భద్రాచలం : పాపికొండల విహార యాత్ర పేరుతో కొందరు చేస్తున్న వ్యాపారం పర్యాటకులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎలాంటి భద్రత, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని చోట పర్యాటకులు చేస్తున్న రాత్రి బస ఒక్కోసారి వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పాపికొండల వద్ద కొల్లూరు ఇసుక తిన్నెల్లో సోమవారం జరిగిన సంఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. భోజనం విషయంలో నిర్వాహకులు, పర్యాటకులకు మధ్య జరిగిన మాటల యుద్ధం చివరకు ఘర్షణకు దారితీసింది. కొల్లూరు హట్స్ నిర్వాహకులు విచక్షణారహితంగా తమపై దాడి చేశారని బాధిత పర్యాటకులు భద్రాచలంలో విలేకరుల వద్ద వెల్లడించారు.
ఖమ్మానికి చెందిన దంతవైద్య నిపుణులు పి. కిశోర్ కుటుంబంతో పాటు, హైదరాబాద్‌కు చెందిన బంధువులతో కలసి మొత్తం 21 మంది ఆదివారం పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. ఇందులో పదేళ్ల లోపు వారు 8 మంది ఉన్నారు. వీరంతా ఆదివారం రాత్రి పాపికొండల వద్ద గల కొల్లూరు ఇసుక తిన్నెలపై ఉన్న హట్స్‌లో బస చేశారు. సోమవారం తిరుగు ప్రయాణ సమయంలో మధ్యాహ్న భోజనం చేసేచోట నిర్వాహకులతో కొంతమంది వాగ్వాదానికి దిగారు. భోజనం బాగాలేదని నిలదీయగా, నిర్వాహకులు తమపై దాడి చేశారని డాక్టర్ కిశోర్ తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వచ్చామని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఎవరికీ చెప్పుకోలేకపోయామని, భయంతో తిరుగుముఖం పట్టామని డాక్టర్ కిశోర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిర్వాహకుల ఇష్టారాజ్యం...
పాపికొండల విహార యాత్రపై ప్రైవేటు పెత్తనం సాగుతోంది. ప్రకృతి అందాలతో కొంతమంది బడాబాబులు చేస్తున్న దోపిడీ వ్యాపారానికి అడ్డకట్ట వేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకృతి అందాలు కనుమరుగవుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment