
మంత్రాలకు చింతకాయలు రాలుతాయట!
వినడానికి వింతగా అనిపించొచ్చు.. కానీ ఇది నిజంగానే జరిగిందట. మంత్రాలకు చింతకాయల సంగతి అటుంచండి..
వినడానికి వింతగా అనిపించొచ్చు.. కానీ ఇది నిజంగానే జరిగిందట. మంత్రాలకు చింతకాయల సంగతి అటుంచండి.. అంతకన్నా ఎక్కువే జరిగిందని ఇండోనేసియాలోని బెరా వాసులు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మంగళవారం సైరిఫుద్దీన్(41) అనే వ్యక్తి లెంపేక్ నదిలో స్నానానికి దిగాడు. ఇక్కడి వాసులకు ఓ నమ్మకం ఉంది. ఈ నదిలో ఎవరూ నగ్నంగా స్నానం చేయరు. అలా చేస్తే.. ఇందులోని మొసళ్లు దాడి చేసి చంపేస్తాయని వారు చెబుతారు. ఆ రోజు సైరిఫుద్దీన్ నగ్నంగా నదిలోకి దిగాడు. అంతే.. అనూహ్యంగా ఓ మొసలి అతడిపై దాడి చేసి.. నదిలోకి లాక్కెళ్లిపోయింది.
అక్కడున్న సైరిఫుద్దీన్ స్నేహితులు, గ్రామస్తులు ఎంత గాలించినా.. అతడి మృతదేహం దొరకలేదు. చివరికి పోలీసులూ రంగంలోకి దిగారు. వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆఖరి ప్రయత్నంగా గ్రామస్తులు స్థానిక మంత్రగాడిని ఆశ్రయించారు. అతడు మొసళ్లను మంత్రించడంలో స్పెషలిస్టట. బుధవారం ఉదయం అతడు ఓ మంత్రం చదవడం.. ఆశ్చర్యకరంగా కొంతసేపటికి ఓ మూడు మొసళ్లు.. సైరిఫుద్దీన్ మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడం జరిగిపోయాయి.
అవి వాటిని మిగతావాటి దాడి నుంచి రక్షిస్తూ.. తెస్తున్నట్లు కనిపించిందని స్థానిక పోలీసు అధికారి ఫైసల్ హమీద్ తెలిపారు. ఇది తనకు చాలా విచిత్రంగా కనిపించిందన్నారు. ఏదైతేనేం.. బాడీ దొరికింది.. కేసు క్లోజ్ అంటూ ఆయన వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామస్తులంతా సైరిఫుద్దీన్‌ను చంపిన మొసలిని వెతికే పనిలో ఉన్నారట.