కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్లమద్ది చెట్టు నుంచి ధారగా వస్తున్న నీరు
20 లీటర్ల మేర సేకరణ పాపికొండలు నేషనల్ పార్క్‌లో సంఘటన
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది.
దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment