music director bheems
-
ఆ డబ్బులతోనే ఇండస్ట్రీకి..
సాక్షి, మహబూబాబాద్ : ‘మా అమ్మ ప్రేమ గొప్పది.. చెప్పాలంటే మాటల్లో చెప్పలేనంత.. అమ్మ ఇచ్చిన డబ్బులతోనే సినిమా ఇండ్రస్టీలోకి అడుగు పెట్టాను’ అని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. ‘మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం. మా అమ్మ పేరు మాంగ్ని. నన్ను చిన్నప్పటి నుంచే చదువుకోవాలని మంచి ప్రయోజకనుడివి కావాలని అనేది. నాకు మ్యూ జిక్ అంటే చాలా ఇష్టం. సినిమా ఇండ్రస్టీకి వెళ్తా అంటే.. నీ ఇష్టాన్ని కాదంటానా అంది. సినిమా ఇండ్రస్టీలో అఫర్ల కోసం వెళ్లేందుకు డబ్బులు కావాలంటే కూలికి పోయి రూ.200 తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బులతోనే నేను రైలెక్కా. కాజీపేటకు వెళ్లేసరికి నా దగ్గర ఉన్న డబ్బులను ఎవరో కొట్టేశారు. దీంతో మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లా. అమ్మకు చెప్పాను నా డబ్బులు ఎవరో కొట్టేశారని. అయ్యో బిడ్డా అని నీ దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు ఆనందంగా ఉంటాడు.. నువ్వేమో బాధగా ఉంటావా అని అంది. వెంటనే వెళ్లి అమ్మ వేరే వాళ్ల దగ్గర అప్పు చేసి రూ.500 ఇచ్చింది. అప్పుడు హైదరాబాద్‌కు వచ్చి డైరెక్టర్ దగ్గరకు వెళ్లి సినిమాల్లో చాన్స్ పొందాను. మా అమ్మ నా అభివృద్ధి కోసం ఎంతో చేసింది. ఆనాడు అమ్మ డబ్బులు ఇవ్వకపోతే.. సినిమా ఇండ్రస్టీకి వచ్చేవాడిని కాదు. మా అమ్మ పరిశుద్ధ గ్రం«థంలాంటిది. ఇప్పటి వరకు నువ్వా నేనా, కెవ్వు కేక, గాలిపటం, మా కుర్రాళ్లు, అలా ఎలా, జోరు, బెంగాల్ టైగర్, ఎంజెల్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను. -
కరీంనగర్ జిల్లాకు రుణపడి ఉంటా
కరీంనగర్: తనను ఆదరించి అభిమానిస్తున్న కరీంనగర్ జిల్లాకు జన్మంతా రుణపడి ఉంటానని సినీ సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్వేత హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ జిల్లాకు చెందిన సినీ దర్శకులు సంపత్ నంది తనను ప్రోత్సాహించి గాలిపటం, బెంగాల్ టైగర్ తదితర చిత్రాలకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ అవకాశాలతోనే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. జిల్లాలోని కళాకారులకు, వాయిద్యకారులకు, పాటల రచయితలకు సినీ రంగంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏంజిల్, నక్షత్రం, గరడాబేగ, పేపర్‌బాయ్, నా పేరే రాజు తదితర చిత్రాలను సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ చిరంజీవి, ఫ్రీజ్ సినీమా హీరో సంపత్ మాట్లాడుతూ కరీంనగర్లో జరిగిన సంఘట కథాంశంగా త్వరలో సినిమా నిర్మిస్తున్నట్లు, ఆందులో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా ఘాటింగ్ కూడ 75 శాతం కరీంనగర్ జిల్లాలోని వివిధ లోకేషన్లలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొటక్షన్ ఫోరం చైర్మెన్ సొల్లు అజయ్‌వర్మ, సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు కాసరాజు, రవితేజ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రుద్ర భూపతి, ఫ్రీజ్ సినిమా దర్శకుడు సతీశ్ తదతరులు పాల్గొన్నారు. -
పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను!
‘నువ్వా-నేనా’తో సంగీతదర్శకునిగా భీమ్స్ సిసిరోలియా ప్రయాణం ఆరంభమైంది. ‘అలా ఎలా’, ‘జోరు’, ‘కెవ్వు కేక’, ‘గాలిపటం’ చిత్రాలకు స్వరాలందించారు. ఆ చిత్రాల్లోని పాటలు బాగున్నాయనే టాక్ వచ్చినా ఎందుకో భీమ్స్కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. చొచ్చుకుపోయే మనస్తత్వం లేకపోవడంవల్ల, స్వతహాగా బిడియస్తుణ్ణి కావడంవల్లే లైమ్‌లైట్‌లోకి రాలేకపోయానని భీమ్స్ అంటున్నారు. ‘బెంగాల్ టైగర్’తో ఆయన టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ మనోభావాలు... ► పాట అంటే నాకు ప్రాణం. అదే నన్ను సినిమా రంగంవైపు లాక్కొచ్చింది. సూర్యనారాయణ రాజు (నటుడు, సహాయ దర్శకుడు) ద్వారా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డిగారితో, ఆయన ద్వారా దర్శకుడు ఎన్. శంకర్‌గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు శంకర్‌గారు ‘ఆయుధం’ సినిమా తీస్తున్నారు. ఆ చిత్రం కోసం నాతో ‘వొయ్ రాజు కన్నుల్లో నువ్వే..’ పాట రాయించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు రాశాను. ‘నువ్వా-నేనా’కి పని చేస్తున్నప్పుడు సంపత్ నందిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన తొలి చిత్రం ‘ఏమైంది ఈవేళకు’ నేనే పాటలు స్వరపరచాల్సింది. అనివార్య కారణాల వల్ల కుదర్లేదు. ‘బెంగాల్ టైగర్’కి అవకాశం ఇచ్చారు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోని పాటలు హిట్టయ్యాయి. కానీ, సామాజిక మాధ్యమం ద్వారా యాక్టివ్‌గా ఉండకపోవడంవల్ల నా గురించి చాలామందికి తెలియదు. నా పాటలు మాత్రం వినిపిస్తుంటాయి. మనం తెలియక పోయినా మన పాట తెలిసింది కదా.. ఆ విధంగా సక్సెస్ అయినట్లే అని సంతృప్తి పడుతుంటాను. అయితే, కొంచెం ధోరణి మార్చుకోవాలనుకుంటున్నాను. అడగకపోతే అమ్మ అయినా పెట్టదంటారు కాబట్టి, చొరవగా వ్యవహరించాలనుకుంటున్నాను. ► ‘బెంగాల్ టైగర్’ నాకు పెద్ద బాధ్యత. సంపత్ నందిగారు, రవితేజగారు, రాధామోహన్గార్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాత్రీ, పగలూ తేడా లేకుండా పని చేశాను. పాటలు విని, చాలా బాగున్నాయని అభినందించారు. బయటివాళ్లు కూడా ప్రశంసించడంతో చాలా ఆనందపడ్డాను. ► ఒక పెద్ద సినిమా చేసినప్పుడు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఆ విధంగా ‘బెంగాల్ టైగర్’ నా మైలేజ్‌ని పెంచింది. ‘బెంగాల్ టైగర్’ సంగీతదర్శకుడు అనే గుర్తింపు వచ్చింది. కొంతమంది పెద్ద దర్శక-నిర్మాతలు అవకాశం ఇస్తున్నారు. తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలనుకుంటున్నా. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటాను. ► చిన్నప్పుడు ఏం చదువుకుంటావ్? అనడిగితే.. ‘పీజీ’ అని చెప్పేవాణ్ణి. దానర్థం కూడా తెలియని వయసది. చదువంటే ఉన్న ఇష్టంతో ఎం.ఎ. బీఎడ్ చేశాను. ఆ చదువు ఇచ్చిన జ్ఞానంతోనే పాటలు రాయగలిగాను. కానీ, సంగీతదర్శకునిగా అ..ఆలు, ఎక్కాలు అన్నీ నేను సినిమా పరిశ్రమలోనే నేర్చుకున్నా. నాకు మానసిక పరిపక్వత వచ్చింది కూడా సినిమా పరిశ్రమ కారణంగానే. ఇక్కడికి రాకపోయి ఉంటే ఓ సాదా సీదా వ్యక్తిగా మిలిగిపోయే వాణ్ణి. ధనార్జనే ధ్యేయంగా నేనిక్కడకు రాలేదు. పాట మీద ప్రేమతో వచ్చాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. క్వాలిటీ ట్యూన్స్ ఇవ్వడానికే ట్రై చేశాను. నా నిజాయతీ నన్ను నిలబెడుతుందని నమ్మాను. ‘బెంగాల్ టైగర్’వంటి పెద్ద అవకాశం దక్కడంతో నా నమ్మకం నిజమైంది.