కిన్నెరసాని రిజర్వాయర్‌లో జోరుగా చేపలవేట
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్‌లో చేపలవేట జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తెప్పలు కట్టుకుని వెళ్లి వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు. కొందరు వాటిని మార్కెట్‌లోకి తెచ్చి అమ్ముకుంటుండగా మరికొందరు ఒడ్డునే ఈ వ్యాపారం చేస్తున్నారు. మొసళ్లు సంతచరించే ఈ రిజర్వాయర్‌లోకి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా యథేచ్ఛగా చేపల వేట కొనసాగుతున్నారు.
రిజర్వాయర్‌లోకి వెళ్లడం నిషేధమైనప్పటిప్పటికీ అలాంటి నిబంధనలేవీ తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేటీపీఎస్ అధికారులు, అటవీశాఖ అనుబంధ వైల్డ్‌లైఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే చేపల వేట జరుగుతుండడం, ఒడ్డున డ్యామ్ పక్కనే విక్రయాలు సాగుతుండడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నా చూసీచూడనట్లు వదిలేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రిజర్వాయర్ వద్ద పహారా కాసే కేటీపీఎస్, వైల్డ్‌లైఫ్ సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.