
సాక్షి, తూర్పు గోదావరి: కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విపత్తు నివారణ కమిటీతో సమావేశమయ్యారు. ఆదివారం రాజమండ్రిలో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తుఫాన్‌లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని, ముందుగా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ బోట్లయినా సరే నిబంధనలు కచ్చితంగా పాటించేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదానికి గురైన బోటును గుర్తించేందుకు నేవీ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఢిల్లీకి వెళ్లిన తరువాత నిపుణులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. కచ్చులూరు వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బోటు బయటకు తీసే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏం సహాయం కావాలన్నా అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి బోటును బయటకు తీయడానికి ప్రయత్నిస్తాన్నారు. బోటు ప్రమాదానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment