నల్ల కూనకు జన్మనిచ్చిన 'స్నేహ'
భువనేశ్వర్ : దేశంలోని తొలిసారిగా ఒక తెల్లరంగు ఆడపులి ....ఓ నల్లరంగు కూనకు జన్మనిచ్చింది. భువనేశ్వర్‌లోని నందన్‌కనన్ బయోలాజికల్ పార్క్‌లో ఓ ఆడపుల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒక నల్లజాతి పులికూన ఉందని ఒడిశా అటవీశాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌ఎస్ శ్రీవాస్తవ్ తెలిపారు. ప్రస్తుతం సిమిలిపాల్ టైగర్ రిజర్వులో నల్లరంగు పులులు ఉన్నాయి.
అయితే జూపార్కు ఆధీనంలో ఉన్న ఓ పుల్లి నల్లరంగు కూనకు జన్మ ఇవ్వడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి స్నేహ అనే ఆడపుల్లి, తన సహచరుడు మనీష్ అనే మగపులి ద్వారా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక నల్ల కూనతోపాటు ఒక తెల్లరంగు కూన, ఒక రాయల్ బెంగాల్ పులికూన, తక్కువస్థాయిలో నల్లరంగు ఉన్న కూన ఉన్నాయి. పుట్టిన నాలుగు పులిపిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. స్నేహకు ఇదే తొలి కానుపు.
కాగా పులుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో పులి పిల్లల సంరక్షణ కోసం జూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2011 నవంబర్లో నాలుగు పులి కూనలు పుట్టిన రెండు రోజుల తర్వాత చనిపోయాయి. జూ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూనలు చనిపోయాయని ఆరోపణలు వచ్చాయి. 1966 నుంచి ఇప్పటి వరకూ ఈ జూలో11 తొలికాన్పులు జరిగాయి. అయితే వాటిలో చాలావరకూ పుట్టిన రెండు వారాల్లోపే మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం ఈ జూలో మొత్తం 20 పులులు ఉన్నాయి. ఇక సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా స్నేహ... పురుడు పోసుకోవడంతో పార్కులో ఆంనదోత్సాహాలు వెల్లివిరిశాయి.