27 మంది బయటపడ్డారు: ఏపీఎస్‌డీఎమ్‌ఏ | APSDMA Report On Boat Accident In Godavari Situation | Sakshi
Sakshi News home page

గాలింపు కొనసాగుతోంది: ఏపీఎస్‌డీఎమ్‌ఏ

Published Mon, Sep 16 2019 12:44 PM | Last Updated on Mon, Sep 16 2019 1:27 PM

APSDMA Report On Boat Accident In Godavari Situation - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన కచ్చలూరు బోటు ప్రమాద ఘటన ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి విపత్తుల నివారణ శాఖ(ఏపీఎస్‌డీఎమ్‌ఏ)పత్రికా ప్రకటన విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పడవ ప్రమాదానికి గురైన సమయంలో... అందులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో 27 మంది సురక్షితంగా బయటపడగా... గల్లంతైన మరో 24 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించింది. ఈ మేరకు దేవీపట్నం తహసీల్దార్‌, ఐటీడీఏ ఏపీవో నుంచి వివరాలు అందినట్లు తెలిపింది.

అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆరు ఫైర్‌ టీమ్‌లతో పాటు, ఎనిమిది ఐఆర్‌ బోట్లు, 13 ఆస్కా లైట్లు, ఒక సాటిలైట్‌ ఫోన్‌ ఆధారంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు  ఏపీఎస్‌డీఎమ్‌ఏ పేర్కొంది. ఈ బృందాలతో పాటు 2 ఎన్డీఆర్‌ఎఫ్‌, 3 ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించింది. అదే విధంగా గజ ఈతగాళ్ల బృందం, నావికా దళ అధికారులు కూడా రక్షణ చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీని త్వరగా కనిపెట్టేందుకు ఉత్తరాఖండ్‌ నుంచి ప్రత్యేక సైడ్‌ స్కానర్‌ ఎక్విప్‌మెంట్‌ను తీసుకువచ్చామని, దీంతో పాటు ఉత్తరాఖండ్‌ నుంచి ఆరుగురితో కూడిన నిపుణుల బృందం కూడా కచ్చలూరుకు చేరుకుందని పేర్కొంది. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 27 మందిలో 16 మందికి రంపచోడవరంలోని ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిగిందని..అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని రాజమండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఏపీఎస్‌డీఎమ్‌ఏ తెలిపింది. వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు రాజమండ్రి ఆస్పత్రిలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement