ఈసారి బ్రహ్మి గెటప్ ఏంటో తెలుసా?
హైదరాబాద్: విలక్షణ నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇపుడు వెరైటీ గెటప్లో కనిపించనున్నారు. ఈ వారంలో థియేటర్లను పలకరించనున్న మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'బెంగాల్ టైగర్' లో ఆయన అమలపాల్గా అలరించనున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు అమలాపాల్ అట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది.
దీంతోపాటుగా ఈ చిత్రంలోని ఓ పాట మేకింగ్ వీడియోను చిత్ర దర్శకుడు సంపత్‌నంది తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అరగుండు, ఖాన్ దాదా, కత్తి రాందాసు, శంకర్‌దాదా ఆర్ఎంపీ, జిలేబి, హింసరాజ్, పీకే ఇలా వైవిధ్యమైన పాత్రల పేర్లుతో పాటు తన నటనతో బ్రహ్మానందం ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.
తాజా గెటప్తో బ్రహ్మానందం ఎలా అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం రీసెంట్గా 1000 సినిమాల రికార్డును సైతం బ్రేక్ చేశాడు. కాగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించిన బెంగాల్ టైగర్ ఈ నెల 10న విడుదలకు సిద్ధం అవుతోంది.