జత కోసం గాలిస్తూ 20 రోజుల్లో 10 జిల్లాలు చుట్టొచ్చిన బెంగాల్ టైగర్
ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్ట వేసినట్లు గుర్తింపు
ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని అడవుల్లో బెంగాల్ టైగర్ సంచారం కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసిన పెద్దపులి.. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్టవేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. ‘తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.
వారం క్రితం పంబాపురం, నర్సాపురం అడవుల్లో తిరిగిన పులి.. బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య హెచ్చరించారు. దీంతో గిరిజన గూడేల్లో మళ్లీ పులి కలకలం మొదలైంది.
తోడు కోసం గాలిస్తూ..: ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మగ పులి.. ఆడపులి తోడు కోసం అడవులన్నీ తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.. చెన్నూరు, భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం.. ఇంద్రావతి నుంచి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం... ఇలా పులి సుమారు 10 జిల్లాల్లో చాలా దూరం నడిచినట్లు పాదముద్రల ద్వారా తెలుస్తోందని అటవీశాఖ ప్రకటించింది.
అయితే 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి ములుగు అడవులకు మేటింగ్ కోసం వచ్చిన పులే మరోసారి వచ్చి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి నాలుగైదేళ్ల నాటి పులుల సంచార రికార్డులు, కెమెరా ట్రాప్‌లు, వాటి ఫొటోలు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్నది కచ్చితంగా చెప్పగలమంటున్నారు.
మూడేళ్ల కిందట ఇలాగే..: మూడేళ్ల క్రితం పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పర్యటించిందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఆవును కూడా పులి చంపితిందని, ఆ తర్వాత నుంచి దాని జాడ లేదని.. తిరిగి 10 రోజులుగా పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకుందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment