సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఆశగానే మిగిలిన వరికపూడిశెల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ అయ్యింది. సాగు, తాగు నీటి ఎద్దడి తీరుతుందని ప్రజలంతా సంతోషిస్తున్నారు. కానీ, పెత్తందారుల పైత్యాన్ని ప్రదర్శించే ‘ఈనాడు’కు ఇది మింగుడు పడటంలేదు.
అందుకే ‘వరికపూడిశెల’పై అసత్యాల ఎత్తిపోతలు మొదలెట్టింది. ఐదేళ్లూ అధికారం అనుభవించి ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసిన చంద్రబాబును పల్లెత్తి మాట అనలేదు. ప్రజలకు నీటి కష్టం ఉందని చెప్పేందుకూ మనసు రాలేదు. ఇప్పుడు వరికపూడిశెల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే వక్రీకరణల డైవర్షన్ మొదలెట్టింది.
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు!
వాస్తవానికి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆ మోసాన్ని గొప్పగా చిత్రీకరించడంలో రామోజీరావు పెన్ను తిరిగిన వ్యక్తి. ఈ దొంగల ద్వయం ఎన్నికల ముందు హడావుడి చేసి ఓట్లు ఎత్తిపోసుకోవాలనే కుట్రతోనే ఆనాడు అంటే.. 2019 ఫిబ్రవరి 6న వరికపూడిశెల ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం ఇస్తున్నట్టు నాటకం ఆడారు.
అసలు వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రిజర్వ్ ఫారెస్టులో పైప్ లైన్ పనులు చేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలీదా? అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలి కదా! ఇవి లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారన్నది అసలు ప్రశ్న. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి నాయకులకు ఉంటే ఇవన్నీ ఆలోచించేవారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ప్రజలను దగా చేశారు.
గత ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా నెల ముందు పరిపాలనా ఆమోదం ఇస్తూ టెండర్లు పిలిచినట్టు పెద్ద షో చేశారు. దీని ఆధారంగానే ‘ఈనాడు’ ప్రాజెక్టు అంతా బాబు హయాంలోనే రూపుదిద్దుకున్నట్టు మంగళవారం వక్రభాష్యం పలికింది. వాస్తవానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికపూడిశెల ఎత్తిపోతలకు అంకురార్పణ చేశారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం పులుల అభయారణ్యంలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పనిసరి అయ్యాయి.
చిత్తశుద్ధి ఎక్కడ బాబు!
రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారం అనుభవించిన చంద్రబాబు... ఈ ఎత్తిపోతలకు అత్యంత కీలకమైన వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు కూడా సాధించకపోవడం ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చి న మాట ప్రకారం పల్నాడు వాసుల వరికపూడిశెల కలను సాకారం చేస్తున్నారు. పలు దఫాలు కేంద్రంతో చర్చించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి తీసుకునే భూమికి బదులు వేరొక చోట భూమిని సమకూర్చి ప్రాజెక్టుకు ఆటంకం లేకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment