international tigers day
-
ఒకవైపు నిజం.. మరోవైపు ‘చిత్రం’
పులి అంటే రాజసం.. పౌరుషం..ఈ భావాలకు అద్దం పడుతూ తీసిన ఈ రెండు ఫొటోలను ఓ సారి గమనించండి. ఎడమ వైపు ఉన్న పులి హైదరాబాద్‌లోని జూ పార్కులో శుక్రవారం తీసిన ఫొటో అయితే.. కుడివైపున ఉన్న పులి ఇంటర్నేషనల్ టైగర్స్డే సందర్భంగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోని చిత్రం. -
ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
-
ఆ అధికారుల వాహనాల కొనుగోలు కోసం సీఎం జగన్ అంగీకారం
సాక్షి, తాడేపల్లి : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో అటవీ శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని పేర్కొన్నారు. ఇక నల్లమలనుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు.. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ క్రమంలో.. పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. టైగర్ రిజర్వ్‌ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు ఆయన అంగీకారం తెలిపారు. -
హాయ్.. నేనే అసలైన పులిరాజాని!
పులుల దినోత్సవం సందర్భంగా బాస్ ఆదేశాలతో పెద్దపులిని ఇంటర్వ్యూ చేయడానికి అడవికి చేరాడు సాంబడు. భయం భయంగానే అంతటా తిరుగుతున్నాడు. ఇంతలో సాంబడి కష్టం చూసి జాలిపడి ముందుకు దూకింది ఓ పెద్దపులి. సాంబడికి గుండె ఆగినంత పని అయ్యింది. కదలకుండా అలాగే ఉండిపోయాడు. ‘హాయ్.. ఐ యామ్ పులి రాజా’ అంటూ తనని పరిచయం చేసుకున్నాడు. భయం నుంచి తేరుకుంటూ.. ‘అంటే నువ్వు..’ అంటూ సాగదీశాడు సాంబడు. ‘ఛీ.. ఛీ.. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అంటూ యాడ్‌లో చూపించే కక్కుర్తి వ్యక్తిని కాదు నేను. అడవికి మృగరాజు తర్వాత అంతటి తోపునని చెప్పడం నా ఉద్దేశం. ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం కదా. మా మంచి కోసం ఓరోజును పెట్టిన మంచి మనుషులకు థ్యాంక్స్. అందుకే నా అంతరంగం నీతో పంచుకునేందుకు మీ ముందుకొచ్చా. పదా.. అలా వనంలో విహరిద్దూ ముచ్చటించుకుందాం అంటూ పులిరాజు ముందు వెళ్తుండగా.. ఆ వెనకే కదిలాడు సాంబడు. నా పేరు పెద్దపులి. మాది ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబం అండీ. ‘జగమంత కుటుంబం’.. అని పాడుకుంటూ సరదాగా అడవుల్లో గడిపేవాళ్లం. కానీ, మా సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అది ఎందుకు తెలుసు కదా!. సర్కస్‌లు, జూలు, సఫారీలు, కాంక్రీట్ అరణ్యాలు, కార్పొరేట్ కుట్రలు.. అబ్బో కమర్షియల్ మార్కెట్ విస్తరిస్తున్నా కొద్దీ మాకీ అవస్థలు తప్పడం లేదు. ఒకప్పుడు మావి స్వేచ్ఛా రాజ్యాలు. ఎన్నో దేశాలు పట్టుకుని తిరిగినమ్. కానీ, ఏం జేస్తం. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తంది. ఎక్కడికి వెళ్లినా సరిహద్దు గుర్తులుగా పెట్టుకునేవాళ్లం ఏదీ మీ మనుషులు కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు. సాంబా నువ్వు నవ్వనంటే ఒకటి చెప్తా. మా మూత్రంతోనే మేం హద్దులు గీసుకుంటాం. వాసన గీతల్ని గుర్తుపెట్టుకుంటాం. మగవాళ్లం 60 నుంచి వంద చ.కి.మీటర్ల దాకా, ఇక ఆడ పులులేమో 20. చ.కి.మీటర్ల వరకు బార్డర్స్ ఏర్పాటు చేసుకుంటాం. కానీ, గత వందేళ్లలో ఎన్నో మార్పులు. లక్షల్లో ఉండే నా కుటుంబ సభ్యుల సంఖ్య.. ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది. తొమ్మిది జాతులు కాస్త.. ఆరుకి చేరి అంతరించిపోయే స్టేజ్‌కు చేరుకున్నాం. కాస్త కూస్తో ఈ దేశంలోనే(భారత్) మా కౌంట్ బెటర్‌గా ఉందని మొన్నటి లెక్కలైతే చెప్తున్నయ్. యాభై ఏళ్ల క్రితం 2,000 ఉన్న మా జనాభా.. ఇప్పుడు మూడు వేల దాకా(2967) చేరిందట. సంతోషం! కానీ, మూడు లక్షల చదరపు కిలోమీటర్ల రేంజ్లో.. 15,000 పులుల దాకా ఉండే జీవించే హక్కు అవకాశం ఉందంటున్నారు. మరి దాని సంగతి.. (పరధ్యానంలోకి వెళ్లిపోయాడు పులిగాడు) ఏం మనుషులబ్బా.. అలా మాట్లాడుతుండగానే పులిరాజాగాడికి కళ్ల ముందు వాగు కనిపించింది. అదేం ఆనందమో ఒక్క దూకున ‘దబేల్’మని దూకాడు వాడి సిగదరగ. అలా ఈదుతూనే.. ‘సాంబా.. మీ మనుషుల్లాగే సంతోషం, బాధ, కోరికలు.. అన్నీ ఉంటాయి మాకూ. కానీ, మేం మీ అంత తెలివైనోళ్లం కాదు కదా అబ్బా. అందుకే మా భావోద్వేగాలు డిఫరెంట్‌గా ఉంటాయి. మేం గాండ్రించేది కమ్యూనికేషన్ పర్పస్ కోసం. మాలో మేం మాట్లాడుకోవడానికి. అంతేగానీ సినిమాల్లో చూపెట్టినట్లు వేటాడడానికో.. భయపెట్టడానికో కాదు. సంతోషం వేస్తే కళ్లు మిటకరిస్తాం. బాధేస్తే మూలుగుతాం. ఎక్స్ట్రీమ్ ఆనందం వస్తే కళ్లు మూసుకుంటాం. మా విశ్రాంతి కూడా ధ్యానం తరహాలోనే ఉంటుంది. కోరికల టైంలో మా కూత సెపరేట్‌గా ఉంటుంది(అటుగా వెళ్తున్న ఆడపులిని చూసి సిగ్గుపడుతూ..). ఇక మా లైఫ్ స్టయిల్ అంటావా?.. మీలాగా డైట్లు గట్రా మాకేం ఉంటాయి?. ఆకలేస్తే వేటాడతాం. దొరికింది తింటాం. అరగకపోతే వాంతి చేసుకుంటాం. ఒక్కోసారి గడ్డి నమిలి జీర్ణం కానిదాన్ని బయటకు రప్పించుకుంటాం. అంతేకానీ మీ మనుషుల్లా దుర్మార్గంగా ప్రవర్తించడం. ఉత్త పుణ్యానికే మేం వేటాడం. అయినా మేం మనుషుల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తామబ్బా?. మమ్మల్ని ఎవరైనా కెలిగితేనే దాడి చేస్తాం కదా! భలే లెక్కలు వాగులోంచి బయటకొచ్చిన పులిగాడికి ఎదురుగా ఓ చెట్టు కనబడింది. ఆప్యాయంగా దానిని రుద్దేసి.. మూత్రాన్ని చిమ్మిచ్చి కొట్టేశాడు. ముసిముసి నవ్వులతో మళ్లీ సాంబడితో ముచ్చట్లు మొదలుపెట్టాడు. ‘పులి ఎదురుగా వచ్చిందంటే.. మనిషికి ప్యాంట్ తడిసిపోతుంటుంది. అదే బలహీన స్థితిలో పులి పక్కన ఫొటో దిగితే వాళ్లు ‘హీరోలు-షీరోలు’ అయిపోతారు. మాకు ఇదేం కర్మో అర్థం కాదు. అన్నట్లు మా లెక్క భలే చిత్రంగా ఉంటుంది సాంబో. అటవీశాఖవాళ్లు 1973 నుంచి ‘ప్రాజెక్టు టైగర్’ ద్వారా.. మా పాద ముద్రలతో మమ్మల్ని లెక్కపెడుతూ వస్తున్నారు. మీ వేలి ముద్రలు మనిషికీ మనిషికీ మధ్య ఎలా తేడా ఉంటాయో.. అట్లే మా పాదముద్రలు డిఫరెంట్. మా అడుగుజాడ కనిపిస్తే, దాని అంచుల ఆకృతిని కాగితం మీద ట్రేస్‌లా గీసుకుని ప్లాస్టర్ ద్రవాన్ని ఆ ట్రేస్ నుంచి తీసిన మూసలో పోసి, అది గట్టి పడ్డాక భద్రపరుస్తారు. మొత్తం మీద ఎన్ని రకాల పాద ముద్రలు లభించిందీ లెక్క చూసుకుని.. వాటి ఆధారంగా మా కౌంట్ చెప్తారు. అయితే అంతటా ఇలా చేస్తారనేం లేదు. కంప్యూటర్ల సాయంతో, రేడియో కాలర్ విధానం, రహస్య కెమెరాల సాయం, పరారుణ కిరణాల ఆధారంగా అభరణ్యాల్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్‌ను లెక్కగడ్తారు. ప్చ్.. టెక్నాలజీ మహిమ అంతా..(పులిగాడి నాలెడ్జ్‌కి సాంబడు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు) మీకు దణ్ణం పెడ్తాం ‘లైఫ్ ఆఫ్ పై’ అని ఏదో సినిమా వచ్చిందట కదా. నువ్వు చూశావా. ఆ.. మావోళ్లు మాట్లాడుకుంటుంటే విన్నా. అందులో మా కులపోడు ఇరగదీశాడు అంట కదా!. ‘హా.. అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ లేండి’ అంటూ వంకరగా నవ్వుతూ చెప్పాడు సాంబడు. ఆ మాటతో పులిరాజాగాడు ‘ష్...’ అంటూ ఓ నిట్టూర్పు విదిల్చాడు. ‘అయినా ఏం ఉంది లే.. మా జంతువుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం.. కమర్షియల్‌గా వాడుకోవడం మీకేమైనా కొత్తా?. ఒకప్పుడు సర్కస్‌లు, ఆ తర్వాత జూలు, ఇప్పుడు సఫారీలు, సినిమాలు.. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) అమెండ్మెంట్ యాక్ట్ లాంటి చట్టాలున్నా మాలో చాలామంది బతుకులు మాత్రం అర్థాంతరంగా ముగుస్తున్నాయి. పేరుకే మేం పులులం. కానీ, వేటాడడం మాత్రం ఎంత ఈజీనో. వలేస్తారు. బోనుల్లో ఎరలేస్తారు. అడవి బిడ్డలకు డబ్బు ఆశ చూపెట్టి మమ్మల్ని మట్టుపెడతారు. కుట్ర చేసి తూటాలు-బళ్లాలు దొంగచాటుగా మా శరీరంలో దింపుతారు. చర్మం వొలిచి, గోళ్లు-కోరలు పీకేసి, ఎముకలు లాగేసి.. అబ్బో ఆ క్రూరత్వం మాకన్నా మనిషి వేటలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. అంతెందుకు నా చెల్లి అవనిని ఎంత ఘోరంగా చంపారో తెలిదా?, మా ముందు తరం సాఖీని జూలోనే ఘోరంగా చంపింది గుర్తు లేదా? మాలాంటోళ్లకు భద్రత-రక్షణ ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లోనా? జూలోనా?.. ఇంక యాడ?.. మనుషులకు దణ్ణం పెడుతున్నా. మా మామాన మమ్మల్ని వదిలేయండి. (చెమ్మగిల్లిన కళ్లతో పులిగాడు.. ఆ మాటలతో సాంబడికీ కళ్లలో నీళ్లు తిరిగాయి) అవని మృతదేహాం వాళ్లకు వందనాలు ఇద్దరికీ కన్నీళ్లు చెదిరిపోయాయి. ‘‘మనుషుల దృష్టిలో మేం దేవతా వాహనాలం. ‘పులిలా బతకరా. నువ్వు ఆడపులివి. పులి కడుపున పులే పుడుతుంద’ంటూ సొల్లు కబుర్లు చెప్తుంటారు. మరి మా జీవనాన్ని ఎందుకు గౌరవించరు. మామాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా. కనిపిస్తే ఆడుకుంటారు. వెంటాడి మరీ దాడులు చేస్తారు. కన్ఫ్యూజ్ చేసి వాళ్లూ ఇబ్బంది పడతారు. రెచ్చగొడితే పిల్లి అయినా పులే అవుతుందనే విషయం మనిషికి తెలీదా. మా బతుకుల్ని ఆగం చేయకుండా ఉంటే.. ఊర్ల మీద పడాల్సిన అవసరం మాకేముండేది(ఆవేశంతో ఊగిపోతూ పులిగాడు..)’’. అంతలోనే తేరుకుని ‘‘సరేగానీ సాంబా ఇవాళ మా పండుగ Global Tiger Day. మా జాతి సంరక్షణ కోసం పదకొండేళ్ల కోసం పుట్టింది ఈ రోజు. మా మీద ప్రేమతో కొందరు ఈ డేని జరుపుతున్నారు. మా జోలికి రాకుండా మమ్మల్ని ఎలా బతకనివ్వాలనే విషయాన్ని వాళ్లు ప్రచారం చేస్తుంటారు. మమ్మల్ని అడవి బిడ్డలుగా గుర్తించమని చెప్తారు. హ్యూమన్-టైగర్ కాన్ఫ్లిక్ట్ గురించి గ్రామీణ, అడవులకు దగ్గరగా ఉండే ఊర్లు, గూడెం, తండాల్లో అవగాహన కల్పిస్తారు. వాళ్లకు మా వందనలు. మా మంచి కోసం ఆలోచించే నలుగురు ఉన్నారనే ఆనందంతో ఇలా గడిపేస్తాం. సరే మరి.. నీకు బాగా లేట్ అయ్యింది. ఎక్కువసేపు ఉంటే నిజంగానే లేట్సాంబడివి అయిపోతావ్..త్వరగా వెళ్లిపో.. బై బై.. ఉంటా మరి!’’ అంటూ అలా పులిరాజుగాడు దట్టమైన చెట్ల నడుమకు పయనమయ్యాడు. ఇంతలో ‘Happy World Tiger Day’ అంటూ సాంబడు అనడంతో.. పులిరాజా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్లీ ముందుకు వడివడిగా అడుగులేశాడు. -ఆర్కే నారాయణ్ ఏ టైగర్ కమ్స్ టు టౌన్ స్ఫూర్తితో.. సాక్షి వెబ్ డెస్క్ ప్రత్యేకం #InternationalTigerDay | Here are some of the parks and sanctuaries in India where you can spot the magnificent cat in its element.🐅🐯 #TigerDay | #InternationalTigerDay2021 pic.twitter.com/Am1mvkWnFU — 𝙍𝙖𝙟𝙚𝙨𝙝 𝘾𝙝𝙖𝙪𝙝𝙖𝙣 (@twitt_chauhan) July 28, 2021 -
పశ్చిమ ఏజెన్సీలో పులుల గాండ్రింపులు
బుట్టాయగూడెం:జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జంతు రాజ్యంలో సింహం తర్వాత స్థానం పులిదే. పులితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటమనేది గతం. రానురాను పులులు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనిషి దురాశ, లాభాపేక్షకు పులులు బలైపోతున్నాయని వరల్డ్ లైఫ్ గణాంకాలు చెబుతున్నాయి. పులులను కాపాడుకునేందుకు అవి సంచరించే అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2010 నుంచి ఏటా జులై 29వ తేదీన టైగర్స్ డే నిర్వహిస్తున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని అభయారణ్యం, పులుల సంచారం, వన్యప్రాణుల గురించి తెలుసుకుందాం. ట్రాప్ కెమెరాకు చిక్కకుండా.. పాపికొండల అభయారణ్యం తూర్పు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల మధ్యలో ఉంది. మొదట్లో 590 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం మాత్రమే రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేది. 2008లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కోసం అభయారణ్యంగా గుర్తించారు. ఈ అభయారణ్యాన్ని జాతీయ పార్కుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1012.86 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల మధ్య 1,01,200 హెక్టార్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇందులో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో నాలుగు పులులు సంచరిస్తున్నట్టు 2004లో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గోదావరి ప్రాంతంలోని తెల్లదిబ్బల ప్రదేశంలో రాత్రి వేళ పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అయితే పులులు తాము ఏర్పాటు చేస్తున్న ట్రాప్ కెమెరాకు చిక్కకుండా తిరుగుతున్నాయని, వాటి అలికిడిని మాత్రం గమనిస్తున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. 2009–10 మధ్య కాలంలో బుట్టాయగూడెం మండలంలోని అలివేరు, ఇనుమూరు, అంతర్వేదిగూడెం, చింతలగూడెం తదితర అటవీ ప్రాంతంలో పులుల అడుగులను అధికారులు గుర్తించారు. ఇటీవల గుబ్బల మంగమ్మ గుడి సమీపంలో కూడా పులి సంచరిస్తున్నట్టు అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. అటవీ ప్రాంత పరిధి ఎక్కువగా ఉండటంతో అవి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో 4 పులులు, 5 చిరుత పులులు సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. 1,12,500 హెక్టార్లలో జాతీయ పార్కు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉంది. అడవి జంతువుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెబుతున్నా వేటగాళ్ల తూటాలకు జంతువులు బలైపోతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితోపాటు పాపికొండల నేషనల్ పార్కుగా సుమారు 1,12,500 హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో పులులు, ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అత్యంత ప్రమాదకరమైన గిరి నాగు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్లు, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో తేలింది. పాపికొండల అభయారణ్యంలో రెండేళ్ల క్రితం చిరుత పులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి దున్నలు ఉన్నట్లు గుర్తించారు. జంతు సంరక్షణకు బుట్టాయగూడెం మండలంలో గుబ్బలమంగమ్మవారి గుడి ప్రాంతంలోని గోగులపూడి సమీపంలో బేస్ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. వన్యప్రాణి చట్టం.. శిక్షలు వన్యప్రాణుల సంరక్షణ కోసం సుమారు 46 ఏళ్ల క్రితం వైల్డ్‌లైఫ్ చట్టాన్ని తీసుకువచ్చారు. అడవుల్లో తిరిగే పక్షులు, అడవి దున్నలు, ఎలుగు బంట్లు, నెమళ్లు, పులులు, చిరుత పులులు, దుప్పులు తదితర అడవి జంతువులను వేటాడి చంపితే వన్యమృగాల సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హులవుతారు. పులిని చంపి దాని చర్మాన్ని, గోళ్లు తీసినా, బంధించినా, విష ప్రయోగం చేసినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా చట్టంలోని సెక్షన్ 51(ఏ) కింద జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. చిరుత పులికి కూడా ఇదే సెక్షన్ వర్తిస్తుంది. ఎలుగు బంటిని చంపితే సెక్షన్ 68 (ఏ) మొసళ్లు, కోతులను పట్టుకున్నా, చంపినా సెక్షన్లు 428, 429 కింద కేసులు నమోదు చేస్తారు. కుందేళ్లను పట్టుకుంటే సెక్షన్ 148 (సి), 135 (బి) కింద కేసులు నమోదు చేసి శిక్ష విధిస్తారు. నెమలిని పట్టుకున్నా, హింసించినా సెక్షన్ 9 కింద శిక్షార్హులు. మిగతా జంతువులు, పక్షులకు సంబంధించి కూడా ఆయా సెక్షన్లు వైల్డ్‌లైఫ్ చట్టంలో పొందుపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదైతే బెయిల్ కూడా లభించదని జంతు సంరక్షణ అధికారులు తెలిపారు. నాలుగు పులులను గుర్తించాం పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. తమ ఆవాసాల్లో మానవ సంచారం, ఇతరత్రా ఆటంకాల కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయి. వన్యప్రాణులు కనిపిస్తే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. వాటికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుంటే అవి తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్తాయి. పాపికొండల అభయారణ్యంలో నాలుగు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ఆ పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి, రాజమండ్రి -
రాష్ట్రంలో పెద్ద పులులెన్ని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని పెద్ద పులులున్నాయి? గతంతో పోల్చితే పులుల సంఖ్య పెరిగిందా లేక తగ్గిందా? దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఉన్నాయి? జాతీయస్థాయిలో చూస్తే గతంలో మాదిరిగానే వాటి సంఖ్యలో వృద్ధి జరిగిందా లేదా అన్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సోమవారం ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు విడుదల చేయనున్నారు. ప్రతి నాలుగేళ్లకూ ఓసారి పులుల గణన చేపడతారు. 2006లో తొలిసారిగా దేశవ్యాప్తంగా టైగర్ సెన్సెస్‌ను విడుదల చేయగా.. మళ్లీ 2010లో, ఆ తర్వాత 2014లో ఈ వివరాలను ప్రకటించారు. 2014లో ఏపీ, తెలంగాణలను కలిపి ఒకటిగానే సమాచారం వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా ఇక్కడ ఎన్ని పులులున్నాయనేది అధికారికంగా వెల్లడి కానుంది. 2014 లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ లో 68 పులులుండగా వాటిలో 20 పులులు తెలంగాణలో ఉన్నట్టుగా (ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో17, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 3) ఇక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో వీటి సంఖ్య 28 నుంచి 30 వరకు పెరిగినట్టు అనధికార లెక్కలను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే 2006లో 1,411 పులులు ఉండగా.. 2010లో 1,706కు, 2014లో 2,226కు వాటి సంఖ్య పెరిగింది. -
పులులుంటేనే వాతావరణంలో సమతుల్యం
టైగర్‌జోన్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ అంతర్జాతీయ పులుల దినోత్సవ ర్యాలీ జన్నారం : పులులతో వాతావరణంలో సమతుల్యత ఉంటుందని, దీంతో మనిషి మనుగడకు ముప్పు వాటిల్లే కాలుష్యం నివారణ అవుతుందని టైగర్‌జోన్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురష్కరించుకుని మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా టీడీసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కవ్వాల్ టైగర్‌జోన్ కావడం వల్ల ఈ ప్రాంతంలో పులులు వచ్చాయని, వాటి రాక శుభపరిణామమని అన్నారు. పులులను కాపాడుకోవడం అందరి బాధ్యతని, పులులు ఈ ప్రాంతంలో ఉండాలంటే అడవులను సంరక్షించుకోవాలని తెలిపారు. అడవులు దట్టంగా ఉండడం వల్ల శాఖాహార జంతువులు ఉంటాయని, వాటితో పులుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. త్వరలో పులులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, అందుకు తగ్గినట్లుగా కారిడర్ తయారు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, రేంజ్ అధికారి సౌకత్ హుస్సెన్, ఎన్సీసీ అధికారి రాజమౌళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, పట్టణ అధ్యక్షుడు భరత్‌కుమార్, డీఆర్వో గులాం మొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.