
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు
తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.
ఇన్ఫోసిస్ ప్రతి దావా
ఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment