ఐటీ కారిడార్‌కూ నీటి కష్టాలు | water troubles in IT karidar | Sakshi
Sakshi News home page

ఐటీ కారిడార్‌కూ నీటి కష్టాలు

Published Fri, Dec 4 2015 1:47 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

water troubles in  IT karidar

ఈ నెల 15 వరకు ఇదే దుస్థితి  ట్యాంకర్ల నీరే శరణ్యం
 సాక్షి, హైదరాబాద్:
ఐటీ కారిడార్‌కూ నీటి కష్టాలు తప్పడం లేదు. మాదాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని వేలాది మంది ఉద్యోగులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సింగూరు, మంజీర జలాశయాల నుంచి నగరానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతోఈ దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం గోదావరి మంచినీటి పథకం మొదటి దశలో  రెండు మోటార్లతో 56 ఎంజీడీలను నగరానికి తరలిస్తున్నారు. ఇందులో 28 ఎంజీడీలను కుత్బుల్లాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మరో 28 ఎంజీడీలను సనత్‌నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల కోసం లింగంపల్లి రిజర్వాయర్‌కు తరలించనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్దరణకు మరో 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గోదావరి జలాలను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్-2 పైప్‌లైన్‌కు సంబంధించి 400 మీటర్ల మార్గంలో పనులు పూర్తి కావాల్సి ఉంది. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలో నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు గోదావరి పథకంలో మూడో మోటారును ప్రారంభించి నగరానికి 86 ఎంజీడీలను సరఫరా చేస్తామన్నారు.

 ట్యాంకర్ నీళ్లకు సుదీర్ఘ నిరీక్షణ
 కూకట్‌పల్లి భాగ్యనగర్ సెక్షన్-3 పరిధిలో గురువారం (డిసెంబరు 3న) ట్యాంకర్ బుక్ చేస్తే టోకెన్ నెం.637 కేటాయించారు. రోజుకు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి 70 ట్రిప్పుల ట్యాంకర్లను సరఫరా చేస్తున్నామని... మీకు ట్రిప్పు డెలివరీ ఈనెల 12న జరుగుతుందని సంక్షిప్త సందేశం అందింది.

 భరత్‌నగర్ ఫిల్లింగ్ కేంద్రంలో ఈనెల 2న ట్యాంకర్ బుక్ చేస్తే టోకెన్ నెంబరు 744 కేటాయించారు. రోజువారీగా ఈ ఫిల్లింగ్ కేంద్రం నుంచి 27 ట్యాంకర్లు మాత్రమే సరఫరా చేస్తున్నామని... ఈ నెల 29 వరకు మీకు ట్యాంకర్ రాదని సంక్షిప్త సందేశం అందింది. ఇదీ నగరంలో ట్యాంకర్ నీళ్ల సరఫరా పరిస్థితి. జలమండలికి ఉన్న 65 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నుంచి 674 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. ఫిల్లింగ్ కేంద్రాల్లో సైతం నిల్వలు లేకపోవడంతో పలువురికి పది, ఇరవై రోజులకోమారు మాత్రమే ట్యాంకర్ నీళ్లు అందుతున్నాయి. దీంతో చేసేది లేక ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు (ఐదువేల లీటర్ల నీరు) రూ.1500 నుంచి 2 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement