బెంగళూరు: జూన్ 19 న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 51 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద కార్యకర్తలు అర్జునను దత్తత తీసుకున్నారు. ఇంతకు ఎవరీ అర్జున అనుకుంటున్నారా.. తెల్ల పులి. కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం హంపిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్క్‌లో ఉన్న అర్జున అనే తెల్లపులిని ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. బల్లారి, విజయనగర గ్రామీణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సిద్దూ హల్లెగౌడ, అతని స్నేహితులు జూన్ 19 న దత్తత తీసుకోవడానికి కర్ణాటక జూ అథారిటీకి రూ .1 లక్ష మొత్తాన్ని చెల్లించారు.
ఈ సందర్భంగా హల్లెగౌడ మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాము. అందులో భాగంగానే నిధుల కొరత ఎదుర్కొంటున్న జూకు సాయం చేసినట్లు ఉంటుందని భావించి.. మా నాయకుడి పేరు మీద ఇలా పులిని దత్తత తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపాడు. దత్తత ప్రక్రియ సాధారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతుందని త్వరలోనే ధ్రువీకరణ పత్రం అందజేస్తామని జూ అధికారులు తెలిపారు.
ఇటీవల, కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా, జూలను నిర్వహించడానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ.. జంతువులను దత్తత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నటుడు విజ్ఞప్తి తరువాత గత కొన్ని వారాలుగా వ్యక్తులు, సంస్థల నుంచి 1 కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చినట్లు జూ అధికారులు తెలిపారు.
చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!
Comments
Please login to add a commentAdd a comment