
సాధారణంగా కొన్ని ఫొటోల్లో ఏం దాగుందో చెప్పడం కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఒక పజిల్ రూపంలో ఉన్న ఫొటోలో ఏం కనిపిస్తోందని ఎవరైనా అడిగితే మన కంటికి కాస్త పని చెప్పాల్సిందే. ఇక అంటువంటి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాగర్ డామ్లే అనే ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తాను తీసిన రెండు ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన మొదటి ఫొటోను చూస్తే ముందుగా అడవిలో ఉన్న దట్టమైన పొదలు కనిపిస్తాయి. కానీ, అలానే నిశితంగా పరిశీలిస్తే పొదల్లో దాక్కొని ఉనక్న ఓ జంతువు శరీరంపై చారలు ఉన్నట్లు గమనించవచ్చు. దాన్ని స్పష్టంగా గుర్తించాలంటే మాత్రం కొంత కష్టపడాల్సిందే. అప్పుడే మాత్రమే ఆ పొదల్లో కనిపిస్తున్న జంతువు టైగర్ అని తెలుస్తుంది.
‘మొదటి ఫొటో సాధరణమైంది. రెండోది నైపుణ్యంతో నా కెమెరాలో బంధించింది. రెండు ఫొటోల్లోనూ ఆ బెంగాల్ టైగర్ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు పులిని చూశారా? లేదా? అనేది మీ అదృష్టం’ అని సాగర్ డామ్లే కాప్షన్ జతచేశారు. ఈ చిత్రాన్ని ఆయన కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘పులులు చుట్టు పక్కల ఉన్నాయని గుర్తించినప్పుడు మాత్రమే వాటిని చూడగలం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రెండు వేర్వేరు యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలను ఎలా తీశారు’, ‘కొన్ని జంతువులు ఆడవిలో మనల్ని ఎక్కడి నుంచైనా చూడగలవు’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.