గూడెంకు గండం
♦ ‘కిన్నెరసాని’లో తగ్గుతున్న నీరు
♦ నల్లా నీటికి రోజులతరబడి ఎదురుచూపులు
♦ కొత్తగూడెం, పాల్వంచకు నీటి కష్టాలు
♦ ప్రత్యామ్నాయం చూపని అధికారులు
నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణానికి పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. రోజు కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీల వల్ల సగానికి పైగా నీరు వృథాగా పోతోంది. పైపుల ద్వారా వచ్చే మిగిలిన నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ప్రస్తుత వేసవిలో రెండు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘గూడెం’ గొంతెండుతోంది. తాగునీటి కోసం అల్లాడుతోంది. పాల్వంచ, కొత్తగూడెంకు నీరందించే కిన్నెరసాని రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీరు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బోర్లు, మినీ వాటర్‌స్కీంలు మూలకుపడటం...పైపులైన్లు, గేట్ వాల్వ్‌ల లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. నల్లా నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు తప్పటం లేదు. అధికారుల ప్రణాళిక లోపం..ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో నియోజకవర్గం నీటి కోసం అలమటిస్తోంది.
తగ్గుతున్న నీటిమట్టం
కిన్నెరసాని రిజర్వాయర్ మొత్తం నీటిమట్టం 407 అడుగులు. అది పూర్తిగా నిండితే 8.400 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 396.7 అడుగుల మేరకు నీరు ఉంది. దీనిద్వారా కేటీపీఎస్ ఏ,బీ,సీ స్టేషన్లు, 5,6 దశలకు రోజుకు 86 క్యూసెక్కుల నీరు, నవభారత్‌కు 4 క్యూసెక్కులు, ఎన్‌ఎండీసీ సిల్‌కు ఒక క్యూసెక్, కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కులు.. ఇలా మొత్తం 26.34 క్యూసెక్కుల నీరు ప్రతిరోజు సరఫరా అవుతోంది. అంతేకాక కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు రోజు 1.8 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 396.7 అడుగులు ఉన్న కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం మే నెలలోగా డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
నీళ్ల కోసం మైళ్ల దూరం
పాల్వంచ మండలం సీతారాంపురం గిరిజనులు నీళ్ల కోసం నరకయాతన పడుతున్నారు. గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి తాగునీరు అందించడానికి బోరు వేయడానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. దీంతో 2 కిలోమీటర్ల దూరంలోని కుంట వద్ద చెలిమ తీసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మరమ్మతుల్లో బోర్లు, మినీ వాటర్ స్కీంలు
కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 280 బోర్లు ఉండగా.. వీటిలో 60 వరకు మరమ్మతులో ఉన్నాయి. 33 వార్డుల్లో 19 మినీ వాటర్ స్కీంలలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి వల్ల పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరాకాలనీ, వెంగ ళరావు కాలనీ, తెలంగాణ నగర్ కాలనీ తదితర కాలనీల్లో బోర్లు వేశారు. కానీ.. వాటి నీరు చుట్టుపక్కల ఉన్న వారికే సరిపోయే పరిస్థితి ఉంది. కాలనీ మొత్తం ఒక్కబోరు వేయడంవల్ల ఏమాత్రం సరిపోయేపరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. పాల్వంచ మండలంలో 420 బోర్లు ఉండగా.. 80 మరమ్మతుకు చేరాయి. 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో 45 పనిచేస్తున్నాయి. సంగంగ ట్టు, కిన్నెరసాని, రేగులగూడెం, మల్లారంలో ఓవర్‌హెడ్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కేవలం జగన్నాథపురంలో మాత్రమే మినీ వాటర్ స్కీం ఉంది. కొత్తగూడెం మండలంలో 954 బోర్లు ఉండగా.. 69 బోర్లు పనిచేయడం లేదు. 107 డెరైక్ట్ పంపింగ్ స్కీంలు ఉన్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.
తంటాలు పడుతున్నాం
వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మే నెలలోగా మంచినీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లలో కొనుక్కోవాల్సిందే. రోజూ నీరు సరఫరా చేస్తామని చెబుతున్న అధికారులు మూడు నాలుగు రోజులకోసారి కూడా నీటిని అందించలేకపోతున్నారు. - కె.సత్య, పాల్వంచ
మరమ్మతు చేయించాలి
కిన్నెరసాని నీళ్లు నాలుగైదు రోజులకోసారి వస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన మినీ వాటర్ స్కీంలు పని చేయడంలేదు. వాటినైనా మరమ్మతు చేయిస్తే బాగుంటుంది. ఎండా కాలంలో నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. పైపులైన్ల లీకేజీలను అరికట్టాలి.
- నర్సమ్మ, కొత్తగూడెం
దాహార్తి తీర్చాలి
వేసవిలో ప్రజలు ఎదుర్కొనే మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తే బాగుండేది. కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నారు తప్ప ఆచరణలో చూపించడం లేదు. ప్రజల దాహార్తి తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. - కంటె స్వప్న, పాల్వంచ