పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను! | Interview with Bengal Tiger music director Bheems Cecireleo | Sakshi
Sakshi News home page

పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను!

Published Thu, Dec 3 2015 11:21 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను! - Sakshi

పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను!

‘నువ్వా-నేనా’తో సంగీతదర్శకునిగా భీమ్స్ సిసిరోలియా ప్రయాణం ఆరంభమైంది. ‘అలా ఎలా’, ‘జోరు’, ‘కెవ్వు కేక’, ‘గాలిపటం’ చిత్రాలకు స్వరాలందించారు. ఆ చిత్రాల్లోని పాటలు బాగున్నాయనే టాక్ వచ్చినా ఎందుకో భీమ్స్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. చొచ్చుకుపోయే మనస్తత్వం లేకపోవడంవల్ల, స్వతహాగా బిడియస్తుణ్ణి కావడంవల్లే లైమ్‌లైట్‌లోకి రాలేకపోయానని భీమ్స్ అంటున్నారు. ‘బెంగాల్ టైగర్’తో ఆయన టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ మనోభావాలు...
 
పాట అంటే నాకు ప్రాణం. అదే నన్ను సినిమా రంగంవైపు లాక్కొచ్చింది. సూర్యనారాయణ రాజు (నటుడు, సహాయ దర్శకుడు) ద్వారా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డిగారితో, ఆయన ద్వారా దర్శకుడు ఎన్. శంకర్‌గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు శంకర్‌గారు ‘ఆయుధం’ సినిమా తీస్తున్నారు. ఆ చిత్రం కోసం నాతో ‘వొయ్ రాజు కన్నుల్లో నువ్వే..’ పాట రాయించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు రాశాను. ‘నువ్వా-నేనా’కి పని చేస్తున్నప్పుడు సంపత్ నందిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన తొలి చిత్రం ‘ఏమైంది ఈవేళకు’ నేనే పాటలు స్వరపరచాల్సింది. అనివార్య కారణాల వల్ల కుదర్లేదు. ‘బెంగాల్ టైగర్’కి అవకాశం ఇచ్చారు.
 
ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోని పాటలు హిట్టయ్యాయి. కానీ, సామాజిక మాధ్యమం ద్వారా యాక్టివ్‌గా ఉండకపోవడంవల్ల నా గురించి చాలామందికి తెలియదు. నా పాటలు మాత్రం వినిపిస్తుంటాయి. మనం తెలియక పోయినా మన పాట తెలిసింది కదా.. ఆ విధంగా సక్సెస్ అయినట్లే అని సంతృప్తి పడుతుంటాను. అయితే, కొంచెం ధోరణి మార్చుకోవాలనుకుంటున్నాను. అడగకపోతే అమ్మ అయినా పెట్టదంటారు కాబట్టి, చొరవగా వ్యవహరించాలనుకుంటున్నాను.
 
‘బెంగాల్ టైగర్’ నాకు పెద్ద బాధ్యత. సంపత్ నందిగారు, రవితేజగారు, రాధామోహన్‌గార్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాత్రీ, పగలూ తేడా లేకుండా పని చేశాను. పాటలు విని, చాలా బాగున్నాయని అభినందించారు. బయటివాళ్లు కూడా ప్రశంసించడంతో చాలా ఆనందపడ్డాను.

ఒక పెద్ద సినిమా చేసినప్పుడు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఆ విధంగా ‘బెంగాల్ టైగర్’ నా మైలేజ్‌ని పెంచింది. ‘బెంగాల్ టైగర్’ సంగీతదర్శకుడు అనే గుర్తింపు వచ్చింది. కొంతమంది పెద్ద దర్శక-నిర్మాతలు అవకాశం ఇస్తున్నారు. తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలనుకుంటున్నా. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటాను.
 
చిన్నప్పుడు ఏం చదువుకుంటావ్? అనడిగితే.. ‘పీజీ’ అని చెప్పేవాణ్ణి. దానర్థం కూడా తెలియని వయసది. చదువంటే ఉన్న ఇష్టంతో ఎం.ఎ. బీఎడ్ చేశాను. ఆ చదువు ఇచ్చిన జ్ఞానంతోనే పాటలు రాయగలిగాను. కానీ, సంగీతదర్శకునిగా అ..ఆలు, ఎక్కాలు అన్నీ నేను సినిమా పరిశ్రమలోనే నేర్చుకున్నా. నాకు మానసిక పరిపక్వత వచ్చింది కూడా సినిమా పరిశ్రమ కారణంగానే. ఇక్కడికి రాకపోయి ఉంటే ఓ సాదా సీదా వ్యక్తిగా మిలిగిపోయే వాణ్ణి. ధనార్జనే ధ్యేయంగా నేనిక్కడకు రాలేదు. పాట మీద ప్రేమతో వచ్చాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. క్వాలిటీ ట్యూన్స్ ఇవ్వడానికే ట్రై చేశాను. నా నిజాయతీ నన్ను నిలబెడుతుందని నమ్మాను. ‘బెంగాల్ టైగర్’వంటి పెద్ద అవకాశం దక్కడంతో నా నమ్మకం నిజమైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement