ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది మరో మహాభారతం. వీరత్వంతో యుద్ధం చేస్తున్న బాలుడు అభిమన్యుడి మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలు సంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ పాలన చేస్తున్న పిన్న వయస్కుడైన జగన్ మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారు ఈనాడు. వీరి ప్రయత్నమంతా జగన్‌ను యుద్ధభూమి నుండి తప్పించాలని! అయితే జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. కనుకనే ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుర్యోధన సైన్యంలా వారంతా రోజురోజుకు పెరిగిపోతుంటే ఇవతల జగన్ ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది.
మహాభారత రాజకీయం అన్ని కాలాలకు వర్తిస్తుందనటానికి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలే నిదర్శనం. ధర్మరాజును ప్రాణాలతో బంధించటానికి ఆనాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అది చాలా ప్రమాదకరమైనది. శత్రువు లోపల ప్రవేశించడమంటే అతని మరణాన్ని కొనితెచ్చుకోవటమే. దానినే చక్రవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి గారి చుట్టూ పద్మ వ్యూహం అల్లబడింది. అతిరథ మహారథులందరూ ఒక్కడిని జయించడానికి లేదా మట్టుపెట్టడానికి అంచెలంచెలుగా వ్యూహాత్మకంగా కుట్రలు సాగిస్తున్నారు. అక్కడ తలపండిన ద్రోణుడు ఆ వ్యూహానికి కర్త అయితే, ఇక్కడ 87 ఏళ్ళ వృద్ధ రామోజీ ఇదంతా నడిపిస్తున్నాడు.
వీళ్ళ ఎత్తుగడలో భాగం మీడియా ద్వారా జగన్‌నూ, ఆయన పాలనను రోజూ దుమ్మెత్తిపోయడం. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం. దానికి వైకాపా సోషల్ మీడియా ఎదురు దాడికి దిగటంతో ఆ ఆటలు సాగలేదు.ఇక ఎన్డీయేతో రామోజీతో పాటు వెంకయ్య కూడా కష్టపడి పొత్తును కుదిర్చారు. దానితో ఈ మూడో అంచె వ్యూహాన్ని జగన్ అస్సలు దాటలేడని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ ఈ అవకాశ పొత్తులు ప్రజలకే నచ్చక ఛీ కొట్టడంతో అదికూడా ఫెయిలయ్యింది.
దాంతో ‘చతుర్విధోపాయసాధ్యేతు రిపౌసాంత్వమప క్రియాన్’... అనగా సామ భేద దాన దండోపాయాల్లో, బలమైన శత్రువును ఎదుర్కోవా లంటే నాలుగవది అయిన దండోపాయమే సరయినదని ఈ కూటమి భావించి ఏకంగా ప్రాణాలు తియ్యటానికి తెగించింది. అందుకే విజ యవాడలో సూటిగా బాణం వేయగలిగిన సైంధవుడి లాంటి సతీష్‌ను బోండా ఉమ డైరక్షన్లో ప్రవేశపెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్టు, ఆ దైవమే ఆ సమయంలో కూడా ఆయనను కాపాడింది. ఏ కొంచెం స్థానం మారినా, పెను విషాదం చోటు చేసుకునేది.
వీరత్వంతో నిజాయితీగా యుద్ధం చేస్తున్న ఒక్క బాలుడి (అభిమన్యుడు) మీద నాలుగు మూలల నుండి అస్త్ర పరంపరలుసంధించారు ఆనాడు. పేద ప్రజల సంక్షేమమే ఆశయంగా పెట్టుకుని దుష్ట గ్రహాల్ని ఎదిరిస్తూ నిర్భయంగా పాలన చేస్తున్న ఈ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మీద అన్ని వైపుల నుండి దాడి చేస్తు న్నారు ఈనాడు. ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ఆపుచేయటానికి మేధావుల ముసుగులో ఒక ఫోరమ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వృద్ధులకు, అంగ వికలురకు నిరంతరం సేవలందిస్తున్న వలంటీరు వ్యవస్థను ఈ కుహనా మేధావులు ఆపించి ఏదో గొప్ప కార్యం సాధించినట్లు భుజాలెగరేస్తున్నారు.
ఈసారి ఈ దుష్టకూటమి ఎన్నారై వింగ్‌ను చివరి చక్రంలోకి ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన నాయకుడు కోమటి జయరాం. 2020లో వైకాపా నుండి 23 మంది ఎమ్యెల్యేలను కొనటం దగ్గర నుండి మొన్న ఎమ్మెల్యే శ్రీదేవికి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటు కొను క్కునే వరకు కథంతా నడిపించింది ఈ ఎన్నారై మేధావే. కోట్లాది రూపాయలతో ఓటరు ‘వెధవలను’ (వాళ్ళ భాషలో) కొనటానికి మరో అస్త్రం సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ అది కూడా బయటపడిపోయింది. కాలం సమీపించినపుడు పాపాత్ములు ఏ పని చేసినా అది వాళ్ళకు ఎదురీతగానే మారుతుందన్న సామెత నిజ మైంది. భారతం కూడా అదే చెబుతుంది. ‘పిరికితనము, నేరప్రవృత్తి, పదవి, ధనాశ లాంటి ప్రవృత్తి గలవానికి సిరి తనంతట తానే తొలగి పోతుంది’ అనే మాట చంద్రబాబు పట్ల ఋజువు కాబోతున్నది.
ఇక జగన్ మీద తండ్రీకొడుకుల వాగ్బాణాలయితే చెప్పే పని లేదు. ఒక్కడిని చుట్టు ముట్టి బహిరంగ దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరి ప్రయత్నమంతా జగన్‌ను యుద్ధభూమి నుండి తప్పించాలని! ఆయన చేసిన పాపం ఏమిటి? ఆనాడు భారత యుద్ధంలో కూడా కపటోపాయంతో తండ్రిని దూరంగా పంపి అభిమ న్యుడిని బలి చేశారు. ఈరోజు కూడా ఈ ఎన్నికల సమరంలో తండ్రి లేని జగన్‌ను ఇంతమందీ కలసి ముట్టడిస్తున్నారు. అయితే ఆయన అర్జునుడు కనుక ‘ఏనుంగు మీది కెగయు సింహ కిశోరంబు రీతి’గా ఈ దుష్టుల పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పద్మవ్యూ హాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. జగన్ అంటే ధైర్యం, జగన్ అంటే ధర్మం, జగన్ అంటే విశ్వసనీయత. అందుకే వీరి బరితెగింపు నీచరాజకీయాలను తన పదునయిన అస్త్రాలతో ఛిన్నా భిన్నం చేసుకుంటూ అశేష ప్రజల ఆశీస్సులందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.
ఇక కూటమి దురవస్థ కూడా కౌరవుల మధ్య పొసగని అభిప్రా యాల్లాగానే ఉంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడుస్తారో అని అస్తమానం అదే భయంతో బతుకు తున్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు సిద్ధాంత బలం లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా కలుస్తాయి. కమ్యూనిస్టులు బీజేపీ కూటమికి మద్దతిస్తారు. ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నది. కుల నాయకుడి కోసం ఐఏఎస్ పట్టాలను దాచిపెట్టి కుల రౌడీల్లా వీధుల్లోకొస్తారు కుహనా మేధా వులు. తండ్రికి మరో వెన్నుపోటుదారు పురందేశ్వరి. వైయస్సార్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ తిరుగుతున్న షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విష కూటమితో కలిసి జగన్‌ను తిట్టి పోస్తారు.
దుర్యోధన సైన్యంలా వీరంతా రోజురోజుకు పెరిగి పోతుంటే ఇవతల జగన్ ప్రజా దరణ అంతకంతకు పెరిగిపోతూనే వుంది. ఇంకా జగన్‌ను చంపడానికి ప్రయత్నించిన, హర్షవర్ధన చౌదరి, బోండా ఉమా లాంటి రౌడీలు కూడా ఈ వర్గంలో తక్కువేమీ కాదు. రాష్ట్రంలో ఈ అల్లరి మూకలు వైకాపా కార్యకర్తల మీద సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న గాక మొన్న మంగళగిరిలో రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ హింసావాదాన్ని రెచ్చగొడుతున్న లోకేష్ గూండాలు ఎదురుగా వెళ్ళి పార్టీ ప్రచారంలో ఉన్న వెంకటరెడ్డిని బైకులతో గుద్ది చంపేశారు. దానిని కూడా సమర్థించుకుంటూ వీరి ప్రచారం సాగిపోతూనే వుంది.
ఈ ఆంధ్రా కురుక్షేత్రంలో మే 13న జరిగే ఎన్నికలు అన్నింటికీ సమాధానం చెబుతాయి. ప్రళయం వస్తే మొత్తం ఊడ్చేసినట్లు రేపు ఈ ఓటరు సునామీ ఈ కౌరవ సైన్యాన్నంతా ఓడించి దూరంగా విసిరేస్తుందనే మాట ఖాయం. దేశమంతా మెచ్చుకుంటున్న జగన్ పాలన మళ్ళీ రావటం ఖాయం. కొద్దిరోజులు ఓపిక పడదాం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ప్రతి ఓటు జగన్‌కు వేసి వీళ్ళ పద్మవ్యూహాన్ని ధ్వంసం చెయ్యాలి. వీర అర్జునుడికి విజయం అందించాలి.
- వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్
- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
Comments
Please login to add a commentAdd a comment