
సాక్షి,తాడేపల్లి: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం(ఫిబ్రవరి 14) ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.
కాగా,అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.

వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment