
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment