International Tiger Day 2021: Special Story About International Tiger Day in Telugu - Sakshi
Sakshi News home page

World Tiger Day: పులిరాజాకి పలుకొస్తే?! వినుకోరా సాంబా..

Published Thu, Jul 29 2021 8:41 AM | Last Updated on Thu, Jul 29 2021 7:13 PM

International Tiger Day Special Story And Global Tiger Day Story In Telugu - Sakshi

పులుల దినోత్సవం సందర్భంగా బాస్‌ ఆదేశాలతో పెద్దపులిని ఇంటర్వ్యూ చేయడానికి అడవికి చేరాడు సాంబడు. భయం భయంగానే అంతటా తిరుగుతున్నాడు. ఇంతలో సాంబడి కష్టం చూసి జాలిపడి ముందుకు దూకింది ఓ పెద్దపులి. సాంబడికి గుండె ఆగినంత పని అయ్యింది. కదలకుండా అలాగే ఉండిపోయాడు.  ‘హాయ్​..  ఐ యామ్‌ పులి రాజా’ అంటూ తనని పరిచయం చేసుకున్నాడు. భయం నుంచి తేరుకుంటూ.. ‘అంటే నువ్వు..’ అంటూ సాగదీశాడు సాంబడు. ‘ఛీ.. ఛీ.. పులిరాజాకు ఎయిడ్స్​ వస్తుందా?’ అంటూ యాడ్​లో చూపించే కక్కుర్తి వ్యక్తిని కాదు నేను. అడవికి మృగరాజు తర్వాత అంతటి తోపునని చెప్పడం నా ఉద్దేశం. ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం కదా. మా మంచి కోసం ఓరోజును పెట్టిన మంచి మనుషులకు థ్యాంక్స్​. అందుకే నా అంతరంగం నీతో పంచుకునేందుకు మీ ముందుకొచ్చా. పదా.. అలా వనంలో విహరిద్దూ ముచ్చటించుకుందాం అంటూ పులిరాజు ముందు వెళ్తుండగా.. ఆ వెనకే కదిలాడు సాంబడు.  

నా పేరు పెద్దపులి. మాది ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబం అండీ. ‘జగమంత కుటుంబం’.. అని పాడుకుంటూ సరదాగా అడవుల్లో గడిపేవాళ్లం. కానీ, మా సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అది ఎందుకు తెలుసు కదా!. సర్కస్‌లు, జూలు, సఫారీలు, కాంక్రీట్​ అరణ్యాలు, కార్పొరేట్​ కుట్రలు.. అబ్బో కమర్షియల్​ మార్కెట్​ విస్తరిస్తున్నా కొద్దీ మాకీ అవస్థలు తప్పడం లేదు. ఒకప్పుడు మావి స్వేచ్ఛా రాజ్యాలు. ఎన్నో దేశాలు పట్టుకుని తిరిగినమ్‌. కానీ, ఏం జేస్తం. ఇప్పుడు బ్యాడ్‌ టైం నడుస్తంది. ఎక్కడికి వెళ్లినా సరిహద్దు గుర్తులుగా పెట్టుకునేవాళ్లం ఏదీ మీ మనుషులు కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు.  సాంబా నువ్వు నవ్వనంటే ఒకటి చెప్తా. మా మూత్రంతోనే మేం హద్దులు గీసుకుంటాం. వాసన గీతల్ని గుర్తుపెట్టుకుంటాం. మగవాళ్లం 60 నుంచి వంద చ.కి.మీటర్ల దాకా, ఇక ఆడ పులులేమో 20. చ.కి.మీటర్ల వరకు బార్డర్స్​ ఏర్పాటు చేసుకుంటాం.

కానీ, గత వందేళ్లలో ఎన్నో మార్పులు. లక్షల్లో ఉండే నా కుటుంబ సభ్యుల సంఖ్య.. ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది. తొమ్మిది జాతులు కాస్త.. ఆరుకి చేరి అంతరించిపోయే స్టేజ్‌కు చేరుకున్నాం. కాస్త కూస్తో ఈ దేశంలోనే(భారత్‌) మా కౌంట్​ బెటర్​గా ఉందని మొన్నటి లెక్కలైతే చెప్తున్నయ్. యాభై ఏళ్ల క్రితం 2,000 ఉన్న మా జనాభా.. ఇప్పుడు మూడు వేల దాకా(2967) చేరిందట. సంతోషం! కానీ, మూడు లక్షల చదరపు కిలోమీటర్ల రేంజ్​లో.. 15,000 పులుల దాకా ఉండే జీవించే హక్కు అవకాశం ఉందంటున్నారు. మరి దాని సంగతి.. (పరధ్యానంలోకి వెళ్లిపోయాడు పులిగాడు) 

ఏం మనుషులబ్బా.. 
అలా మాట్లాడుతుండగానే పులిరాజాగాడికి కళ్ల ముందు వాగు కనిపించింది. అదేం ఆనందమో ఒక్క దూకున ‘దబేల్’​మని దూకాడు వాడి సిగదరగ. అలా ఈదుతూనే..  ‘సాంబా.. మీ మనుషుల్లాగే సంతోషం, బాధ, కోరికలు.. అన్నీ ఉంటాయి మాకూ. కానీ, మేం మీ అంత తెలివైనోళ్లం కాదు కదా అబ్బా. అందుకే మా భావోద్వేగాలు​ డిఫరెంట్​గా ఉంటాయి. మేం గాండ్రించేది కమ్యూనికేషన్​ పర్పస్ కోసం. మాలో మేం మాట్లాడుకోవడానికి. అంతేగానీ సినిమాల్లో చూపెట్టినట్లు వేటాడడానికో.. భయపెట్టడానికో కాదు. సంతోషం వేస్తే కళ్లు మిటకరిస్తాం. బాధేస్తే మూలుగుతాం. ఎక్స్​ట్రీమ్​ ఆనందం వస్తే కళ్లు మూసుకుంటాం. మా విశ్రాంతి కూడా ధ్యానం తరహాలోనే ఉంటుంది.

కోరికల టైంలో మా కూత సెపరేట్​గా ఉంటుంది(అటుగా వెళ్తున్న ఆడపులిని చూసి సిగ్గుపడుతూ..). ఇక మా లైఫ్​ స్టయిల్​ అంటావా?.. మీలాగా డైట్‌లు గట్రా మాకేం ఉంటాయి?. ఆకలేస్తే వేటాడతాం. దొరికింది తింటాం. అరగకపోతే వాంతి చేసుకుంటాం. ఒక్కోసారి గడ్డి నమిలి జీర్ణం కానిదాన్ని బయటకు రప్పించుకుంటాం. అంతేకానీ మీ మనుషుల్లా దుర్మార్గంగా ప్రవర్తించడం. ఉత్త పుణ్యానికే మేం వేటాడం. అయినా మేం మనుషుల్ని ఎందుకు డిస్టర్బ్​ చేస్తామబ్బా?. మమ్మల్ని ఎవరైనా కెలిగితేనే దాడి చేస్తాం కదా! 

భలే లెక్కలు
వాగులోంచి బయటకొచ్చిన పులిగాడికి ఎదురుగా ఓ చెట్టు కనబడింది. ఆప్యాయంగా దానిని రుద్దేసి..  మూత్రాన్ని చిమ్మిచ్చి​ కొట్టేశాడు. ముసిముసి నవ్వులతో మళ్లీ సాంబడితో ముచ్చట్లు మొదలుపెట్టాడు.  ‘పులి ఎదురుగా వచ్చిందంటే.. మనిషికి ప్యాంట్​ తడిసిపోతుంటుంది. అదే బలహీన స్థితిలో పులి పక్కన ఫొటో దిగితే వాళ్లు ‘హీరోలు‌‌‌‌-షీరోలు’ అయిపోతారు. మాకు ఇదేం కర్మో అర్థం కాదు.  అన్నట్లు మా లెక్క భలే చిత్రంగా ఉంటుంది సాంబో​. అటవీశాఖవాళ్లు 1973 నుంచి ‘ప్రాజెక్టు టైగర్‌’ ద్వారా.. మా పాద ముద్రలతో మమ్మల్ని లెక్కపెడుతూ వస్తున్నారు. మీ వేలి ముద్రలు మనిషికీ మనిషికీ మధ్య ఎలా తేడా ఉంటాయో.. అట్లే మా పాదముద్రలు డిఫరెంట్​. మా అడుగుజాడ కనిపిస్తే, దాని అంచుల ఆకృతిని కాగితం మీద ట్రేస్‌లా గీసుకుని ప్లాస్టర్‌ ద్రవాన్ని ఆ ట్రేస్‌ నుంచి తీసిన మూసలో పోసి, అది గట్టి పడ్డాక భద్రపరుస్తారు. మొత్తం మీద ఎన్ని రకాల పాద ముద్రలు లభించిందీ లెక్క చూసుకుని.. వాటి ఆధారంగా మా కౌంట్ చెప్తారు. అయితే అంతటా ఇలా చేస్తారనేం లేదు. కంప్యూటర్ల సాయంతో, రేడియో కాలర్‌ విధానం, రహస్య కెమెరాల సాయం,  పరారుణ కిరణాల ఆధారంగా అభరణ్యాల్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్​ను లెక్కగడ్తారు. ప్చ్​.. టెక్నాలజీ మహిమ అంతా..(పులిగాడి నాలెడ్జ్‌కి సాంబడు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు)

మీకు దణ్ణం పెడ్తాం
‘లైఫ్​ ఆఫ్​ పై’ అని ఏదో సినిమా వచ్చిందట కదా. నువ్వు చూశావా. ఆ.. మావోళ్లు మాట్లాడుకుంటుంటే విన్నా. అందులో మా కులపోడు ఇరగదీశాడు అంట కదా!. ‘హా.. అదంతా కంప్యూటర్‌ గ్రాఫిక్స్​ లేండి’ అంటూ వంకరగా నవ్వుతూ చెప్పాడు సాంబడు. ఆ మాటతో పులిరాజాగాడు ‘ష్​...’ అంటూ ఓ నిట్టూర్పు విదిల్చాడు.  ‘అయినా ఏం ఉంది లే.. మా జంతువుల ఎమోషన్స్​తో ఆడుకోవడం.. కమర్షియల్​గా వాడుకోవడం మీకేమైనా కొత్తా?. ఒకప్పుడు సర్కస్​లు, ఆ తర్వాత జూలు, ఇప్పుడు సఫారీలు, సినిమాలు.. వైల్డ్‌లైఫ్‌ (ప్రొటెక్షన్‌) అమెండ్‌మెంట్‌ యాక్ట్ లాంటి చట్టాలున్నా మాలో చాలామంది బతుకులు మాత్రం అర్థాంతరంగా ముగుస్తున్నాయి. పేరుకే మేం పులులం. కానీ,  వేటాడడం మాత్రం ఎంత ఈజీనో. వలేస్తారు. బోనుల్లో ఎరలేస్తారు. అడవి బిడ్డలకు డబ్బు ఆశ చూపెట్టి మమ్మల్ని మట్టుపెడతారు. కుట్ర చేసి తూటాలు-బళ్లాలు దొంగచాటుగా మా శరీరంలో దింపుతారు. చర్మం వొలిచి, గోళ్లు-కోరలు పీకేసి, ఎముకలు లాగేసి.. అబ్బో ఆ క్రూరత్వం మాకన్నా మనిషి వేటలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. అంతెందుకు నా చెల్లి అవనిని ఎంత ఘోరంగా చంపారో తెలిదా?, మా ముందు తరం సాఖీని జూలోనే ఘోరంగా చంపింది గుర్తు లేదా? మాలాంటోళ్లకు భద్రత-రక్షణ ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లోనా? జూలోనా?.. ఇంక యాడ?.. మనుషులకు దణ్ణం పెడుతున్నా. మా మామాన మమ్మల్ని వదిలేయండి. (చెమ్మగిల్లిన కళ్లతో పులిగాడు.. ఆ మాటలతో సాంబడికీ కళ్లలో నీళ్లు తిరిగాయి) 

అవని మృతదేహాం

వాళ్లకు వందనాలు
ఇద్దరికీ కన్నీళ్లు చెదిరిపోయాయి.  ‘‘మనుషుల దృష్టిలో మేం దేవతా వాహనాలం. ‘పులిలా బతకరా. నువ్వు ఆడపులివి. పులి కడుపున పులే పుడుతుంద’ంటూ సొల్లు కబుర్లు చెప్తుంటారు. మరి మా జీవనాన్ని ఎందుకు గౌరవించరు. మామాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా. కనిపిస్తే ఆడుకుంటారు. వెంటాడి మరీ దాడులు చేస్తారు. కన్ఫ్యూజ్​ చేసి వాళ్లూ ఇబ్బంది పడతారు. రెచ్చగొడితే పిల్లి అయినా పులే అవుతుందనే విషయం మనిషికి తెలీదా. మా బతుకుల్ని ఆగం చేయకుండా ఉంటే.. ఊర్ల మీద పడాల్సిన అవసరం మాకేముండేది(ఆవేశంతో ఊగిపోతూ పులిగాడు..)’’. అంతలోనే తేరుకుని ‘‘సరేగానీ సాంబా ఇవాళ మా పండుగ Global Tiger Day. మా జాతి సంరక్షణ కోసం పదకొండేళ్ల కోసం పుట్టింది ఈ రోజు. మా మీద ప్రేమతో కొందరు ఈ డేని జరుపుతున్నారు. మా జోలికి రాకుండా మమ్మల్ని ఎలా బతకనివ్వాలనే విషయాన్ని వాళ్లు ప్రచారం చేస్తుంటారు. మమ్మల్ని అడవి బిడ్డలుగా గుర్తించమని చెప్తారు. హ్యూమన్-టైగర్​ కాన్​ఫ్లిక్ట్​ గురించి గ్రామీణ, అడవులకు దగ్గరగా ఉండే ఊర్లు, గూడెం, తండాల్లో అవగాహన కల్పిస్తారు. వాళ్లకు మా వందనలు. మా మంచి కోసం ఆలోచించే నలుగురు ఉన్నారనే ఆనందంతో ఇలా గడిపేస్తాం. సరే మరి.. నీకు బాగా లేట్​ అయ్యింది. ఎక్కువసేపు ఉంటే నిజంగానే లేట్​సాంబడివి అయిపోతావ్​..త్వరగా వెళ్లిపో.. బై బై.. ఉంటా మరి!’’ అంటూ అలా పులిరాజుగాడు దట్టమైన చెట్ల నడుమకు పయనమయ్యాడు. ఇంతలో ‘Happy ​World Tiger Day’ అంటూ సాంబడు అనడంతో.. పులిరాజా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్లీ ముందుకు వడివడిగా అడుగులేశాడు.

-ఆర్కే నారాయణ్‌ ఏ టైగర్‌ కమ్స్‌ టు టౌన్‌ స్ఫూర్తితో.. సాక్షి వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement