసరం దాని రెక్కలకు లేకపోయింది. అందువల్ల అవి బలపడలేదు. అందుకే అది ఎగరలేక చనిపోయింది. తనపని తాను చేసుకోనివ్వ కుండా సాయం చేస్తే ఇలాగే ఉంటుంది.’’ ‘‘యూ మీన్..’’ అంటూ ఏదో అర్థమై ఆగాడు ఆనంద్. ‘‘అవునండీ.. పిల్లలు తమపని తాము చేసుకుంటేనే పని విలువ, కష్టం, దాని ఫలితం తెలిసొస్తాయి. అన్నీ మనమే చేసిపెడితే రేపు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు తట్టుకోలేరు. వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటేనే అన్నీ నేర్చుకుంటారు. మానసికంగా దృఢంగా తయారవుతారు.’’ భార్య చెప్పాలనుకున్నది అర్థమైంది ఆనంద్కి. ‘‘నిజమే. సారీ అండ్ థాంక్స్’’ అంటూ రేఖ చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశాడు. -
సీతాకోక చిలుకల రుచిమొగ్గలు కాళ్లలో ఉంటాయా?
జంతు ప్రపంచం ప్రపంచంలో మొత్తం ఇరవై నాలుగు వేల రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఒక్క ఆస్ట్రేలియాలోనే 385 రకాలు ఉన్నాయి! ఇవి పొట్ట భాగంలో ఉండే ‘స్పిరాకిల్స్’ అనే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి! వీటికి ఊపిరి తిత్తులు ఉండవు! సీతాకోక చిలుకలకు రుచిమొగ్గలు కాళ్లలో ఉంటాయి. అందుకే ఇవి తమ కాళ్ల ద్వారా రుచి చూస్తాయి. ట్యూబ్స్లా ఉండే నాలుకల ద్వారా తేనెను జుర్రుకుంటాయి. ఆనక ఈ నాలుకలను చుట్టలా చుట్టేస్తాయి! ముఖ భాగంలో ఉండే పొడవాటి యాంటెన్నాల ద్వారా వాసన చూస్తాయి! వీటికి చెవులు లేనందున శబ్దాలు వినలేవు. వైబ్రేషన్స్ ద్వారా చుట్టుపక్కల శబ్దాలను గ్రహిస్తాయి! సీతాకోకచిలుకలకు మూడు జతల కాళ్లు ఉంటాయి. ఆ కాళ్ల చివర జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అందుకే పూల రేకుల మీద, గోడల మీద జారిపోకుండా అతుక్కుని నిలబడతాయి! ఇవి ఘనాహారాన్ని తీసుకోవు. కేవలం ద్రవాలనే తాగి బతుకుతాయి. పూలలో ఉండే తేనె ప్రధాన ఆహారమే అయినా, మట్టిలో ఉండే మినరల్స్ కోసం బురద గుంటల్లోని నీటినీ తాగుతుంటాయి! ఇవి శీతల రక్త జీవులు. తమ శరీర ఉష్ణోగ్రత 86 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటే తప్ప ఇవి ఎగుర లేవు. ఉష్ణోగ్రత 55 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అసలు కదలను కూడా కదలలేవు! ఇవి కేవలం పది నుంచి పన్నెండడుగుల దూరంలో ఉన్నవాటిని మాత్రమే చూడగలుగుతాయి! వీటి జీవితకాలం కేవలం 2 నుంచి 4 వారాలు మాత్రమే. ఏవో కొన్ని రకాలు మాత్రమే పది నెలల వరకూ జీవిస్తాయి! -
అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం!
ఔరంగాబాద్: అజంతా గుహల అందాలకు పంచవన్నెల సీతాకోక చిలుకల అందాలు మరింత శోభను చేకూర్చనున్నాయి. ఇకపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన అజంతా గుహలను సందర్శించే పర్యాటకులకు గుహల అందాలతోపాటు రం గురంగుల సీతాకోకచిలుకల సోయగాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ ఉమ్మడి యాజమాన్య కమిటీ(జేఎఫ్ఎంసీ)తో కలిసి అటవీ శాఖ అధికారులు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. గుహల సమీపంలో, కొండ కింద జలపాతాల దిగువ ప్రాంతంలో సీతాకోక చిలుకలను ఆకర్షించే వాతావరణాన్ని కల్పిం చేందుకు కృషిచేయనున్నా రు. ఈ విషయమై అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అజిత్ భోంస్లే మాట్లాడుతూ..‘ అజంతా గుహల సమీపంలో రెండు కిలోమీటర్ల దూరం వరకు సీతాకోక చిలుకలను ఆకర్షించేందుకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచాలని నిర్ణయించాం..’ అని అన్నారు. ‘ఈ ప్రదేశం లో ఎక్కువగా పుష్పించే వృక్షజాతులు ఉండటంతో వివిధ రకాల సీతాకోక చిలుకల ఉనికి ఇక్కడ స్పష్టంగా ఉంది. మేము ఈ వాతావరణాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ జాతుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. గుహలను సందర్శించేందుకు వచ్చే సందర్శకులకు ఈ సీతాకోక చిలుకలు అదనపు ఆనందాన్ని కలి గిస్తాయి..’ అని ఆయన చెప్పారు. సాధారణంగా వసంతకాలం, సీతాకాలాల్లో మాత్రమే సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే తాము వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా ఏడాది పొడవునా సీతాకోకచిలుకలు సందర్శకులను అలరించేలా చర్యలు తీసుకుంటున్నామని భోంస్లే తెలిపారు. వచ్చే ఏడాది జూన్-జూలై నుంచి తమ ప్రణాళిక అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పర్యాటకాభివృద్ధిలోభాగంగా గుహల సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు భోంస్లే చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఒక స్థలాన్ని ఉద్యానవనంగా మార్చి తీర్చిదిద్దనున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పనికిరాని మొక్కలను, చెత్తచెదారాన్ని తొలగింపు పనులు నడుస్తున్నాయని చెప్పా రు. దీంతో పర్యాటకులు జలపాతాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచివెళ్లి సందర్శించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి గుహల వద్ద పారిశుద్ధ్య సంరక్షణ నిమిత్తం సందర్శకుల నుంచి ‘న్యూసెన్స్ ఫీ’ కింద రూ.10 వసూలు చేయనున్నామని భోంస్లే చెప్పారు. కాగా, ఇటీవల అజంతా గుహలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ(అటవీ) ప్రవీణ్ పరదేశీ, ఔరంగాబాద్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ మెయిపోకం అయ్యర్ సందర్శించి అటవీ శాఖ చేసిన ప్రతిపాదనలను ఆమోదించారని అజిత్ భోంస్లే వివరించారు.