
‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్ నంది విజన్‌ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.
‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్‌తేజ. ‘‘ఇది థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు.
Comments
Please login to add a commentAdd a comment