
పవర్‌ఫుల్ టైగర్
‘‘బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్..! కోల్‌కతా కాళీఘాట్‌లో ఏసీపీగా డ్యూటీ చేస్తోంది’’ అనే డైలాగ్ వినబడగానే మనకు గుర్తొచ్చేది ‘పవర్ ’ చిత్రం లో రవితేజ పోషించిన బలదేవ్ సహాయ్ పాత్ర. ఇప్పుడా ‘బెంగాల్ టైగర్’ టైటిల్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ ప్రధాన పాత్రధారి.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆర్.ఎఫ్.సీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బొమన్ ఇరానీ, సాయాజీ షిండేలతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ రవితేజతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి ఆ కోరిక తీరుతోంది. రవితేజ పాత్రను చాలా శక్తిమంతంగా డిజైన్ చేశాం. ఈ నెల 14 వర కు షెడ్యూల్ కొనసాగుతుంది’’అని చెప్పారు.