Kinnerasani reservoir
-
భద్రాద్రిలో ఘోర ప్రమాదం.. కిన్నెరసాని వాగులో దూసుకెళ్లి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండల పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని వేలేరు బ్రిడ్జి పై నుంచి కిన్నెరసాని వాగులో పడింది ఓ ట్రాలీ వాహనం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. వాహనం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఏలూరు జిల్లా(ఏపీ) నర్సాపురం మండలం తిరుమల దేవి పేట కు చెందిన వాళ్లు. భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వస్తా అని చెప్పి కానరాని లోకాలకు -
ఉప్పొంగి ప్రవహిస్తున్న కిన్నెరసాని
-
మందెరకలపాడులో బాంబుల మోత
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో మందెరకలపాడు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా బాంబుల మోత మోగింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయా? ల్యాండ్ మైన్స్ పేల్చారా? అనే చర్చ సాగింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... గతంలో తోగ్గూడెం క్వారీలో పోలీసులు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేయాలని ఆదేశించడంతో కొత్తగూడెం నుంచి బాంబు స్క్వాడ్ వచ్చి మందెరకలపాడు అటవీప్రాంతంలో నీటిలో జిలెటిన్‌స్టిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. మరికొన్ని జిలెటిన్ స్టిక్స్‌ను నేడు నిర్వీర్యం చేయనున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జిలెటిన్ స్టిక్స్‌ను వాగులో పేల్చామని పాల్వంచ రూరల్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
కిన్నెరసానిలో భారీ చేప
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసాని రిజర్వాయర్‌లో భారీ చేప మత్స్యకారులకు లభ్యమైంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో మత్స్యకారులు వేసిన వలకు 13 కేజీల భారీ బొచ్చె రకం చేప లభించిందని మత్స్యకారుడు సమ్మయ్య తెలిపారు. కోడిపుంజులవాగులో ఈ భారీ చేపని విక్రయానికి పెట్టగా దానికి రూ.950 ధర పలికింది. ఐదుగురు కలిసి చేపను కొనుగోలు చేశారు. చేపను తిలకించడానికి స్థానికులు ఆసక్తి చూపారు. -
‘ఫైబర్’ మ్యూజియం
పాల్వంచరూరల్ : కిన్నెరసాని లో జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్‌కు చెందిన కళాకారులను రప్పించి వివిధ రకాల వన్యప్రాణుల బొమ్మలను తయారు చేయించారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్రప్రభుత్వం మంజూరు చేసి న నిధులతో కిన్నెరసానిలోని పర్యావరణ విద్యాకేంద్రాన్ని వన్య మృగాల సంరక్షణ విభాగం పర్యవేక్షణలో ఆధునికీకరించారు. కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే 24 రకాల అరుదైన జంతువుల బొమ్మలను అహ్మదాబాద్‌కు చెందిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందిన కళాకారులు ఫైబర్ వస్తువులతో రూపొందించా రు. వీటిని రెండు ఏసీ గదుల్లో ఉంచారు. విద్యాకేంద్రంలోకి ప్రవేశించగానే ఎదురుగా మొసలి బొమ్మ కన్పిస్తుంది. పక్కనే ఉన్న గదిలో ఒక చెట్టుపై నెమలి, గుడ్లగూబ, చెట్టు కింద కొండ చిలువ పాము, కొంగ తదితర బొమ్మలు దర్శనమిస్తాయి. మరోగదిలో ప్రధానంగా అడవి దున్న, మొసలి, చిరుత,పులి, కొంగ, ఉడు ము, ఎలుగుబంటి, చుక్కల దుప్పి తదితర జంతువుల బొమ్మలను ఉంచారు. వృక్షాలు, జలాశయానికి సంబంధించిన షార్ట్ ఫిలిం థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 50మంది ఒకేసారి కుర్చోని వీక్షించ వచ్చు. వివిధ పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులకు సంబంధించిన ఆడియో రికార్డులను, వాటి చిత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. రూ.20లక్షల వ్యయంతో.. రూ.20లక్షలతో వివిధ రకాల జంతువుల బొమ్మ లను తయారు చేసి పర్యావరణ విద్యాకేంద్రంలో ఏర్పాటు చేశాం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కల్గించేవిధంగా ఉంటా యి. షార్ట్ ఫిలిం థియేటర్ కూడా ఏర్పాటు చేశాం. మ్యూజియం ప్రారంభించిన తర్వాత నుంచి పర్యాటకుల స్పందన పెరిగింది. కిన్నెరసానిలో ఆహ్లాదంతోపాటు విజ్ఞానం కూడా అందిస్తున్నాం. -నాగభూషణం, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ -
‘ఆయకట్టు’ ఆవేదన
సాక్షి, కొత్తగూడెం : కిన్నెరసాని రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాలకు సాగునీరందడంలేదు. నీటిపారుదల శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీపీఎస్ అవసరాల నిమిత్తం నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్ ద్వారా రెండు మండలాల్లోని పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలని.. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 డిసెంబరు 31న కాలువలకు శంకుస్థాపన చేశారు. ఎడమ కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని యానంబైలు, పాండురంగాపురం, బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, అంజనాపురం, టేకులచెరువు, జింకలగూడెం, మోరంపల్లి బంజర గ్రామాల వరకు 7వేల ఎకరాలకు నీరందించేలా, కుడి కాలువ ద్వారా పాల్వంచ మండలంలోని పాయకారి యానంబైలు గ్రామం వరకు 3వేల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్ణయించారు. కాలువ దోమలవాగు చెరువులో కలిసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కాల్వల నిర్మాణం చేపట్టారు. రైతుల కోరిక మేరకు రాజశేఖరరెడ్డి సూచనతో బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామాలకు కూడా నీరందించేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు కాలువల పనులు పూర్తికాలేదు. నీటి సరఫరా కూడా సక్రమంగా చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి వస్తున్నారని ఒక్క రోజు వదిలారు ఎడమ కాలువ ద్వారా ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీరు వదిలిన దాఖలాలు లేవు. గత ఏడాది మంత్రి హరీష్‌రావు వస్తుండడంతో మొక్కుబడిగా ఆ రోజు నీరు వదిలి చేతులు దులుపుకున్నారు. రాజన్న హయాంలో అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో లక్ష్మీపురం, నాగినేనిప్రోలు గ్రామం వరకు 4 కిలోమీటర్ల మేర కాలువ కోసం ఇప్పటివరకు భూసేకరణ సైతం చేయలేదు. మహానేత మరణానంతరం మళ్లీ పాత పద్ధతి ప్రకారం దోమలవాగులోనే కాలువ ముగిసేలా తంతు పూర్తి చేశారు. ఇప్పుడున్న కాలువ ద్వారా కూడా నీటిపారుదల చేస్తున్న దాఖలాలు లేవు. నీటిపారుదల అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. ఇక కొత్తగా వస్తున్న సీతారామ కాలువ 19.1(కిలోమీటర్) వద్ద కిన్నెరసాని కాలువను క్రాస్ చేసుకుంటూ వెళుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు సీతారామ కాలువ కింద పోతున్నాయని, దీంతో కిన్నెరసాని నీరు వచ్చే అవకాశం లేదని బూర్గంపాడు మండల రైతులు గగ్గోలు పెడుతున్నారు. సీతారామ కెనాల్ క్రాసింగ్ వద్ద స్ట్రక్చర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సదరు కాలువ క్రాస్ చేస్తున్న 19.1 వద్ద కిన్నెరసాని నీరు పైనుంచి వెళ్లేవిధంగా ప్రత్యేక స్ట్రక్చర్ నిర్మించేందుకు నిర్ణయించాం. గత ఏడాది ఎడమ కాలువకు నీరివ్వడం ప్రారంభించగా ఈ ఏడాది నుంచి కొనసాగిస్తాం. దోమలవాగు వద్ద కిన్నెరసాని కాలువ ముగుస్తుంది. –వెంకటేశ్వరరెడ్డి, ఇరిగేషన్ ఈఈ -
ఐదు పిల్లలు పెట్టిన మొసలి
పాల్వంచరూరల్ : కిన్నెరసాని రిజర్వాయర్‌లో మొసళ్ల సంతతి పెరుగుతోంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో అద్దాలమేడ సమీపంలో ఓ ఆడ మొసలి గుడ్లు చేసి పొదిగి ఆదివారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. -
మొసళ్లెన్నో..
అటవీ శాఖాధికారులు ఇటీవల జంతువుల గణన నిర్వహించారు. ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల సర్వే నిర్వహిస్తున్నారు. కానీ అభయారణ్యంలో ఉన్న రిజర్వాయర్‌లోని మొసళ్లను మాత్రం లెక్కించడంలేదు. ప్రస్తుతం ఎన్ని వేలు ఉన్నాయో కూడా తెలియదు. తరచుగా నీటిపై తేలియాడుతూ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యంలోని రిజర్వాయర్‌లో 1984 సంవత్సరంలో మగ్గర్ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను(మొత్తం 33) అటవీ శాఖాధికారులు వదిలారు. అప్పుడవి నాలుగు మీటర్ల పొడవు, 200 కేజీల బరువు ఉన్నాయి. మగ్గర్ జాతికి చెందిన మొసళ్లు చేపలు, నత్తలు, కప్పలు, వివిధ మలిన ఆహారం తీసుకుంటాయి. ప్రతీ సంవత్సరం ఒక్కో మొసలి 10 నుంచి 40 గుడ్లు పెడుతుంది. మే, జూన్ నెలల్లోనే గుడ్లు పెట్టి, 60 నుంచి 90 రోజుల వరకు పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి. కిన్నెరసాని అనువైనది మొసళ్లు దేశంలో అంతరించిపోతున్నాయని మగ్గర్ జాతికి చెందిన సముద్రపు మొసళ్లను పాల్వంచలోని కిన్నెరసానితోపాటు మంజీరాలో వన్యప్రాణి అభయారణ్య సంరక్షణ అధికారులు వదిలారు. కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగుల లోతుతో నీటినిల్వ సామర్థ్యం కలిగి ఉంది. జలచరాలు ఉండేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రిజర్వాయర్‌లో ద్వీపాలు ఉండటం, రాళ్లు, చెట్లతో అనువుగా ఉండటమే కాకుండా బురద ప్రాంతాలు, పొదళ్లు ఉన్నాయి. మొసళ్లకు ఆహారం కూడా సమృద్ధిగా దొరికేందుకు వీలుగా ఉంది. దీంతో 1984లో మొసళ్లను ఈ రిజర్వాయర్‌లో వదిలారు. ఉష్ణోగ్రత సైతం వేసవిలో కనిష్టం 15 డిగ్రీల నుంచి గరిష్టం 45 డిగ్రీల వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 760 మి.మీల నుంచి గరిష్ట వర్షపాతం 1130 మి.మీల వరకు ఉంటుంది. దీంతో మొసళ్లు పెరగడానికి కిన్నెరసాని రిజర్వాయర్‌ను అనువైనదిగా గుర్తించారు. లెక్కించేదిలా... జంతువుల గణన మాదిరిగానే అధికారులు జలచరాలను లెక్కించకపోవడంతో కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఎన్ని మొసళ్లు ఉన్నాయి, ఎన్ని బయటకు వెళ్లాయో అంతుచిక్కడంలేదు. మొసళ్ల గణనను జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రాత్రివేళల్లో అత్యాధునిక బైనాక్యులర్లు, నీటి కెమేరాలను వినియోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లెక్కిస్తారు. మొసళ్లు నడిచే మార్గంలో వాటి అడుగులు, గుర్తులు, గుళికలు, గుడ్డు కవచాలు తదితర వాటి ఆధారంగా గణన చేస్తారు. వేసవిలోనే బయటకు వస్తాయి.. 20 సంవత్సరాల క్రితం డెహ్రాడూన్ నుంచి బీఎన్.చౌదరి అనే అధికారి రిజర్వాయర్‌లోని మొసళ్ల సంఖ్యను లెక్కించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం వీటిని లెక్కించే చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటి సంఖ్య ఎంత అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల పాలేరు నుంచి కూడా మూడు మొసళ్లను తీసుకువచ్చి కిన్నెరసానిలో వదిలారు. గతంలోనూ ఇలా మొసళ్లను బయటి ప్రాంతం నుంచి తీసుకువచ్చి వదిలిన సందర్భాలున్నాయి. వేసవిలోనే ఎక్కువగా బయటకు కన్పించేవిధంగా మొసళ్ల సంచారం ఉంటుంది. ప్రస్తుతం ఎన్ని ఉండొచ్చు? కిన్నెరసానిలో 1984లో 33 మొసళ్లను వదలగా, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో మొసలి ఏడాదికి 10 నుంచి 40 గుడ్లు పెడుతుండగా, వాటిల్లో కనీసం 20 గుడ్లు అయినా బతికే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 440 పిల్లల చొప్పున 34 ఏళ్ల కాలంలో సుమారు 14,960 మొసళ్లు ఈ రిజర్వాయర్‌లో ఆవాసం పొందుతున్నట్లు అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. కాల్వల ద్వారా మైదాన ప్రాంతాలకు.. కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న నీరు కాల్వ ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు నిత్యం సరఫరా అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ కాల్వ ద్వారానే మొసళ్లు బయటకు వెళ్లి మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వాటిని గుర్తించి పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కిన్నెరసాని కాల్వ సమీపంలోని కొత్తగూడెం మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద ఓ మడుగులో రెండు మొసళ్లు బయటనే సంచరిస్తున్నాయి. రెండేళ్లుగా అక్కడే గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పొంచి ఉన్న ప్రమాదం కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న మొసళ్ల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌లో బోటు షికారు నిర్వహిస్తుండగా, సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో చేపలు పడుతూ ఉంటారు. మొండికట్ట, కిన్నెరసాని, యానంబైలు ప్రాంతాలకు చెందినవారు తెప్పలు వేసుకుని రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో మొసళ్లు కాల్వల ద్వారా సమీప గ్రామాల్లోకి సైతం వెళ్తున్నాయి. అయితే అసలు ఈ మొసళ్ల గణన అనేది ఎవరి పరిధిలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వాయర్ నిర్వహణ జెన్కోది కాగా రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతమంతా వన్యమృగాల సంరక్షణ శాఖ కిందకు వస్తుంది. దీంతో అసలు మొసళ్ల బాధ్యత ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. మాకు సంబంధం లేదు కిన్నెరసాని రిజర్వాయర్‌లోని జలచరాల గణనతో మాకు సంబంధం లేదు. నీటి వినియోగం, పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. మిగతావి వైల్డ్‌లైఫ్ శాఖే చూసుకుంటుంది. –ఎస్ఎన్ మూర్తి, సీఈ, కేటీపీఎస్(5,6దశలు) -
‘ట్రయల్’.. ట్రబుల్
బూర్గంపాడు: గోదావరి జలాలను కేటీపీఎస్కు తరలించే పైప్‌లైన్ మోరంపల్లిబంజర సమీపంలో లీకైంది. అక్కడే ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు గోదావరి జలాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునేందుకు బూర్గంపాడు నుంచి కేటీపీఎస్ వరకు పైప్‌లైన్ వేశారు. అధికారులు గోదావరి జలాలను తరలించేందుకు మంగళవారం ముందస్తుగా ట్రయల్ రన్ వేయగా.. పైప్‌లైన్ లీకైంది. సుమారు రెండు గంటల పాటు నీరు ఇలా రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. -
గూడెంకు గండం
♦ ‘కిన్నెరసాని’లో తగ్గుతున్న నీరు ♦ నల్లా నీటికి రోజులతరబడి ఎదురుచూపులు ♦ కొత్తగూడెం, పాల్వంచకు నీటి కష్టాలు ♦ ప్రత్యామ్నాయం చూపని అధికారులు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణానికి పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. రోజు కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీల వల్ల సగానికి పైగా నీరు వృథాగా పోతోంది. పైపుల ద్వారా వచ్చే మిగిలిన నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ప్రస్తుత వేసవిలో రెండు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘గూడెం’ గొంతెండుతోంది. తాగునీటి కోసం అల్లాడుతోంది. పాల్వంచ, కొత్తగూడెంకు నీరందించే కిన్నెరసాని రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీరు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బోర్లు, మినీ వాటర్స్కీంలు మూలకుపడటం...పైపులైన్లు, గేట్ వాల్వ్‌ల లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. నల్లా నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు తప్పటం లేదు. అధికారుల ప్రణాళిక లోపం..ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో నియోజకవర్గం నీటి కోసం అలమటిస్తోంది. తగ్గుతున్న నీటిమట్టం కిన్నెరసాని రిజర్వాయర్ మొత్తం నీటిమట్టం 407 అడుగులు. అది పూర్తిగా నిండితే 8.400 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 396.7 అడుగుల మేరకు నీరు ఉంది. దీనిద్వారా కేటీపీఎస్ ఏ,బీ,సీ స్టేషన్లు, 5,6 దశలకు రోజుకు 86 క్యూసెక్కుల నీరు, నవభారత్‌కు 4 క్యూసెక్కులు, ఎన్ఎండీసీ సిల్కు ఒక క్యూసెక్, కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కులు.. ఇలా మొత్తం 26.34 క్యూసెక్కుల నీరు ప్రతిరోజు సరఫరా అవుతోంది. అంతేకాక కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు రోజు 1.8 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 396.7 అడుగులు ఉన్న కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం మే నెలలోగా డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నీళ్ల కోసం మైళ్ల దూరం పాల్వంచ మండలం సీతారాంపురం గిరిజనులు నీళ్ల కోసం నరకయాతన పడుతున్నారు. గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి తాగునీరు అందించడానికి బోరు వేయడానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. దీంతో 2 కిలోమీటర్ల దూరంలోని కుంట వద్ద చెలిమ తీసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరమ్మతుల్లో బోర్లు, మినీ వాటర్ స్కీంలు కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 280 బోర్లు ఉండగా.. వీటిలో 60 వరకు మరమ్మతులో ఉన్నాయి. 33 వార్డుల్లో 19 మినీ వాటర్ స్కీంలలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి వల్ల పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరాకాలనీ, వెంగ ళరావు కాలనీ, తెలంగాణ నగర్ కాలనీ తదితర కాలనీల్లో బోర్లు వేశారు. కానీ.. వాటి నీరు చుట్టుపక్కల ఉన్న వారికే సరిపోయే పరిస్థితి ఉంది. కాలనీ మొత్తం ఒక్కబోరు వేయడంవల్ల ఏమాత్రం సరిపోయేపరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. పాల్వంచ మండలంలో 420 బోర్లు ఉండగా.. 80 మరమ్మతుకు చేరాయి. 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో 45 పనిచేస్తున్నాయి. సంగంగ ట్టు, కిన్నెరసాని, రేగులగూడెం, మల్లారంలో ఓవర్‌హెడ్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కేవలం జగన్నాథపురంలో మాత్రమే మినీ వాటర్ స్కీం ఉంది. కొత్తగూడెం మండలంలో 954 బోర్లు ఉండగా.. 69 బోర్లు పనిచేయడం లేదు. 107 డెరైక్ట్ పంపింగ్ స్కీంలు ఉన్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. తంటాలు పడుతున్నాం వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మే నెలలోగా మంచినీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లలో కొనుక్కోవాల్సిందే. రోజూ నీరు సరఫరా చేస్తామని చెబుతున్న అధికారులు మూడు నాలుగు రోజులకోసారి కూడా నీటిని అందించలేకపోతున్నారు. - కె.సత్య, పాల్వంచ మరమ్మతు చేయించాలి కిన్నెరసాని నీళ్లు నాలుగైదు రోజులకోసారి వస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన మినీ వాటర్ స్కీంలు పని చేయడంలేదు. వాటినైనా మరమ్మతు చేయిస్తే బాగుంటుంది. ఎండా కాలంలో నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. పైపులైన్ల లీకేజీలను అరికట్టాలి. - నర్సమ్మ, కొత్తగూడెం దాహార్తి తీర్చాలి వేసవిలో ప్రజలు ఎదుర్కొనే మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తే బాగుండేది. కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నారు తప్ప ఆచరణలో చూపించడం లేదు. ప్రజల దాహార్తి తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. - కంటె స్వప్న, పాల్వంచ -
కిన్నెరసాని రిజర్వాయర్‌లో జోరుగా చేపలవేట
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్‌లో చేపలవేట జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తెప్పలు కట్టుకుని వెళ్లి వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు. కొందరు వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటుండగా మరికొందరు ఒడ్డునే ఈ వ్యాపారం చేస్తున్నారు. మొసళ్లు సంతచరించే ఈ రిజర్వాయర్‌లోకి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా యథేచ్ఛగా చేపల వేట కొనసాగుతున్నారు. రిజర్వాయర్‌లోకి వెళ్లడం నిషేధమైనప్పటిప్పటికీ అలాంటి నిబంధనలేవీ తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేటీపీఎస్ అధికారులు, అటవీశాఖ అనుబంధ వైల్డ్‌లైఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే చేపల వేట జరుగుతుండడం, ఒడ్డున డ్యామ్ పక్కనే విక్రయాలు సాగుతుండడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నా చూసీచూడనట్లు వదిలేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రిజర్వాయర్ వద్ద పహారా కాసే కేటీపీఎస్, వైల్డ్‌లైఫ్ సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
క్షేత్రస్థాయిలో.. ‘సెయిల్’ పర్యటన
కొత్తగూడెం/బయ్యారం, న్యూస్‌లైన్ : బయ్యారం మండలంలో ఉన్న ఐరన్‌ఓర్‌ను వినియోగించి జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బృందం గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో సెయిల్ బృందం సభ్యులు కొత్తగూడెం, పాల్వంచ, బయ్యారం మండలాల్లోని భూములను పరిశీలించారు. తొలుత కొత్తగూడెం మండలంలోని రేగళ్ల పంచాయతీ కూనారం, పాల్వంచ మండలంలోని చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించారు. కిన్నెరసాని జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కారేగట్టు, ఉల్వనూరు, చంద్రాలగూడెం ప్రాంతాలలో పర్యటించి తొమ్మిది వేల ఎకరాల అటవీ, అసైన్డ్ భూములకు సంబంధించిన మ్యాప్‌లు పరిశీలించారు. అయితే ఇక్కడి నుంచి పాండురంగాపురం రైల్వే ట్రాక్, విద్యుదుత్పత్తి చేసే కేటీపీఎస్, భద్రాచలం గోదావరి ఎంత దూరం ఉంటాయనే వివరాలను సెయిల్ బృందం సభ్యులు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉల్వనూరు వద్ద 21 వేల ఎకరాలు, చంద్రాలగూడెం వద్ద 8.50 వేల ఎకరాల భూములను పరిశీలించారు. ఆ తర్వాత కొత్తగూడెం మండలం రేగళ్ల పంచాయతీ కూనారంలోని 839 ఎకరాల అంబసత్రం భూములు, 4,300 ఎకరాల అటవీశాఖ భూముల మ్యాప్‌లను తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ 4 కి.మీ. దూరంలో ఉంటుందని, గోదావరి నది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అటవీ అధికారులు సెయిల్ బృందానికి వివరించారు. అనంతరం బయ్యారం మండలం ధర్మాపురం పరిధిలోని 4028 ఎకరాల భూములకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే లభ్యమయ్యే వనరుల గురించి జేసీ సురేంద్రమోహన్ సెయిల్ బృందానికి వివరించారు. ఆ తర్వాత బయ్యారం పెద్ద చెరువును సందర్శించి నీటివనరుల గురించి చర్చించారు. ఈ బృందంలో జేసీ వెంట సెయిల్ అధికారులు ఎ.మేథి, వి.సర్కార్, కుమార్, కె.ఎస్.సవారి, బెనర్జీ, డి.సాహు, సోమేశ్వరసింగ్, ఎ.కె.జా, డీజీఎం (ఐరన్) రాజన్కుమార్సిన్హా ఉన్నారు.