Water troubles
-
వేసవిలోనూ తాగునీరు పుష్కలం!
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో.. కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి మధ్యలో మరోసారి అంచనా ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
గూడెంకు గండం
♦ ‘కిన్నెరసాని’లో తగ్గుతున్న నీరు ♦ నల్లా నీటికి రోజులతరబడి ఎదురుచూపులు ♦ కొత్తగూడెం, పాల్వంచకు నీటి కష్టాలు ♦ ప్రత్యామ్నాయం చూపని అధికారులు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణానికి పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. రోజు కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీల వల్ల సగానికి పైగా నీరు వృథాగా పోతోంది. పైపుల ద్వారా వచ్చే మిగిలిన నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ప్రస్తుత వేసవిలో రెండు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘గూడెం’ గొంతెండుతోంది. తాగునీటి కోసం అల్లాడుతోంది. పాల్వంచ, కొత్తగూడెంకు నీరందించే కిన్నెరసాని రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీరు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బోర్లు, మినీ వాటర్స్కీంలు మూలకుపడటం...పైపులైన్లు, గేట్ వాల్వ్‌ల లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. నల్లా నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు తప్పటం లేదు. అధికారుల ప్రణాళిక లోపం..ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో నియోజకవర్గం నీటి కోసం అలమటిస్తోంది. తగ్గుతున్న నీటిమట్టం కిన్నెరసాని రిజర్వాయర్ మొత్తం నీటిమట్టం 407 అడుగులు. అది పూర్తిగా నిండితే 8.400 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 396.7 అడుగుల మేరకు నీరు ఉంది. దీనిద్వారా కేటీపీఎస్ ఏ,బీ,సీ స్టేషన్లు, 5,6 దశలకు రోజుకు 86 క్యూసెక్కుల నీరు, నవభారత్‌కు 4 క్యూసెక్కులు, ఎన్ఎండీసీ సిల్కు ఒక క్యూసెక్, కొత్తగూడెం మున్సిపాలిటీకి 15 క్యూసెక్కులు, పాల్వంచ మున్సిపాలిటీకి 6.34 క్యూసెక్కులు.. ఇలా మొత్తం 26.34 క్యూసెక్కుల నీరు ప్రతిరోజు సరఫరా అవుతోంది. అంతేకాక కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు రోజు 1.8 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 396.7 అడుగులు ఉన్న కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం మే నెలలోగా డెడ్ స్టోరేజీకి చేరుకునే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నీళ్ల కోసం మైళ్ల దూరం పాల్వంచ మండలం సీతారాంపురం గిరిజనులు నీళ్ల కోసం నరకయాతన పడుతున్నారు. గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి తాగునీరు అందించడానికి బోరు వేయడానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. దీంతో 2 కిలోమీటర్ల దూరంలోని కుంట వద్ద చెలిమ తీసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరమ్మతుల్లో బోర్లు, మినీ వాటర్ స్కీంలు కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 280 బోర్లు ఉండగా.. వీటిలో 60 వరకు మరమ్మతులో ఉన్నాయి. 33 వార్డుల్లో 19 మినీ వాటర్ స్కీంలలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి వల్ల పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరాకాలనీ, వెంగ ళరావు కాలనీ, తెలంగాణ నగర్ కాలనీ తదితర కాలనీల్లో బోర్లు వేశారు. కానీ.. వాటి నీరు చుట్టుపక్కల ఉన్న వారికే సరిపోయే పరిస్థితి ఉంది. కాలనీ మొత్తం ఒక్కబోరు వేయడంవల్ల ఏమాత్రం సరిపోయేపరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. పాల్వంచ మండలంలో 420 బోర్లు ఉండగా.. 80 మరమ్మతుకు చేరాయి. 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో 45 పనిచేస్తున్నాయి. సంగంగ ట్టు, కిన్నెరసాని, రేగులగూడెం, మల్లారంలో ఓవర్‌హెడ్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కేవలం జగన్నాథపురంలో మాత్రమే మినీ వాటర్ స్కీం ఉంది. కొత్తగూడెం మండలంలో 954 బోర్లు ఉండగా.. 69 బోర్లు పనిచేయడం లేదు. 107 డెరైక్ట్ పంపింగ్ స్కీంలు ఉన్నాయి. దాదాపు అన్ని పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. తంటాలు పడుతున్నాం వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మే నెలలోగా మంచినీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లలో కొనుక్కోవాల్సిందే. రోజూ నీరు సరఫరా చేస్తామని చెబుతున్న అధికారులు మూడు నాలుగు రోజులకోసారి కూడా నీటిని అందించలేకపోతున్నారు. - కె.సత్య, పాల్వంచ మరమ్మతు చేయించాలి కిన్నెరసాని నీళ్లు నాలుగైదు రోజులకోసారి వస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన మినీ వాటర్ స్కీంలు పని చేయడంలేదు. వాటినైనా మరమ్మతు చేయిస్తే బాగుంటుంది. ఎండా కాలంలో నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. పైపులైన్ల లీకేజీలను అరికట్టాలి. - నర్సమ్మ, కొత్తగూడెం దాహార్తి తీర్చాలి వేసవిలో ప్రజలు ఎదుర్కొనే మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తే బాగుండేది. కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నారు తప్ప ఆచరణలో చూపించడం లేదు. ప్రజల దాహార్తి తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. - కంటె స్వప్న, పాల్వంచ -
ఐటీ కారిడార్‌కూ నీటి కష్టాలు
ఈ నెల 15 వరకు ఇదే దుస్థితి ట్యాంకర్ల నీరే శరణ్యం సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్‌కూ నీటి కష్టాలు తప్పడం లేదు. మాదాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని వందలాది సాఫ్ట్వేర్ కంపెనీల్లోని వేలాది మంది ఉద్యోగులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సింగూరు, మంజీర జలాశయాల నుంచి నగరానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతోఈ దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గోదావరి మంచినీటి పథకం మొదటి దశలో రెండు మోటార్లతో 56 ఎంజీడీలను నగరానికి తరలిస్తున్నారు. ఇందులో 28 ఎంజీడీలను కుత్బుల్లాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మరో 28 ఎంజీడీలను సనత్‌నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల కోసం లింగంపల్లి రిజర్వాయర్‌కు తరలించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్దరణకు మరో 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గోదావరి జలాలను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్-2 పైప్‌లైన్‌కు సంబంధించి 400 మీటర్ల మార్గంలో పనులు పూర్తి కావాల్సి ఉంది. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలో నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు గోదావరి పథకంలో మూడో మోటారును ప్రారంభించి నగరానికి 86 ఎంజీడీలను సరఫరా చేస్తామన్నారు. ట్యాంకర్ నీళ్లకు సుదీర్ఘ నిరీక్షణ కూకట్పల్లి భాగ్యనగర్ సెక్షన్-3 పరిధిలో గురువారం (డిసెంబరు 3న) ట్యాంకర్ బుక్ చేస్తే టోకెన్ నెం.637 కేటాయించారు. రోజుకు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి 70 ట్రిప్పుల ట్యాంకర్లను సరఫరా చేస్తున్నామని... మీకు ట్రిప్పు డెలివరీ ఈనెల 12న జరుగుతుందని సంక్షిప్త సందేశం అందింది. భరత్‌నగర్ ఫిల్లింగ్ కేంద్రంలో ఈనెల 2న ట్యాంకర్ బుక్ చేస్తే టోకెన్ నెంబరు 744 కేటాయించారు. రోజువారీగా ఈ ఫిల్లింగ్ కేంద్రం నుంచి 27 ట్యాంకర్లు మాత్రమే సరఫరా చేస్తున్నామని... ఈ నెల 29 వరకు మీకు ట్యాంకర్ రాదని సంక్షిప్త సందేశం అందింది. ఇదీ నగరంలో ట్యాంకర్ నీళ్ల సరఫరా పరిస్థితి. జలమండలికి ఉన్న 65 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నుంచి 674 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. ఫిల్లింగ్ కేంద్రాల్లో సైతం నిల్వలు లేకపోవడంతో పలువురికి పది, ఇరవై రోజులకోమారు మాత్రమే ట్యాంకర్ నీళ్లు అందుతున్నాయి. దీంతో చేసేది లేక ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు (ఐదువేల లీటర్ల నీరు) రూ.1500 నుంచి 2 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. -
జల గ్రహణం
శివారుల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు {పైవేటు ట్యాంకర్లే గతి అపార్ట్మెంట్లలో పెరుగుతున్న నిర్వహణ వ్యయం నల్లాల వద్ద భారీ క్యూలు. బోర్ల వద్ద జన సమూహాలు. ట్యాంకర్ల చెంత బిందెలతో యుద్ధాలు. గంటల తరబడి ఎదురు చూపులు... ఎక్కడికక్కడ వెక్కిరిస్తున్న బావులు...అడుగంటిన భూగర్భ జలాలు... ఇవీ నగర శివారుల్లో నీటి కష్టాలకు నిదర్శనాలు. వేసవి ఛాయలు పూర్తిగా కనిపించకముందే నగరంలో ప్ర‘జల’ఘోష మొదలైంది. భవిష్యత్తుపై బెంగను పెంచుతోంది. సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో వేసవికి ముందే బోరు బావులు బావురుమంటున్నాయి. మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 800కు పైగా కాలనీలు, బస్తీల్లో ఫిబ్రవరి మొదటిలోనేప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుమారు 30 లక్షల మందికి నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. వేలాది నివాసాలు, అపార్ట్మెంట్ల వాసులు నీటి ముప్పును తలచుకొని తల్లడిల్లుతున్నారు. జలమండలికి మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, ఇంకుడు గుంతలు లేక బోరుబావులు వట్టిపోవడంతో నిత్యం ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడక తప్పని దుస్థితి నెలకొంది. అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు ఒక్కొక్కరు రోజు వారీ వినియోగం, ప్రాంతాన్ని బట్టి నీటి కోసం నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా ఖర్చు చేయక తప్పని దుస్థితి నెలకొంది. ప్రగతి నగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, యాప్రాల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఎల్బీనగర్, బండ్లగూడ, గాజులరామారం..అన్నిచోట్లా ఇదే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుండడం గమనార్హం. మరోవైపు బస్తీల్లో ట్యాంకర్ల వద్ద అప్పుడే మహిళల ‘పానీ పట్టు’ యుద్ధాలు మొదలయ్యాయి. జనం అవస్థలకు నిదర్శనాలివీ ఉప్పల్‌లో: సర్కిల్లోని మూడు డివిజన్లలో 2014 జనవరిలో సగటున 8.20 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం కాగా... 2015 జనవరి లో 12.45 లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. రామంతాపూర్‌లోని వెంకట్‌రెడ్డి నగర్, రాంరెడ్డి నగర్, వివేక్‌నగర్, శ్రీనివాసపురం, గోఖలే నగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్, ప్రగతి నగర్, సాయిచిత్రా నగర్ తదితర బస్తీలు... కాలనీల్లో 1500-2000 అడుగుల వరకు బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. ఇటీవల నెహ్రూ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు 1500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించకపోవడం గమనార్హం. స్థానిక అపార్ట్మెంట్లలో ఉంటున్న ప్రతి కుటుంబం నెలకు నీటి కోసం రూ.2000-రూ.3000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. హైటెక్ నగరిలో: మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటాయి. ఈ ప్రాంతాల్లో 1500 అడుగుల లోతుకు బోరు వేసినానీరు రావడం లేదు. కొండాపూర్, శ్రీరాంనగర్ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాలలోని అపార్ట్మెంట్లలో ఒక్కో ఫ్లాట్ యజమాని నెలకు రూ.2500 చొప్పున నీటి కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ నిత్యం 35 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ (5000 లీటర్లు)కు రూ.650 వంతున చెల్లిస్తున్నారు. వేసవి కాలం వస్తే ట్యాంకర్‌కు రూ.వెయ్యికిపైగా చెల్లించాల్సి వస్తుంది. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు అద్దె రూ.9,000 కాగా నిర్వహణ ఖర్చు అందులో 25 శాతం కావడం గమనార్హం. నిజాంపేట్‌లో: బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిజాంపేట్‌లో ఎక్కడ చూసినా దాహార్తితో జనం అల్లాడుతున్నారు. ఫ్లాట్లలో నివసిస్తున్నవారు ఇంటి అద్దె రూ.6 వేలు, నీటి కోసం మరో రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరనీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి స్థానిక హైస్కూల్ పక్కనే వాటర్ ట్యాంక్ నిర్మించారు. నీరు మాత్రం స్థానికుల అవసరాలకు సరిపడే స్థాయిలో అందడం లేదు. దీంతో చాలా భవన సముదాయాలు బోర్లపై ఆధార పడుతున్నాయి. ప్రస్తుతం ఆ బోర్లు కూడా నీరిచ్చే స్థితిలో లేవు. దాదాపు రెండు వేల అడుగుల లోతుకు వెళ్లినానీటి జాడ దొరకడం లేదు. పంచాయతీ పరిధిలో దాదాపు 50వేల మంది కష్టాలు పడుతున్నారు. దీంతో భవన యజమానులు, అపార్టుమెంట్ అసోసియేషన్లు, ప్లాట్ల యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1400కు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ పంచాయతీలోనూ ఇదే దుస్థితి. 15 ఫ్లాట్లు ఉండేఅపార్ట్మెంట్కు నిత్యం ఐదు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. -
‘కట్’కట
నిశీధి వీధులు.. నీటి కష్టాలు - విద్యుత్ నిలిపివేతతో జనం అవస్థలు - మూలన పడిన తాగునీటి పథకాలు - అల్లాడుతున్న ‘ముంపు’ వాసులు - పట్టించుకోని ఆంధ్ర, తెలంగాణ అధికారులు వేలేరుపాడు: బకాయిల పేరుతో జిల్లాలోని పలు పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. తాగునీటి పథకాలకు కూడా కరెంట్ సరఫరా చేయకపోవడంతో జనం అల్లాడుతున్నారు. పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చేతిపంపులు వద్ద జనం బారులు తీరుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతవాసులు నది నుంచి నీరు తెచ్చుకొని ఆ కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. పోలవరం ముంపు మండలాల్లో ఒకటైన వేలేరుపాడులో తొమ్మిది పంచాయతీలు బకాయిలు చెల్లించలేదని ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంచినీటి పథకాలు, వీధి దీపాల కనెక్షన్లు శుక్రవారం నాడే తొలగించారు. మూడురోజులుగా ఆయా గ్రామాల్లో చీకట్లు ఆవరించాయి. మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. బావులు, మంచినీటి బోర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. మండలంలో 100 సర్వీసుల్లో సుమారు ఏడు లక్షల బకాయిలున్నాయి. వీటిలో 28 మంచినీటి పథకాలు బకాయిపడటంతో వాటి కనెక్షన్లు తొలగించారు. తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, వేలేరుపాడు, జగన్నాథపురం, ఎర్రబోరు, తిర్లాపురం, కన్నాయిగుట్ట, భూదేవిపేట, రుద్రమకోట, పడమటిమెట్ట, తూర్పుమెట్ట, చిగురుమామిడి, కొయిదా, కట్కూరు, కాచారం మరో 13 గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. గోదావరి పరీవాహక గ్రామాల వాసులు నది నుంచి నీరు తెచ్చుకొని.. ఆ కలుషిత నీటినే తాగుతున్నారు. అనేక గ్రామాల్లో చేతిపంపులు కూడా పనిచేయకపోవడంతో బావులను ఆశ్రయిస్తున్నారు. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలైన తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల కనెక్షన్లను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం కార్యాలయాలకు సరఫరాను పునరుద్ధరించారు. మంచినీటి పథకాలు, వీధిదీపాల సర్వీసులను మాత్రం నిలిపే ఉంచారు. మండలం ఆంధ్రాలో విలీనం అయినప్పటికీ తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. సరఫరాను కూడా తెలంగాణ అధికారులే తొలగించారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యను పట్టించుకోవాల్సింది తెలంగాణ ఉన్నతాధికారులా? ఆంధ్రా అధికారులా? అనే సందిగ్ధంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
పరిశ్రమలకు ‘ఏలేరు’ ప్రవాహం
=100 క్యూసెక్కుల నీరు విడుదల =కేబీఆర్ ద్వారా పరిశ్రమలకు తరలింపు =రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నగరానికి =రూ.4కోట్ల ఖర్చుతో పూర్తయిన పనులు సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమలకు నీటి కష్టాలు తీరాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీరు ఇటీవల ఏర్పడిన తుపాన్ల కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పలుచోట్ల గండ్లు పడడంతో జీవీఎంసీ అధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఆక్టోబర్‌లో ఏర్పడిన తుపాన్ల ప్రభావంతో రెండునెలల పాటు నగరానికి నీటి సరఫరా ఆగిపోయింది. కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ ఎస్ఈ వై.మరియన్న ఇతర ఇంజినీర్లు పనుల్ని తరచూ పరిశీలించారు. డిసెంబర్ 26 నాటికే మరమ్మతుల అనంతరం నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినా పలుచోట్ల పూడికలు పూర్తిస్థాయిలో తీయలేకపోవడం, కొండ చరియలు విరిగిపడడంతో జనవరి 1 నాటికి వాయిదా వేశారు. ఎట్టకేలకు శనివారం ఏలేరు రిజర్వాయరు నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం మరో 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 100 క్యూసెక్కుల నీటిని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు పంపింగ్ చేశారు. ఏలేరు నీటిని ప్రస్తుతం పరిశ్రమల అవసరాల దృష్ట్యా కేబీఆర్‌కు పంపించామ ని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మిగతా నీరు (మిగిలిన 100 క్యూసెక్కులు) వస్తుందని అధికారులు చెబుతున్నారు. డీఈ మత్స్యరాజు, ఈఈ ప్రవీణ్‌కుమార్ నీటి విడుదలకు ఆధ్వర్యం వహించారు. పరిశ్రమల కొరత తీర్చేందుకే.. నీళ్లు లేక పరిశ్రమలు విలవిల్లాడడంతో వాటికే ప్రా దాన్యం ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. నగరవాసులకూ ఇబ్బందులున్నప్పటికీ ముడసర్లోవ, మేఘాద్రిగెడ్డ (ఎంజీఆర్) వంటి రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేసుకునే అవకాశం ఉంది. గండ్లుపూడ్చివేత, పూడిక తీసివేతకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.4కోట్లు ఖర్చుచేశారు. భవిష్యత్తులో మరో రూ.2కోట్ల పనులున్నాయి.