‘కట్’కట
నిశీధి వీధులు.. నీటి కష్టాలు
- విద్యుత్ నిలిపివేతతో జనం అవస్థలు
- మూలన పడిన తాగునీటి పథకాలు
- అల్లాడుతున్న ‘ముంపు’ వాసులు
- పట్టించుకోని ఆంధ్ర, తెలంగాణ అధికారులు
వేలేరుపాడు: బకాయిల పేరుతో జిల్లాలోని పలు పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. తాగునీటి పథకాలకు కూడా కరెంట్ సరఫరా చేయకపోవడంతో జనం అల్లాడుతున్నారు. పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చేతిపంపులు వద్ద జనం బారులు తీరుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతవాసులు నది నుంచి నీరు తెచ్చుకొని ఆ కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది.
పోలవరం ముంపు మండలాల్లో ఒకటైన వేలేరుపాడులో తొమ్మిది పంచాయతీలు బకాయిలు చెల్లించలేదని ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంచినీటి పథకాలు, వీధి దీపాల కనెక్షన్‌లు శుక్రవారం నాడే తొలగించారు. మూడురోజులుగా ఆయా గ్రామాల్లో చీకట్లు ఆవరించాయి. మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. బావులు, మంచినీటి బోర్ల వద్ద జనం బారులు తీరుతున్నారు. మండలంలో 100 సర్వీసుల్లో సుమారు ఏడు లక్షల బకాయిలున్నాయి. వీటిలో 28 మంచినీటి పథకాలు బకాయిపడటంతో వాటి కనెక్షన్‌లు తొలగించారు. తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, వేలేరుపాడు, జగన్నాథపురం, ఎర్రబోరు, తిర్లాపురం, కన్నాయిగుట్ట, భూదేవిపేట, రుద్రమకోట, పడమటిమెట్ట, తూర్పుమెట్ట, చిగురుమామిడి, కొయిదా, కట్కూరు, కాచారం మరో 13 గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలనపడ్డాయి.
గోదావరి పరీవాహక గ్రామాల వాసులు నది నుంచి నీరు తెచ్చుకొని.. ఆ కలుషిత నీటినే తాగుతున్నారు. అనేక గ్రామాల్లో చేతిపంపులు కూడా పనిచేయకపోవడంతో బావులను ఆశ్రయిస్తున్నారు. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలైన తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల కనెక్షన్‌లను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం కార్యాలయాలకు సరఫరాను పునరుద్ధరించారు. మంచినీటి పథకాలు, వీధిదీపాల సర్వీసులను మాత్రం నిలిపే ఉంచారు. మండలం ఆంధ్రాలో విలీనం అయినప్పటికీ తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. సరఫరాను కూడా తెలంగాణ అధికారులే తొలగించారు. ఈ పరిస్థితుల్లో తమ సమస్యను పట్టించుకోవాల్సింది తెలంగాణ ఉన్నతాధికారులా? ఆంధ్రా అధికారులా? అనే సందిగ్ధంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.