=100 క్యూసెక్కుల నీరు విడుదల
=కేబీఆర్ ద్వారా పరిశ్రమలకు తరలింపు
=రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నగరానికి
=రూ.4కోట్ల ఖర్చుతో పూర్తయిన పనులు
సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమలకు నీటి కష్టాలు తీరాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీరు ఇటీవల ఏర్పడిన తుపాన్ల కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పలుచోట్ల గండ్లు పడడంతో జీవీఎంసీ అధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఆక్టోబర్‌లో ఏర్పడిన తుపాన్ల ప్రభావంతో రెండునెలల పాటు నగరానికి నీటి సరఫరా ఆగిపోయింది. కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ ఎస్‌ఈ వై.మరియన్న ఇతర ఇంజినీర్లు పనుల్ని తరచూ పరిశీలించారు.
డిసెంబర్ 26 నాటికే మరమ్మతుల అనంతరం నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినా పలుచోట్ల పూడికలు పూర్తిస్థాయిలో తీయలేకపోవడం, కొండ చరియలు విరిగిపడడంతో జనవరి 1 నాటికి వాయిదా వేశారు. ఎట్టకేలకు శనివారం ఏలేరు రిజర్వాయరు నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం మరో 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 100 క్యూసెక్కుల నీటిని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు పంపింగ్ చేశారు. ఏలేరు నీటిని ప్రస్తుతం పరిశ్రమల అవసరాల దృష్ట్యా కేబీఆర్‌కు పంపించామ ని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మిగతా నీరు (మిగిలిన 100 క్యూసెక్కులు) వస్తుందని అధికారులు చెబుతున్నారు. డీఈ మత్స్యరాజు, ఈఈ ప్రవీణ్‌కుమార్ నీటి విడుదలకు ఆధ్వర్యం వహించారు.
పరిశ్రమల కొరత తీర్చేందుకే..
నీళ్లు లేక పరిశ్రమలు విలవిల్లాడడంతో వాటికే ప్రా దాన్యం ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.
నగరవాసులకూ ఇబ్బందులున్నప్పటికీ ముడసర్లోవ, మేఘాద్రిగెడ్డ (ఎంజీఆర్) వంటి రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేసుకునే అవకాశం ఉంది.
గండ్లుపూడ్చివేత, పూడిక తీసివేతకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.4కోట్లు ఖర్చుచేశారు. భవిష్యత్తులో మరో రూ.2కోట్ల పనులున్నాయి.
పరిశ్రమలకు ‘ఏలేరు’ ప్రవాహం
Published Mon, Jan 6 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement