డేట్స్ క్లాష్ వద్దు గురూ! | do not clash for movie release dates! | Sakshi
Sakshi News home page

డేట్స్ క్లాష్ వద్దు గురూ!

Published Tue, Nov 17 2015 12:06 AM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM

డేట్స్ క్లాష్ వద్దు గురూ! - Sakshi

డేట్స్ క్లాష్ వద్దు గురూ!

సినిమా విడుదలైందా? వారంలోపే వసూళ్లు రాబట్టేశామా? అన్న చందంగా ప్రస్తుతం సినిమా మార్కెట్ ఉంది. వారం, పది రోజుల్లోనే వసూళ్లు రాబట్టేయాలంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. ఫలితంగా వేరే సినిమాకు థియేటర్లు అంతగా దక్కవు. మరి, ఒకేరోజు రెండు, మూడు పెద్ద సినిమాలంటే థియేటర్లు కష్టమే. అదేగనక నిర్మాతలందరూ ఒక అవగాహనతో ఉంటే... కలిసి మాట్లాడుకుంటే...

ఏ సినిమాకీ నష్టం కలగని రీతిలో రిలీజ్‌లు ప్లాన్ చేయొచ్చు. ‘బాహుబలి’ కోసం ‘శ్రీమంతుడు’ విడుదలను వాయిదా వేసుకొన్న విషయం తెలిసిందే. రానున్న ఇరవై రోజుల్లో విడుదల కావాల్సిన మూడు సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడిదే జరిగింది. ఆ చిత్ర నిర్మాతలు మాట్లాడుకొని, తమలో తాము పోటీ పడకుండా... తమ చిత్రాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...

 
ఈ 27నే... ‘సైజ్ జీరో’
ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్‌లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.

కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది.
 
డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’

వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు.

ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా,  ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు.
 
ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’
 నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం.

‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది.
 
మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి.  వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్‌లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు.
 
అవగాహనతో ఉంటే... అందరికీ లాభం!

ప్రస్తుతం ఏ సినిమా స్పాన్ అయినా వారం రోజులు మాత్రమే ఉంటోంది. అందుకే మేము ముగ్గురం కలిసి, మాట్లాడుకున్నాం. రాధామోహన్  రియల్ హీరో అనాలి. ఎందుకంటే, ‘అఖిల్’ చిత్రం కోసం ఆయన ‘బెంగాల్ టైగర్’ విడుదలను వాయిదా వేశారు.

నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నారు కానీ, అప్పటికే మేం విడుదల తేదీ ప్రకటించేశాం. దాంతో మళ్లీ వాయిదా వేశారు. ‘శంకరాభరణం’ కోసం ఏకంగా డిసెంబర్ 10ని విడుదల తేదీగా ఫిక్స్ చేశారు. నిర్మాతలందరూ ఇలా మంచి అవగాహనతో ముందుకెళితే అందరికీ మంచి జరుగుతుంది
 - పొట్లూరి వి. ప్రసాద్
 
నిర్మాతలందరూ బాగుండాలి!
 అసలు ఈ నెల 5న ‘బెంగాల్ టైగర్’ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘అఖిల్’ సినిమా పోస్ట్‌పోన్ అయింది. మా సినిమాకూ, ‘అఖిల్’కూ డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే కావడంతో మా చిత్రాన్ని అనివార్యంగా 27కి వాయిదా వేశాం. ఆ డేట్ అనుకు న్నాక ‘సైజ్ జీరో’ గురించి తెలిసింది. పీవీపీగారు కలిసి, మాట్లాడిన  తర్వాత ఓ అవగాహనకు వచ్చాం. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మా  ‘బెంగాల్ టైగర్’ని డిసెంబర్ 10న రిలీజ్ చేస్తున్నాం. నిర్మాతలందరూ బాగుండాలన్నది నా ఆకాంక్ష.
 - కేకే రాధామోహన్
 
ఆ అపోహ వద్దు!
ఒకేరోజు రెండు, మూడు సినిమాలు విడుదలైతే థియేటర్ల విషయంలో కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకే క్లారిటీగా మేం నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 20న ‘శంకరాభరణం’ను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల విడుదల ఉండటంతో డిసెంబర్ 4కి వాయిదా వేశాం.

రాధామోహన్‌గారు పెద్ద మనసు చేసుకుని ‘బెంగాల్ టైగర్’ని వాయిదా వేశారు. ఒక సినిమా వాయిదా పడిందంటే.. కచ్చితంగా రీషూట్ చేయడం కోసమే అని అపోహపడే అవకాశం ఉంది. కానీ, అలాంటిదేమీ లేదు. కేవలం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే మేం ముగ్గురం కలసి ఈ నిర్ణయం తీసుకున్నాం.
 - కోన వెంకట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement