ఆ డబ్బులతోనే ఇండస్ట్రీకి..
సాక్షి, మహబూబాబాద్ : ‘మా అమ్మ ప్రేమ గొప్పది.. చెప్పాలంటే మాటల్లో చెప్పలేనంత.. అమ్మ ఇచ్చిన డబ్బులతోనే సినిమా ఇండ్రస్టీలోకి అడుగు పెట్టాను’ అని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
‘మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం. మా అమ్మ పేరు మాంగ్ని. నన్ను చిన్నప్పటి నుంచే చదువుకోవాలని మంచి ప్రయోజకనుడివి కావాలని అనేది. నాకు మ్యూ జిక్ అంటే చాలా ఇష్టం. సినిమా ఇండ్రస్టీకి వెళ్తా అంటే.. నీ ఇష్టాన్ని కాదంటానా అంది. సినిమా ఇండ్రస్టీలో అఫర్ల కోసం వెళ్లేందుకు డబ్బులు కావాలంటే కూలికి పోయి రూ.200 తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బులతోనే నేను రైలెక్కా. కాజీపేటకు వెళ్లేసరికి నా దగ్గర ఉన్న డబ్బులను ఎవరో కొట్టేశారు. దీంతో మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లా.
అమ్మకు చెప్పాను నా డబ్బులు ఎవరో కొట్టేశారని. అయ్యో బిడ్డా అని నీ దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు ఆనందంగా ఉంటాడు.. నువ్వేమో బాధగా ఉంటావా అని అంది. వెంటనే వెళ్లి అమ్మ వేరే వాళ్ల దగ్గర అప్పు చేసి రూ.500 ఇచ్చింది. అప్పుడు హైదరాబాద్‌కు వచ్చి డైరెక్టర్ దగ్గరకు వెళ్లి సినిమాల్లో చాన్స్ పొందాను. మా అమ్మ నా అభివృద్ధి కోసం ఎంతో చేసింది. ఆనాడు అమ్మ డబ్బులు ఇవ్వకపోతే.. సినిమా ఇండ్రస్టీకి వచ్చేవాడిని కాదు. మా అమ్మ పరిశుద్ధ గ్రం«థంలాంటిది. ఇప్పటి వరకు నువ్వా నేనా, కెవ్వు కేక, గాలిపటం, మా కుర్రాళ్లు, అలా ఎలా, జోరు, బెంగాల్ టైగర్, ఎంజెల్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను.