పశ్చిమ ఏజెన్సీలో పులుల గాండ్రింపులు | Tigers And Leopords in West Agency Forest | Sakshi
Sakshi News home page

పశ్చిమ ఏజెన్సీలో పులుల సంచారం

Published Wed, Jul 29 2020 10:03 AM | Last Updated on Wed, Jul 29 2020 10:03 AM

Tigers And Leopords in West Agency Forest - Sakshi

పాపికొండల అభయారణ్యంలో ట్రాప్‌ కెమెరాకు చిక్కిన పులి

బుట్టాయగూడెం:జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జంతు రాజ్యంలో సింహం తర్వాత స్థానం పులిదే. పులితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటమనేది గతం. రానురాను పులులు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనిషి దురాశ, లాభాపేక్షకు పులులు బలైపోతున్నాయని వరల్డ్‌ లైఫ్‌ గణాంకాలు చెబుతున్నాయి.  పులులను కాపాడుకునేందుకు అవి సంచరించే అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2010 నుంచి ఏటా జులై 29వ తేదీన టైగర్స్‌ డే నిర్వహిస్తున్నారు. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన టైగర్‌ సమ్మిట్‌ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని అభయారణ్యం, పులుల సంచారం, వన్యప్రాణుల గురించి తెలుసుకుందాం.  

ట్రాప్‌ కెమెరాకు చిక్కకుండా.. 
పాపికొండల అభయారణ్యం తూర్పు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల మధ్యలో ఉంది. మొదట్లో 590 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం మాత్రమే రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ఉండేది. 2008లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కోసం అభయారణ్యంగా గుర్తించారు. ఈ అభయారణ్యాన్ని జాతీయ పార్కుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1012.86 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల మధ్య 1,01,200 హెక్టార్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇందులో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో నాలుగు పులులు సంచరిస్తున్నట్టు 2004లో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గోదావరి ప్రాంతంలోని తెల్లదిబ్బల ప్రదేశంలో రాత్రి వేళ పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అయితే పులులు తాము ఏర్పాటు చేస్తున్న ట్రాప్‌ కెమెరాకు చిక్కకుండా తిరుగుతున్నాయని, వాటి అలికిడిని మాత్రం గమనిస్తున్నామని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. 2009–10 మధ్య కాలంలో బుట్టాయగూడెం మండలంలోని అలివేరు, ఇనుమూరు, అంతర్వేదిగూడెం, చింతలగూడెం తదితర అటవీ ప్రాంతంలో పులుల అడుగులను అధికారులు గుర్తించారు. ఇటీవల గుబ్బల మంగమ్మ గుడి సమీపంలో కూడా పులి సంచరిస్తున్నట్టు అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. అటవీ ప్రాంత పరిధి ఎక్కువగా ఉండటంతో అవి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో 4 పులులు, 5 చిరుత పులులు సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.  

1,12,500 హెక్టార్లలో జాతీయ పార్కు 
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉంది. అడవి జంతువుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెబుతున్నా వేటగాళ్ల తూటాలకు జంతువులు బలైపోతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితోపాటు పాపికొండల నేషనల్‌ పార్కుగా సుమారు 1,12,500 హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో పులులు, ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అత్యంత ప్రమాదకరమైన గిరి నాగు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్లు, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో తేలింది. పాపికొండల అభయారణ్యంలో రెండేళ్ల క్రితం చిరుత పులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవి దున్నలు ఉన్నట్లు గుర్తించారు. జంతు సంరక్షణకు బుట్టాయగూడెం మండలంలో గుబ్బలమంగమ్మవారి గుడి ప్రాంతంలోని గోగులపూడి సమీపంలో బేస్‌ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో బేస్‌ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.   

వన్యప్రాణి చట్టం.. శిక్షలు 

వన్యప్రాణుల సంరక్షణ కోసం సుమారు 46 ఏళ్ల క్రితం వైల్డ్‌లైఫ్‌ చట్టాన్ని తీసుకువచ్చారు. అడవుల్లో తిరిగే పక్షులు, అడవి దున్నలు, ఎలుగు బంట్లు, నెమళ్లు, పులులు, చిరుత పులులు, దుప్పులు తదితర అడవి జంతువులను వేటాడి చంపితే వన్యమృగాల సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హులవుతారు. పులిని చంపి దాని చర్మాన్ని, గోళ్లు తీసినా, బంధించినా, విష ప్రయోగం చేసినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా చట్టంలోని సెక్షన్‌ 51(ఏ) కింద జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. చిరుత పులికి కూడా ఇదే సెక్షన్‌ వర్తిస్తుంది. ఎలుగు బంటిని చంపితే సెక్షన్‌ 68 (ఏ) మొసళ్లు, కోతులను పట్టుకున్నా, చంపినా సెక్షన్లు 428, 429 కింద కేసులు నమోదు చేస్తారు. కుందేళ్లను పట్టుకుంటే సెక్షన్‌ 148 (సి), 135 (బి) కింద కేసులు నమోదు చేసి శిక్ష విధిస్తారు. నెమలిని పట్టుకున్నా, హింసించినా సెక్షన్‌ 9 కింద శిక్షార్హులు. మిగతా జంతువులు, పక్షులకు సంబంధించి కూడా ఆయా సెక్షన్లు వైల్డ్‌లైఫ్‌ చట్టంలో పొందుపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదైతే బెయిల్‌ కూడా లభించదని జంతు సంరక్షణ అధికారులు తెలిపారు.  

నాలుగు పులులను గుర్తించాం 
పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్‌ కార్నివోర్స్‌ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. తమ ఆవాసాల్లో మానవ సంచారం, ఇతరత్రా ఆటంకాల కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయి. వన్యప్రాణులు కనిపిస్తే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. వాటికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుంటే అవి తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్తాయి. పాపికొండల అభయారణ్యంలో నాలుగు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ఆ పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.   –సి.సెల్వమ్, వైల్డ్‌ లైఫ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి, రాజమండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement