white tiger
-
హ్యాపీ బర్త్‌డే పీచెస్
విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్‌లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్ నందనీ సలారియా కేకు కట్ చేసి సందర్శకులకు పంచిపెట్టారు. సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
సందడి ముగిసింది.. తెల్లపులి కుమారి ఇకలేదు..
సాక్షి, విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులి కుమారి(19) సందడి ఇక ముగిసింది. వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా కుమారి సోమవారం మృతి చెందింది. విశాఖ జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలు పాటు సందర్శకులను అలరించడంతో పాటు తన సంతతిని ఉత్పత్తి చేసింది. ఎన్‌క్లోజరులో హుషారుగా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ, పరుగెత్తుతూ సందర్శకులకు కనువిందు చేసేది. ఇప్పుడు ఆ కుమారి దూరం కావడంతో జూ అధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. 2007 కంటే ముందు ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులులు ఉండేవి కాదు. దీంతో అప్పటి జూ అధికారులు హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్ల పులి(జత తెల్ల పులులు)ని 2007లో ఇక్కడకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి హుషారుగా ఎన్‌క్లోజర్‌లో తిరుగుతూ మూడు సార్లు గర్భం దాల్చింది. మొత్తం 9 కూనలకు(పిల్లలు) జన్మనిచ్చి జూలో వాటి సంతతిని పెంచింది. వాటిలోనే కొన్నింటిని జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఇక్కడ అధికారులు ఇతర జూ పార్కులకు తరలించి అక్కడ నుంచి కొన్ని జంతువులకు విశాఖ జూకి తీసుకొచ్చారు. కాన్పూర్ జూకి రెండు తెల్ల పులులను ఇచ్చి అక్కడ నుంచి ఒక మగ ఖడ్గ మృగాన్ని ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతర జూ పార్కులకు తరలించగా, కుమారి మృతి అనంతరం ప్రస్తుతం జూలో ఐదు తెల్ల పులులున్నట్లు ఇన్చార్జి క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమారి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: మోచా తుపాను మనకు లేనట్టే! -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
రాహుల్ గాంధీ పేరున ‘అర్జున’ దత్తత
బెంగళూరు: జూన్ 19 న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 51 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద కార్యకర్తలు అర్జునను దత్తత తీసుకున్నారు. ఇంతకు ఎవరీ అర్జున అనుకుంటున్నారా.. తెల్ల పులి. కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం హంపిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్క్‌లో ఉన్న అర్జున అనే తెల్లపులిని ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. బల్లారి, విజయనగర గ్రామీణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సిద్దూ హల్లెగౌడ, అతని స్నేహితులు జూన్ 19 న దత్తత తీసుకోవడానికి కర్ణాటక జూ అథారిటీకి రూ .1 లక్ష మొత్తాన్ని చెల్లించారు. ఈ సందర్భంగా హల్లెగౌడ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాము. అందులో భాగంగానే నిధుల కొరత ఎదుర్కొంటున్న జూకు సాయం చేసినట్లు ఉంటుందని భావించి.. మా నాయకుడి పేరు మీద ఇలా పులిని దత్తత తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపాడు. దత్తత ప్రక్రియ సాధారణంగా ఆన్లైన్లో జరుగుతుందని త్వరలోనే ధ్రువీకరణ పత్రం అందజేస్తామని జూ అధికారులు తెలిపారు. ఇటీవల, కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా, జూలను నిర్వహించడానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ.. జంతువులను దత్తత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నటుడు విజ్ఞప్తి తరువాత గత కొన్ని వారాలుగా వ్యక్తులు, సంస్థల నుంచి 1 కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చినట్లు జూ అధికారులు తెలిపారు. చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని! -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి
సాక్షి, బెంగళూరు: చెన్నై వండలూరు జూలోని తెల్లపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలను ప్రత్యేక బోనులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారు. కాగా ఓ పిల్లపై తల్లి పంజా తగలడంతో గాయమైంది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. మిగిలిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ సిబ్బంది తెలిపారు. -
హీరో నుంచి హీరో వస్తాడు
దిలీప్ కుమార్‌ను చూసి సినిమా హీరో అవుదామనుకుని హీరోలు అయినవారు ధర్మేంద్ర, మనోజ్ కుమార్. తెలుగులో చిరంజీవిని చూసి హీరో అవుదామనుకుని అయిన శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ షారూక్ ఖాన్‌ను చూసి తాను హీరోనయ్యానని చెప్పుకున్నాడు. రాజ్ కుమార్ రావు ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌పై డ్రిల్ టీచర్ పాత్రలో ‘ఛలాంగ్’ సినిమాతో ముందుకు వచ్చాడు. కాని ఆ సినిమా అనుకున్నంత రెస్పాన్స్ పొందలేదు. దీని తర్వాత అతను నటించిన ‘వైట్ టైగర్’ విడుదలైంది. అరవింద్ అడిగ నవల ‘వైట్ టైగర్’ ఆధారంగా అమెరికా ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్‌లో తీసిన ఈ సినిమాను హిందీలో డబ్ చేసి జనవరి 13న థియేటర్లలో విడుదల చేశారు. గతంలో వచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో ఉండే కొన్ని నెగెటివ్ అంశాలకు ‘వైట్ టైగర్’ సరైన సమాధానం చెప్పిందన్న ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రాజ్‌కుమార్ రావు గుర్గావ్ నుంచి వచ్చిన నటుడు. ‘నేను షారూక్ ఖాన్ సినిమాలను చూసే నటుడవుదామనుకున్నాను. ఆయన సినిమా రంగంలో పని చేస్తుండగా ఆయనతో పాటు నేను కూడా పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీ దగ్గర కష్టపడే స్వభావం ఉంటే సక్సెస్ కావచ్చన్న దానికి షారూక్ జీవితమే ఉదాహరణ. నేను కూడా ఆయనలాగే కష్టపడ్డాను’ అని చెప్పాడు రాజ్‌కుమార్ రావ్. ‘స్త్రీ’ తర్వాత రాజ్‌కుమార్ రావ్‌కు గట్టి హిట్ తగల్లేదు. ప్రస్తుతం అతను ‘బధాయీ దో’ సినిమాలో నటిస్తున్నాడు. -
అనారోగ్యంతో పెద్ద పులి మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం వినయ్ (21) అనే పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందింది. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్న పెద్దపులి మంగళవారం ఉదయం మృతి చెందింది. గత కొంతకాలంగా సమ్మర్ హౌజ్‌లోని ఇన్టెన్సివ్ కేర్‌లో పశు వైద్య నిపుణులు డాక్టర్ ఎం.నవీన్ కుమార్ బృందం దానికి చికిత్స అందజేస్తోంది. డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ డాక్టర్ సదానంద్ తదితరులు పోస్టుమార్టం నిర్వహించారు. నమునాలను సేకరించి శాంతినగర్‌లోని వీబీఆర్‌ఐకు పంపినట్లు వారు తెలిపారు. -
'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం!
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శన శాలలో ఓ విద్యార్ధిని పొట్టన పెట్టుకున్న తెల్ల పులి ప్రతి రోజు సుమారు 12 కేజీల మాంసం తింటుందని జూ అధికారులు వెల్లడించారు. తెల్లపులి పేరు విజయ్ అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. 2007లో లక్ష్మణ్, యమున అనే పులి దంపతులకు జన్మించిన విజయ్ బరువు 200 కిలో గ్రాములు ఉందని ఓ ప్రశ్నకు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన ఎన్ క్లోజర్ లోకి దూకిన ఓ 20 ఏళ్ల వ్యక్తి విజయ్ చేతిలో ప్రాణాలు వదిలాడు. ఈ ఎన్ క్లోజర్ లో మరో రెండు పులులు కూడా ఉన్నాయని తెలిపారు. -
నల్ల కూనకు జన్మనిచ్చిన 'స్నేహ'
భువనేశ్వర్ : దేశంలోని తొలిసారిగా ఒక తెల్లరంగు ఆడపులి ....ఓ నల్లరంగు కూనకు జన్మనిచ్చింది. భువనేశ్వర్‌లోని నందన్కనన్ బయోలాజికల్ పార్క్‌లో ఓ ఆడపుల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒక నల్లజాతి పులికూన ఉందని ఒడిశా అటవీశాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎస్ శ్రీవాస్తవ్ తెలిపారు. ప్రస్తుతం సిమిలిపాల్ టైగర్ రిజర్వులో నల్లరంగు పులులు ఉన్నాయి. అయితే జూపార్కు ఆధీనంలో ఉన్న ఓ పుల్లి నల్లరంగు కూనకు జన్మ ఇవ్వడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి స్నేహ అనే ఆడపుల్లి, తన సహచరుడు మనీష్ అనే మగపులి ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక నల్ల కూనతోపాటు ఒక తెల్లరంగు కూన, ఒక రాయల్ బెంగాల్ పులికూన, తక్కువస్థాయిలో నల్లరంగు ఉన్న కూన ఉన్నాయి. పుట్టిన నాలుగు పులిపిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. స్నేహకు ఇదే తొలి కానుపు. కాగా పులుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో పులి పిల్లల సంరక్షణ కోసం జూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2011 నవంబర్‌లో నాలుగు పులి కూనలు పుట్టిన రెండు రోజుల తర్వాత చనిపోయాయి. జూ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూనలు చనిపోయాయని ఆరోపణలు వచ్చాయి. 1966 నుంచి ఇప్పటి వరకూ ఈ జూలో11 తొలికాన్పులు జరిగాయి. అయితే వాటిలో చాలావరకూ పుట్టిన రెండు వారాల్లోపే మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం ఈ జూలో మొత్తం 20 పులులు ఉన్నాయి. ఇక సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా స్నేహ... పురుడు పోసుకోవడంతో పార్కులో ఆంనదోత్సాహాలు వెల్లివిరిశాయి.