ఆ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించం
ముంబై: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, సహా కొందరు నిర్మాతలకు థియేటర్ యజమానులు షాకిచ్చారు. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని యజమానులు నిర్ణయించారు. విడుదలకు సిద్ధమైన కరణ్ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్లో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కష్టాల్లో పడింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సినిమాపై నిషేధం విధించారు.
జమ్ము కశ్మీర్లో ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు తర్వాత పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించింది. అంతేగాక పాక్ నటులకు అవకాశం ఇవ్వరాదని, ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంఎన్ఎస్ హెచ్చరించింది. తాజాగా పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఇరకాటంలో పడ్డారు.