
పశువుల కాపర్లను చంపేసిన మొసళ్లు
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు పశువుల కాపర్లను మొసళ్లు చంపేశాయి. పుల్కల్ మండలం గొగులూరు గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు మంజీరా పరివాహక ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లారు. వాళ్లలో శివకుమార్ అనే వ్యక్తి.. కాళ్లు కడుక్కోడానికి నీళ్లలోకి దిగగా, వెంటనే మొసళ్లు అతడిపై దాడిచేసి, లోపలకు లాక్కెళ్లిపోయాయి.
శివకుమార్‌ను రక్షించేందుకు రామస్వామి అనే మరో కాపరి చిన్న తెప్పతో లోనికి వెళ్లి.. గాలించడం మొదలుపెట్టాడు. అయితే కాసేపటికి అతడిపై కూడా మొసలి దాడిచేసి లాక్కెళ్లిపోయింది. ఇప్పటివరకు మొసళ్లు ఈ ప్రాంతంలో పశువుల మీద దాడి చేసిన ఘటనలు ఉన్నాయి గానీ, మనుషులను ఏమీ చేయలేదు. తొలిసారి మనుషుల మీదే దాడిచేసి చంపేయడం ఇక్కడ కలకలం సృష్టించింది. ఇంకా ఆ మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి కూడా కనిపించడం లేదు.